ఇక ఢిల్లీలో ‘ఉన్నావ్‌’ విచారణ

Supreme Court orders transfer of Unnao cases to Delhi CBI court - Sakshi

యూపీ నుంచి బదిలీ చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు

బాధితురాలికి 25 లక్షల తాత్కాలిక పరిహారం

ప్రధాన కేసు విచారణను 45 రోజుల్లో ముగించాలని ఆదేశం

న్యూఢిల్లీ: ఉన్నావ్‌ అత్యాచార ఘటనకు సంబంధించి నమోదైన మొత్తం ఐదు కేసులనూ ఉత్తరప్రదేశ్‌ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. అలాగే బాధితురాలికి తక్షణమే రూ. 25 లక్షల తాత్కాలిక పరిహారం అందజేయాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని నిర్దేశించింది. గత ఆదివారం ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి కారును ట్రక్కు ఢీకొట్టిన ఘటనపై దర్యాప్తును వారం రోజుల్లోనే పూర్తి చేయాలని కూడా సీబీఐకి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

అలాగే ఉన్నావ్‌ అత్యాచర ఘటన ప్రధాన కేసు విచారణను ప్రారంభించిన నాటి నుంచి 45 రోజుల్లోపే పూర్తి చేయాలని కూడా సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు అత్యాచారం చేసిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ను తమ పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. కాగా, బాధితురాలికి భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఆమె భద్రత కోసం గతంలో కేటాయించిన ముగ్గురు పోలీస్‌ సిబ్బందిని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. కానీ ఇది సరిపోదనీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డీజీపీ ఓపీ సింగ్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) డిమాండ్‌ చేస్తోంది.

2017లో కుల్దీప్‌ సెంగార్‌ తనపై అత్యాచారం చేశాడని 2018లో ఉన్నావ్‌కు చెందిన యువతి ఆరోపించగా, పోలీసులు ఆమె తండ్రినే అరెస్టు చేసి లాకప్‌లోనే ఆయన చనిపోయేలా చేయడం తెలిసిందే. బాధిత యువతి గత ఆదివారం తన ఇద్దరు సమీప బంధువులు, లాయర్‌తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ఆ కారును ట్రక్కుతో ఢీకొట్టి వారందరినీ చంపే ప్రయత్నం జరిగింది. యువతి బంధువులైన ఇద్దరు మహిళలు మరణించగా, యువతి, ఆమె లాయర్‌ తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం లక్నోలోని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనపై విచారణను ఇప్పటికే ప్రారంభించిన సీబీఐ, 10 మందిపై హత్యానేరం మోపింది.

సత్వర విచారణ కోసం ఏకపక్ష ఆదేశాలు
ఉన్నావ్‌ అత్యాచార కేసు పరిస్థితులు, అసాధారణ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని, విచారణను వేగవంతం చేసే ఉద్దేశంతో నిందితుల తరఫు వాదనలు వినకుండానే తాము ఏకపక్ష ఆదేశాలు ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఒకవేళ ఏవైనా అసాధారణ పరిస్థితులు ఉంటే మాత్రమే ప్రమాద ఘటనపై దర్యాప్తును ముగించేందుకు సీబీఐకి అదనంగా మరో వారం రోజులపాటు గడువు ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం వెల్లడించింది. అన్ని కేసులనూ ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్ట్స్‌లోని జడ్జి ధర్మేశ్‌ శర్మ విచారిస్తారని చెప్పింది. ఓ రహస్య సమావేశం అనంతరం సుప్రీం జడ్జీలు ధర్మేశ్‌ శర్మ పేరును ఖరారు చేశారు. ఈ ఆదేశాలను మార్చాలని లేదా రద్దు చేయాలని వచ్చే ఏ పిటిషన్‌నూ విచారణకు స్వీకరించబోమంది.

కుల్దీప్‌పై బీజేపీ వేటు
ఉన్నావ్‌ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, బీజేపీపై విమర్శలు వస్తుండటంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ను బీజేపీ తమ పార్టీ నుంచి బహిష్కరించింది. బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. కుల్దీప్‌ను బహిష్కరించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుందనీ, ఆ విషయాన్ని ప్రకటించాల్సిందిగా బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్వతంత్ర సింగ్‌కు ఫోన్‌లో చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. కుల్దీప్‌ ఇప్పటికే జైల్లో ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ బీజేపీలో ఓ నేరస్తుడికి అధికారం ఇచ్చినట్లు ఎట్టకేలకు ఆ పార్టీ ఒప్పుకుందన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top