ఆత్మహత్యాకేంద్రంగా అమెరికా!

Suicide Rates Rise In America - Sakshi

 ఆర్థిక అసమానతలూ, సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితమేనంటోన్న నిపుణులు

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో ఆత్మహత్యలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. 2007 నుంచి 2016 వరకు ప్రతియేటా ఆత్మహత్యలకు పాల్పడుతోన్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అమెరికాలోని మరణాలకు తొలి పది ప్రధాన కారణాల్లో ఆత్మహత్య ఒకటి. అక్కడ ప్రతియేటా 44,965 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతి 12.3 నిముషాలకూ ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రతి ఐదుగురిలో ఒకరు మహిళ. 2016లో ఆత్మహత్యల రేటు అత్యధికంగా 19.72. అంతకు ముందు 85 ఏళ్ళలో ప్రతియేటా అత్యధికంగా 18.98 శాతం అమెరికన్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్యచేసుకున్న వాళ్ళు అప్పటికి పదుల సార్లు అందుకు ప్రయత్నించిన వారే.

ప్రతిరోజూ సగటున 123 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో  45 నుంచి 54 ఏళ్ళమధ్య వయస్కులైన వారే ఎక్కువ. అమెరికా యువతలో ఆత్మహత్యలు తక్కువ.  2016లో జరిగిన ఆత్మహత్యల్లో 51 శాతం తుపాకులతో కాల్చుకొని మరణించినవే. మహిళలకన్నా పురుషులు 3.53 రెట్లు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
 
పశ్చిమ యూరప్‌తో పోల్చుకుంటే అమెరికాలో సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చిస్తోంది చాలా తక్కువనే స్పష్టమౌతోంది. ఉదాహరణకు అమెరికా జిడిపిలో కేవలం 18.8 శాతం  మాత్రమే సంక్షేమ రంగానికి కేటాయిస్తున్నారు. మిగిలిన చాలా దేశాల్లో ఆయా దేశాల ఆర్థికాభివృద్ధిలో కనీసం 25 శాతం ఆ దేశ సంక్షేమ కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు.

అమెరికాలో పేద, ధనిక అంతరాలు సైతం అక్కడ ఆత్మహత్యలు పెరగడానికి కారణమౌతోంది. సోషల్‌ స్ట్రెయిన్‌ థియరీననుసరించి ఎక్కడైతే ధనిక పేదల మధ్య తారతమ్యాలు అధికంగా ఉంటాయో అక్కడ అట్టడుగు వర్గాలు అవస్థలు పడతారు. అందులోనుంచే వ్యసనాలకు బానిసలౌతారు. నేరప్రవృత్తి పెరుగుతుంది, మానసిక కుంగుబాటు మొదలవుతుంది.  మొత్తంగా ఆర్థిక ఆసమానతలూ, సంక్షేమ పథకాలను విస్మరించడం అనే రెండు కీలకమైన విషయాలు సమాజంలో అంతరాలను పెంపొందించడమేకాకుండా అదే ఆత్మహత్యలకు ఒక  ప్రధాన కారణంగా తయారైనట్టు అక్కడి పరిశోధకులు భావిస్తున్నారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top