అతివేగంతో ఉన్న రైలును అందుకోలేక...

Student Killed While Boarding Running Train in Chirala - Sakshi

సాక్షి, ప్రకాశం : చీరాల రైల్వే స్టేషన్‌లో శుక్రవారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. అతి వేగంతో ఉన్న రైలు ను ఎక్కేందుకు యత్నించిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి  దుర్మరణం చెందాడు. మృతుడిని దర్శి మండలం సామంతపూడికి చెందిన కడకలుపు వెంకట శివ (18)గా గుర్తించారు. ఆ వీడియోను పోలీసులు మీడియాకు విడుదల చేశారు.

శివ బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం సివిల్‌ విభాగంలో చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి అక్కడ హాస్టల్‌లోనే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి తన ముగ్గురు స్నేహితులతో కలిసి చెన్త్నెలో జరిగే ఎడ్యుకేషన్‌ సెమినార్‌లో పాల్గొనేందుకు బాపట్ల నుంచి హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరాడు. అయితే మంచినీటి కోసం దిగిన అతను.. రైలు కదులుతుండటం గమనించిన రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. రైలు వేగం ఎక్కువగా ఉండటంతో అతడి కాలు జారడంతో బోగి.. ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కుపోయాడు. 

ప్రమాదంలో శివ కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. వెంటనే స్పందించిన స్నేహితులు క్షతగాత్రుడిని చికిత్సకు తరలించేందుకు చీరాల 108 సిబ్బందికి ఫోన్‌ చేశారు. అప్పటికే వాహనం మరో ప్రాంతానికి వెళ్లి ఉండటంతో చేసేది లేక ఆటోలో చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్‌.. క్షతగాత్రుడు వెంకట శివను పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీఆర్పీ ఎస్‌ఐ రామిరెడ్డి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమాచారం అందుకున్న మృతుడి తల్లిదండ్రులు వెంకటాద్రి, సత్యవతితో పాటు తోటి విద్యార్థులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. 

శోకంలో సన్నిహితులు...
ప్రైవేట్‌ స్కూలు టీచర్‌గా పనిచేసే వెంకటాద్రికి నలుగురు సంతానం. వారిలో ముగ్గురు అమ్మాయిలు. వెంకట శివ చివరివాడు. కుటుంబ సభ్యులంతా గారాబంగా చూసుకునేవారు. అతడు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవారు. చదువులో కూడా వెంకట శివ అందరికంటే ముందుండేవాడు. చలాకీగా అందరితో కలసిమెలసి తిరిగేవాడు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని కుటుంబానికి అండగా ఉంటాడని భావించిన ఆ కుటుంబానికి కుమారుడి మరణం తీరని లోటు మిగిల్చింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top