వైన్స్‌లో కల్తీ మద్యం

Spurious Liquor Making Gang Arrested In Podili Prakasam - Sakshi

సాక్షి, పొదిలి (ప్రకాశం): స్థానిక ఆర్టీసీ సెంటర్‌ గేట్‌ ఎదుట ఉన్న జీఆర్‌ వైన్స్‌లోని పర్మిట్‌ రూమ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్కడ కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం వైన్స్‌పై కూడా దాడులు నిర్వహించారు. స్థానిక ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌లో సాయంత్రం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వై.శ్రీనివాస చౌదరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో కల్లీ మద్యం తయారీ, విక్రయాలకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని విక్రయిస్తున్న ఇద్దరితో పాటు, లైసెన్స్‌దారుడు, నిర్వాహకులు మొత్తం నలుగురిపై కేసులు నమోదు చేశామని చెప్పారు.

దుకాణం సిబ్బందిని విచారించగా దుకాణం లీజుదారుడి సూచనల మేరకే తాము ఈ పని చేస్తున్నట్లు అంగీకరించారన్నారు. లైసెన్స్‌ మద్యం దుకాణం ద్వారా కల్తీకి పాల్పడుతున్నందున జీఆర్‌ దుకాణం లైసెన్స్‌ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫారస్‌ చేసినట్లు అసిస్టెంట్‌ కమిషనర్‌ తెలిపారు. లైసెన్స్‌దారుడు వి.అనిల్, లీజుదారుడు జి.రమణారెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు. దుకాణంలో ఉన్న 2604 మద్యం సీసాలు, 216 బీరు బాటిళ్లు, రూ.5003 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దుకాణంలో పనిచేస్తున్న షాహిద్, అబ్దుల్‌ జబ్బార్‌లను అరెస్టు చేశామన్నారు. లైసెన్స్‌దారుడు, లీజుదారుడిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని చౌదరి వివరించారు.

వెంటనే సమాచారం ఇవ్వాలి
మద్యం దుకాణాలకు సంబంధించి అక్రమాలు జరుగుతుంటే వెంటనే సమాచారం అందించాలని చౌదరి కోరారు. కల్తీ జరుగుతున్నా, అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా, గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నా తమ దృష్టికి తీసుకరావాలని సూచించారు. మర్రిపూడి మండలం జంగాలపల్లి దుకాణంపై దాడి చేసి లోపాలు గుర్తించి లైసెన్స్‌ ఆపేందుకు ఉన్నతాధికారులకు సిఫారస్‌ చేశామని చెప్పారు. వై.పాలెం, గిద్దలూరు, కనిగిరి, చీరాల పరిధిలో నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించి దాడులు నిర్వహించామని స్పష్టం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top