జోరుగా సింగిల్‌ నంబర్‌ ఆట

Single Number Lottery Games in Guntur - Sakshi

గుంటూరు నగరంలో నెలకు రూ. కోటికి పైగా బెట్టింగ్‌లు

కిందిస్థాయి పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో దోపిడీ  

ఓ లాడ్జి కేంద్రంగా జూదం నిర్వహణ   

గుంటూరు ఈస్ట్‌: గుంటూరు నగరంలో సింగిల్‌ నంబర్‌ ఆట జోరుగా సాగుతోంది. నెలకు కోటి రూపాయలకు పైగా బెట్టింగ్‌ల కింద కాయకష్టం చేసుకునే పేద, మధ్య తరగతి వ్యక్తుల కష్టార్జితాన్ని నిర్వాహకులు దోచుకుంటున్నారు. ఒక అరండల్‌పేటలోనే వంద మీటర్ల దూరంలో మూడు చోట్ల సింగిల్‌ నంబర్‌ ఆట నిర్వహిస్తున్నారంటే ఏ స్థాయిలో నడుస్తోందో చెప్పనవసరం లేదు. నిర్వాహకులకు పోలీసుల అండదండలు లేనిదే ఇది కొనసాగదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క కొరిటిపాడు పరిధిలో నెలకు రూ. 30 లక్షలకు పైగా చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. అమరావతి రోడ్డు, స్వర్ణభారతీ నగర్‌ తదితర ప్రాంతాలలోనూ నిర్వాహకులు ధైర్యంగా మెయిన్‌ రోడ్లలోని చిన్నచిన్న బంకులు కేంద్రంగా సింగిల్‌ నంబర్‌ ఆట నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ నేపథ్యంలో అన్ని కాలనీలలో పెద్దసంఖ్యలో రోజు వారి కూలీలలతోపాటు మధ్య తరగతివారు పోటీ పడి టికెట్లు కొంటున్నారు. ప్రధాన నిర్వాహకుడు ఓ ఖరీదైన లాడ్జిలో ఉండి అన్ని కాలనీల్లో ఆర్థికంగా చితికిపోయిన వ్యక్తుల్ని మధ్యవర్తులుగా నియమించాడు. కొందరికి కమీషన్‌ రూపంలో, కొందరికి రోజుకు కొంత మొత్తం చెల్లిస్తూ కిందిస్థాయి పోలీసుల ద్వారా మామూళ్లూ పంపుతూ ధైర్యంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఆట ఆటకు ఓ పేరు
సినీ నటి శ్రీదేవి మరణించిన రెండు రోజుల నుంచి ప్రారంభించిన ఆటకు శ్రీదేవి అని పేరు పెట్టారు. కల్యాణి, శ్రీదేవి, టైజజార్, మెలాండే, వివిధ పేర్లతో నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో అన్ని కాలనీల్లో టిక్కెట్లు విక్రయిస్తున్నారు. 11.30 నిమిషాలకు మొదటి ఫలితాలు వస్తాయి. 12.30కు రెండో ఫలితం, 1 గంటకు 3 ఫలితం వెల్లడవుతాయి. సాయంత్ర 5 గంటలకు ముగుస్తాయి. బాంబే పేరుతో నిర్వహించే ఆట రాత్రంతా కొనసాగుతుంది. టికెట్‌ మీద ఉన్న నంబర్‌ తగిలితే 10 రూపాయలకు 70 , 100 రూపాయలకు 700 ఇస్తారు. ఈ ఆశతో ఎక్కువ మంది డబ్బులు వెచ్చిస్తున్నారు.అయితే, నెంబర్‌ తగిలేది కొంతమందికే.

పబ్లిక్‌గా రోజువారి వసూళ్లు
సింగిల్‌ నంబర్‌ ఆటల నిర్వాహకుల నుంచి కానిస్టేబుళ్లు, హోంగార్డులు పబ్లిక్‌గా రోజువారి మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్టు వదిలేస్తున్నరని విమర్శలు వినిపిస్తున్నాయి. రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీనగర్‌ ఠాగూర్‌ బొమ్మ సెంటర్, అరండల్‌పేట 7వ లైను, పిచ్చుకల గుంట గోడ పక్కన ఆటలు నిర్వహిస్తున్నారని స్థానికులు వీడియో, ఫోటోలు తీసి రుజువు చూపిస్తున్నారు. ఆయా పోలీస్‌ స్టేషన్‌లలో పనిచేస్తున్న హోంగార్డులు, కానిస్టేబుళ్లు ఆ సమయంలో వెళ్లి పబ్లిక్‌గా మామూళ్లు తీసుకుంటుంటారని స్థానికులు విమర్శిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top