ఎర్రస్మగ్లర్లు ఉన్నట్టా.. లేనట్టా? | Sakshi
Sakshi News home page

ఎర్రస్మగ్లర్లు ఉన్నట్టా.. లేనట్టా?

Published Mon, Jul 20 2020 9:46 AM

Sandalwood Smugglers in Seshachalam Forest Tirupati - Sakshi

చిత్తూరు, వైఎస్సార్‌ కడప, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని శేషాచలం అడవుల్లో ఏ గ్రేడ్‌ ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి. దీనికి విదేశాల్లో విశేష డిమాండ్‌ ఉంది. దీంతో స్మగ్లర్లు కొండలు, కోనలు దాటి ఎర్రచందనం దుంగలను రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం అటవీశాఖకు సహాయంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. ఇందులో 200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే అటవీ శాఖలో శాశ్వత ఉద్యోగులు 400 మందికి పైగా ఉన్నారు. రెండు శాఖల అధికారుల మధ్య సమన్వయం లోపించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధిత శాఖల అధికారుల విభిన్న ప్రకటనలు బలాన్ని చేకూరుస్తున్నాయి.  

తిరుపతి అర్బన్‌:  శేషాచలం అడవుల్లో ప్రధానంగా తమిళనాడుకు చెందిన ఎర్రస్మగ్లర్ల తాకిడి ఎక్కువగా ఉంటోంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కూలీలు, స్మగ్లర్లు శేషాచలం అడవులను వదిలిపెట్టి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. లాక్‌డౌన్‌ సడలింపులతో మళ్లీ విజృంభిస్తున్నారు. పది రోజులుగా మళ్లీ తమిళనాడు నుంచి ఎర్రస్మగ్లర్లు గుంపులుగా శేషాచలం అడవుల్లోకి వచ్చారని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తెలిపారు. నాలుగు రోజుల వ్యవధిలోనే 2 టన్నులకు పైగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.2 కోట్లకు పైగా ఉంటుంది. ఒక్క స్మగ్లర్‌నూ పట్టుకోలేదు. 50 మంది స్మగ్లర్లను గుర్తించామని, వారు రాళ్ల దాడులు చేసి పరారయ్యారని అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ ముందు తమిళ స్మగ్లర్లు డంపింగ్‌ చేసిన ఎర్రదుంగలను కొత్తగా పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు వాదన మరోలా ఉంది. బీట్, సెక్షన్‌ ఆఫీసర్లతోపాటు డీఆర్‌ఓలు, ఎఫ్‌ఆర్‌ఓలు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నిత్యం అడవుల్లో సంచరిస్తూన్నారని అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ఒక్క స్మగ్లర్‌ కూడా అడవుల్లోకి వెళ్లలేదని పేర్కొంటున్నారు. ఇలా రెండు శాఖల అధికారులు విభిన్న ప్రకటనలు చేయడంతో గందరగోళం నెలకొంది. అడవుల్లో స్మగ్లర్లు ఉన్నట్టా.. లేక ఒక్కరిని కూడా లోపలికి వెళ్లకుండా నిరోధించారా అన్న దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

తమిళ స్మగ్లర్ల గుంపులున్నాయి  
తమిళ స్మగ్లర్లు వారం పది రోజులుగా శేషాచలం అడవుల్లో  గుంపులుగా చేరారు. అడవుల్లో కూంబింగ్‌ చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిపై రాళ్ల దాడులు చేస్తున్నారు. చంద్రగిరి సమీపంలోని భీమవరం క్రాస్‌ ఫారెస్ట్‌లో 30 మంది ఎర్రస్మగ్లర్లు మా వాళ్లపై దాడులు చేశారు. మా సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో స్మగ్లర్లు పరారయ్యారు. 34 ఎర్రదుంగలను స్వాధీనం చేసుకున్నాం. వాటి విలువ రూ.1.5 కోట్లపైమాటే. తమిళ్ల స్మగ్లర్లు కోవిడ్‌–19ను సైతం లెక్కచేయకుండా శేషాచలం అడవుల్లోకి వస్తున్నారు. అందులో సందేహం లేదు.–రవిశంకర్, టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ, తిరుపతి

Advertisement
Advertisement