రిలీవ్‌ కావాలని ఒత్తిడి చేస్తున్నారు..! | Releav issue ESI Director Doctor Sarala Complaint In Visakhapatnam | Sakshi
Sakshi News home page

రిలీవ్‌ కావాలని ఒత్తిడి చేస్తున్నారు..!

Jul 3 2018 12:28 PM | Updated on Jul 3 2018 12:28 PM

Releav issue ESI Director Doctor Sarala Complaint In Visakhapatnam - Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌ వద్దకు వచ్చిన డాక్టర్‌ టి. సరళ

లబ్బీపేట(విజయవాడతూర్పు): పదోన్నతి పొందిన తర్వాత విధుల నుంచి రిలీవ్‌ అయ్యేందుకు తనకు  15 రోజులు సమయం ఉన్నా తన పోస్టులో నియమితులైన వైద్యుడు, వెంటనే తప్పుకుని ఛార్జి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని ఈఎస్‌ఐ ఇన్‌చార్జి జాయింట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్‌ టి. సరళ సోమవారం మాచవరం పోలీసులకు ఫిర్యాదుచేశారు. తమ కార్యాలయ సిబ్బంది ముందు అసభ్యంగా, అవమానకరంగా మాట్లాడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..

కాకినాడ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో డెప్యూటీ సివిల్‌ సర్జన్‌ (డీసీఎస్‌)గా ఉన్న డాక్టర్‌ టి. సరళ గత ఏడాది మే నెల నుంచి  విజయవాడలో ఈఎస్‌ఐ ఇన్‌చార్జి జాయింట్‌ డైరెక్టర్‌గా డెప్యూటేషన్‌పై బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల ఈఎస్‌ఐలో డెప్యూటీ సివిల్‌ సర్జన్స్‌కు సివిల్‌ సర్జన్‌గా పదోన్నతులు ఇచ్చారు. దీంతో ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌ కార్యాలయంలో డీసీఎస్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ జగదీప్‌గాంధీ సివిల్‌ సర్జన్‌గా పదోన్నతి పొంది విజయవాడ జాయింట్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అదే సమయంలో డాక్టర్‌ టి. సరళకు కూడా పదోన్నతి రావడంలో ఆమెకు విశాఖపట్నంలో పోస్టింగ్‌ ఇచ్చారు.

చార్జి ఇవ్వకుండా కార్యాలయానికి ఎలా వస్తారు
కాగా పదోన్నతి పొందిన మరుసటి రోజునే డాక్టర్‌ జగదీప్‌గాంధీ జాయింట్‌ డైరెక్టర్‌గా చేరుతూ డైరెక్టరేట్‌ కార్యాలయంలో రిపోర్టు చేశారు. కాగా ఆ స్థానంలో ఉన్న డాక్టర్‌ టి. సరళ తాను రిలీవ్‌ అయ్యేందుకు పదిహేను రోజుల సమయం ఉండటంతో అప్పటివరకూ అక్కడే కొనసాగాలని భావించారు. అయితే తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు ఉండటానికి వీల్లేదని వేధిస్తూ, సిబ్బంది ముందు అవమానకరంగా మాట్లాడుతున్నారంటూ మీడియా ఎదుట సరళ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చార్జి ఇవ్వకుండా ఎలా తన కార్యాలయానికి వస్తారంటూ ప్రశ్నించారు. తాను డెప్యూటేషన్‌పై ఉన్నందున, జేడీగా డాక్టర్‌ జయదీప్‌ చేరినా జీతం విషయంలో ఇబ్బంది ఏమి ఉండదని చెప్పినా వినకుండా వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మహిళా వైద్యురాలి నుంచి పిర్యాదు స్వీకరించిన మాచవరం పోలీసులు ప్రాథమిక విచారణ చేయనున్నట్లు తెలిపారు.

వేధింపులకు పాల్పడలేదు: డాక్టర్‌ జగదీప్‌ గాంధీ
తాను మహిళా వైద్యురాలిపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని డాక్టర్‌ జగదీప్‌ గాంధీ తెలిపారు. పదోన్నతి వచ్చిన తర్వాత రెగ్యులర్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా డైరెక్టరేట్‌ కార్యాలయంలో రిపోర్టు చేశానన్నారు. అనంతరం కార్యాలయానికి రాగా అప్పటి వరకు ఇన్‌చార్జి జేడీగా ఉన్న  డాక్టర్‌ సరళ తనకు ఛార్జి ఇవ్వనన్నారు. అయినా నేనేమీ అనలేదని చెప్పారు. అనంతరం స్టాప్‌ మీటింగ్‌ పెట్టగా ఇద్దరూ ఉంటే మేము ఎవరి ఆదేశాలు పాటించాలని ప్రశ్నించారన్నారు. తాను రెగ్యులర్‌గా ఈ పోస్టులో నియమితులయ్యానని,  డైరెక్టర్‌ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని చెప్పడంతో సిబ్బంది ఫోన్‌ చేసి నిర్ధారించుకున్నారన్నారు. అంతేకాని, తాను ఎలాంటి ఒత్తిడి, వేధింపులకు పాల్పడలేదని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement