మృత్యు చక్రం

Private Bus Tire Bursted Accident To Bike - Sakshi

 ఊడిన ప్రైవేట్‌ బస్సు ముందు చక్రం

ద్విచక్రవాహనం మీదుగా వేగంగా దూసుకెళ్లిన టైరు

బైక్‌పై కూర్చున్న ఉపాధి     ఏపీఓ నాగమణి దుర్మరణం

తీవ్రంగా గాయపడ్డ ఫీల్డ్‌     అసిస్టెంట్‌ ఎర్రిస్వామి

ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి

అనంతపురం – బళ్లారి రహదారిపై వేగంగా వెళుతున్న ప్రైవేట్‌ బస్సు ముందుచక్రం ఉన్నట్టుండి ఊడి ద్విచక్రవాహనం మీదుగా దూసుకెళ్లింది. బైక్‌పై నుంచి కిందపడ్డ ఉపాధి హామీ ఏపీఓ నాగమణిపై టైరు భారీ కుదుపుతో వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. గాయపడ్డ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎర్రిస్వామి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

అనంతపురం, కూడేరు: అనంతపురంలో నివాసం ఉంటున్న నాగమణి (40) కూడేరు మండల ఉపాధి హామీ పథకం ఏపీఓగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం యథావిధిగా విధులకు హాజరయ్యారు. సాయంత్రం మూడున్నర తర్వాత అరవకూరులో ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ ఉండటంతో కూడేరు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎర్రిస్వామి(28)ని వెంటబెట్టుకుని అతని ద్విచక్రవాహనంలో బయల్దేరారు. ఇదే సమయంలో అనంతపురం నుంచి టీబీ డ్యాంకు ఎస్‌ఎన్‌ఎస్‌ఎంఎస్‌ ప్రైవేట్‌ బస్సు ప్రయాణికులతో వెళుతోంది. సరిగ్గా అరవకూరు వద్దకు రాగానే బస్సు కుడివైపున గల ముందు చక్రం ఊడి వేగంగా ద్విచక్రవాహనానికి తగిలింది. కిందపడ్డ ఏపీఓ నాగమణిపై బలంగా టైరు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ నడుపుతున్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎర్రిస్వామి ఎగిరి అల్లంత దూరానపడటంతో తల, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి.

చక్రం ఊడిన బస్సు దాదాపు 200 అడుగుల దూరం అదే వేగంతో వెళ్లి ఆగిపోయింది. రోడ్డు పక్కనున్న చెట్లను గానీ, ఎదురుగా వస్తున్న వాహనాలను కానీ ఢీకొట్టి ఉంటే ప్రయాణికులతోపాటు ఎదుటి వ్యక్తులకు కూడా ప్రాణాపాయం జరిగేది. అనంతరం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు.  అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే ఏపీఓ భర్త, కుమారుడు సంఘటన స్థలానికి చేరుకుని  దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ భోరున విలపించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు భార్య (గర్భిణి), కూతురు ఉన్నారు. మండల అధికారులు, ఉపాధి సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కంటతడి పెట్టారు. ఎస్‌ఐ రాజు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజనాస్పత్రికి తరలించారు.

ఏపీఓ మృతి బాధాకరం  
కూడేరు ఏపీఓ నాగమణి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎర్రిస్వామిలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని డ్వామా పీడీ జ్యోతిబసు పేర్కొన్నారు. సర్వజనాస్పత్రిలో ఏపీఓ మృతదేహాన్ని ఆయన సందర్శించి నివాళులర్పించారు. నాగమణి విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసేవారని గుర్తు చేసుకున్నారు.

నేత్ర దానం చేసిన ఏపీఓ  
అనంతపురం టౌన్‌: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏపీఓ నాగమణి కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. సాయి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వాస్పత్రిలో నాగమణి నేత్రాలను సేకరించారు. అనంతరం ప్రశంసాపత్రాన్ని డ్వామా పీడీ జ్యోతిబసు చేతుల మీదుగా మృతురాలి భర్తకు అందజేశారు. కార్యక్రమంలో సాయి సంస్థ నిర్వహకులు విజయ్‌సాయి, కిరణ్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top