‘పాలక’ పెత్తనం.. తీస్తోంది ప్రాణం

Priests Suicides in TDP Government - Sakshi

అర్చకులపై పెరుగుతున్న వేధింపులు

ఆత్మహత్యలకు ప్పాడుతున్న వైనం

పాలక మండళ్లు పరిధి దాటుతున్నాయి. అర్చకులపై పెత్తనం చెలాయించే క్రమంలో వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. తమ చెప్పుచేతల్లో ఉండాలనే వారి అహంకారానికి అర్చకులు తట్టుకోలేక పోతున్నారు. అర్చకత్వం తప్ప మరో పని తెలియని ఆ అమాయకులు తమ ప్రాణాలనే తీసుకుంటున్నారు.

తూర్పుగోదావరి,రాజమహేంద్రవరం క్రైం:  తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేవాలయాలలో నియమితులైన పాలక మండళ్లు అర్చకులను వేధింపులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా దేవాలయాలపై వచ్చే ఆదాయంతో పాటు దేవాలయాల భూములపై వచ్చే ఆదాయంపై పాలక మండళ్ల దోపిడీ పెరిగిపోవడంతో అర్చకులను బలిపశువులను చేస్తున్నారు. గతంలో అర్చకులకు చాలా గౌరవంగా చూసేవారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత పాలక మండళ్లు అర్చకులను తమ ఇంట్లో పని మనుషుల్లా చూస్తు వారి చేత పనులు చేయించుకోవడం, వారు చేసే పనులలో తప్పులు వెదికి వేధింపులకు గురి చేయడం వంటివి చోటు చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ రెండున కోరుకొండ మండలం, కణుపూరులోని శ్రీభ్రమరాంబిక సమేత మల్లికార్జున దేవాలయం అర్చకుడు కొత్తలంక మల్లికార్జున శర్మ ఆత్మహత్యే ఇందుకు నిదర్శనం.

ఈ ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయని వాటిని తీసేందుకు అర్చకుడు సహకరించడం లేదని కక్షగట్టిన పాలక మండలి సభ్యులు దైవ సన్నిధి నుంచి మెడపెట్టి గెంటేశారు. దీనితో పాటు అర్చకుడు ఉంటున్న ఇంటి తలుపులను తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు పగులగొట్డాడు. సామాన్లు బయటపడవేసి, ధర్మకర్త మండలిలోని కొందరు సభ్యులు వెకిలిగా నవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకప్పుడు స్వల్ప ఆదాయం ఉండే శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయా నికి ప్రస్తుతం శివరాత్రి, కార్తిక మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీనితో ఆదాయం కూడా పెరిగింది. ధర్మకర్త మండలి లెక్కల ప్రకారం ఏడాదికి రూ.5 లక్షల వరకూ ఆదాయం వస్తోంది. దీనితో పాటు దేవాదాయ భూములపై కూడా ఆదాయం వస్తుంది. దీనిని ప్రశ్నిస్తున్న మల్లికార్జున శర్మను వెళ్లగొట్టాలనే లక్ష్యంతో వేధింపులకు గురి చేశారు. 

రామచంద్రపురంలో...
రామచంద్రపురంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ అర్చకుడు పాణిగంపల్లి ఫణికుమారాచార్యులు ఆలయ నిర్వాహకులు వేధింపులు తాళ్లలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడాడు. ఏడాదిగా ఆలయంలో అర్చకుడిగా పని చేస్తున్న తనను ఆలయ నిర్వాహకులు పనివాడిగా చూస్తు అన్ని పనులు తనతో చేయిస్తున్నారని, చేసే పనిలో తప్పులు వెదుకుతున్నారని, తనలా మరొకరు బలికాకూడదని సెల్‌ ఫోన్‌ వీడియోలో ఫణికుమారాచార్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫణికుమారాచార్యులు పరిస్థితి విషమంగా ఉందని అర్చక సంఘాల నాయకులు పేర్కొంటున్నాయి. ఇదే మాదిరి పిఠాపురంలో ఉన్న కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా అర్చకుడిని వేధింపులకు గురి చేసి, గోడను పడగొట్టి వేధింపులకు గురి చేశారని అర్చక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇలా పవిత్ర దేవాలయాల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు.

ట్రస్టీలకు పునరావాస కేంద్రాలు
టీడీపీ ప్రభుత్వంలో ట్రస్టీలకు దేవాలయాలు పునారావాస కేంద్రాలుగా మారాయి. కొంత మంది రాష్ట్రపతి పదవులుగా భావిస్తున్నారు. అర్చకులను బానిసలుగా చూస్తు హేళన చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.– కేవీఎస్‌ఆర్‌ఎన్‌ అచార్యులు,ఆంధ్రప్రదేశ్‌ అర్చక సంఘం రాష్ట్ర కార్యదర్శి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top