అనితారాణి ఇంటికి రాజకీయనేతలు..! 

Politicians to the home of Dr Anita Rani - Sakshi

సీఐడీని రావొద్దన్న డాక్టర్‌

నోటీసులు తీసుకోవడానికి నిరాకరణ

పెనుమూరులో నలుగురి వాంగ్మూలం నమోదు 

పెనుమూరు/చిత్తూరు అర్బన్‌: ప్రభుత్వ వైద్యరాలు డాక్టర్‌ అనితారాణి వ్యవహారంలో కొత్తకోణం వెలుగుచూస్తోంది. గత వారం రోజులుగా ఈమె నివాసముంటున్న ఇంటికి రాజకీయ పార్టీల నాయకులు వస్తున్నారు.. అని ఈ మేరకు స్థానికులతో పాటు అనితారాణి అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని సీఐడీ అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. పెనుమూరు ఆరోగ్య కేంద్రంలో పనిచేసేప్పుడు తనను కులంపేరిట దూషించారంటూ అనితారాణి మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇటీవల మీడియాకు ఎక్కడంతో ప్రభుత్వం ఈకేసు సీఐడీకి బదిలీ చేసింది. బుధవారం సీఐడీ ఎస్పీ రత్న, డీఎస్పీ రవికుమార్‌తో కూడిన బృందం మురకంబట్టులోని అనితారాణి ఇంటికి వెళ్లగా ఆమె ఇంటి తలుపులు కూడా తీయలేదు. ఇదే విషయమై ఎస్పీ రత్న ఫోన్‌లో మాట్లాడితే.. ‘‘నాకు సీఐడీపై నమ్మకంలేదు. నేను మీకు సహకరించను. సీబీఐ వాళ్లు వస్తేనే మాట్లాడుతా. మీరు ఏ నోటీసులు ఇచ్చినా తీసుకోను.’’ అంటూ సమాధానమిచ్చారు.  

► మార్చి 22వ తేదీన పెనుమూరు పీహెచ్‌సీలో జరిగిన వివాదంపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. అనితారాణి ఇచ్చిన ఫిర్యాదులో నిందితులైన భరత్‌కుమార్, రవికుమార్, రాజేష్‌తో పాటు వీడియోలో ఉన్న మరో వ్యక్తిని విచారించారు.  
► విచారణ అనంతరం సీఐడీ ఎస్పీ రత్న మీడియాతో మాట్లాడారు. అనితారాణికి 160 సీఆర్‌పీసీ నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించగా ఆమె నిరాకరించారన్నారు.
► పైగా సీఐడీపై నమ్మకంలేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యాంగ వ్యవస్థను తక్కువచేసి మాట్లాడటం ప్రభుత్వ ఉద్యోగికి తగదన్నారు. అనితారాణి నివాసముంటున్న పరిసరాల్లో, ఇంటి యజమాని, పెనుమూరు పోలీసులను, పీహెచ్‌సీ సిబ్బందిని విచారించి స్టేట్‌మెంట్లు తీసుకున్నట్లు పేర్కొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top