ఆర్థిక హత్య.. ఆపై క్షుద్ర డ్రామా!

Police Officials Resolved Triple Murder Case In Kadiri, Anantapuram - Sakshi

సాక్షి, కదిరి(అనంతపురం) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొర్తికోట త్రిబుల్‌ మర్డర్‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆర్థిక లావాదేవీలతో శివరామిరెడ్డిని హత్య చేసిన దుండగులు ..ఆ ఘాతుకాన్ని చూసిన ఇద్దరు మహిళలనూ అంతమొందించినట్లు భావిస్తున్నారు. కేసును పక్కదారి పట్టించేందుకు నిందితులు క్షుద్రపూజ డ్రామా ఆడినా.. పోలీసులు మాత్రం కచ్చితమైన ఆధారాలతో ముందుకు సాగుతున్నారు. ఈకేసులో ఇప్పటికే ఇరువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తనకల్లు మండలం కొర్తికోటలో జరిగిన త్రిబుల్‌ మర్డర్‌ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం నాలుగు బృందాలుగా విడిపోయిన పోలీసులు...తీగలాగుతూ డొంక కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. 

డబ్బు వ్యవహరమే...! 
కొర్తికోటకు చెందిన శివరామిరెడ్డి(70) కర్నూలు జిల్లా శ్రీశైలంలోని ఐటీఐ కళాశాలలో ఇన్‌స్ట్రక్టర్‌గా ఉంటూ పదవీ విరమణ పొందారు. అనంతరం స్వగ్రామం తనకల్లు మండలం కొర్తికోట చేరుకున్నారు. అక్కడ తమ పూర్వీకులు కట్టించిన శివాలయం బాగోగులు చూసుకుంటున్నాడు. పదవీ విరమణ అనంతరం తనకొచ్చిన డబ్బుతో పాటు ప్రతి నెలా వచ్చే పింఛన్‌ డబ్బు, గుడి నిర్మాణం కోసం వచ్చిన చందాల డబ్బుతో వడ్డీ వ్యాపారం కూడా చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో కొంత కటువుగా వ్యవహరించేవారని తెలుస్తోంది. ఈ కారణంగా ఈయనకు శత్రువులు పెరుగుతూ వచ్చారు.

వీరిలో కొందరు జట్టుగా ఏర్పడి శివరామిరెడ్డిని హతమార్చాలని పథకం వేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ప్లాన్‌ ప్రకారం గుడిముందు నిద్రిస్తున్న శివరామిరెడ్డిని వేటకొడవళ్లతో గొంతుకోసి దారుణంగా హతమార్చారు. ఈ క్రమంలో కొంత పెనుగులాట జరగ్గా.. అక్కడే నిద్రిస్తున్న శివరామిరెడ్డి సోదరి కమలమ్మ(75), గ్రామానికే చెందిన సత్య లక్ష్మమ్మ(70) మేల్కొన్నారు. శివరామిరెడ్డి రక్తపు మడుగులో పడి ఉండటం చూసిన వారు గట్టిగా అరిచేందుకు ప్రయత్నించారు. దీంతో దుండగులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారిద్దరిని సైతం గొంతుకోసి అంతమొందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

కొక్కంటి క్రాస్‌లో మద్యం కొని... 
కొక్కంటి క్రాస్‌లోని ఓ మద్యం దుకాణంలో హంతకులు మద్యంతో పాటు సమీపంలోని బజ్జీల బండి వద్ద బజ్జీలను కూడా కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. చంపడానికి ముందు అందరూ మద్యం సేవించిన చోటుకు పోలీసు జాగిలాలు వెళ్లినట్లు సమాచారం. అక్కడ పడిన మద్యం బాటిళ్లపై ఉన్న లేబుల్‌ అధారంగా అవి ఎక్కడ కొనుగోలు చేశారనే విషయం పోలీసులు సులభంగా గుర్తించారు.  

పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు 
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు మంగళవారం రాత్రి కొర్తికోట పరిసర ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహించారు. హంతకుల కోసం డాగ్‌స్క్వాడ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీస్‌ జాగిలాలు స్థానిక తిమ్మమ్మ మర్రిమాను రోడ్డులో ఉండే ఓ ఇంటి వద్ద ఆగడంతో ఆ ఇంట్లో సోదాలను నిర్వహించి ఇద్దరు అన్నదమ్ములను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ ఇంట్లోనే జింక చర్మం కూడా దొరికినట్లు ప్రచారం ఉంది. హత్యల్లో వీరి పాత్రపై పోలీసులు విచారిస్తున్నారు.

ఇందులో ఒకరు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం ఎద్దులవారికోటలోని ఆలయంలో గుప్తనిధులు తీస్తుండగా పోలీసులకు పట్టుబడగా... 2015లో అక్కడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇంకొకరు హత్య జరిగిన శివాలయంలో కొద్దిరోజులు పూజారిగా పనిచేశారు. శివరామిరెడ్డి గుడి వ్యవహారాలను చూడడానికి ఇక్కడి వచ్చేయడంతో అప్పటి నుంచి అతను గుడికి వెళ్లడం మానివేశాడు. వీరిని విచారిస్తే కేసు సంబంధించిన కీలక సమాచారం లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు.  

పోలీసులను పక్కదారి పట్టించాలని... 
శివరామిరెడ్డి, కమలమ్మ, సత్య లక్ష్మమ్మలను హతమార్చిన దుండగులు...పోలీసులను పక్కదారి పట్టించేందుకు మృతుల రక్తంతో ఆలయంలోని శివలింగంతో పాటు గుడి ప్రాంగణంలో ఉన్న పుట్ట మీద కూడా చల్లినట్లు తెలుస్తోంది. అయితే నిజంగా క్షుద్రపూజలు చేసేందుకు దుండగులు వచ్చి ఉంటే  ఆలయంలోని విగ్రహాన్ని పెకలించేవారు. గుప్తని«ధుల కోసం తవ్వకాలు చేసేవారు. కానీ అలాంటి ఆనవాళ్లు ఎక్కడా కన్పించలేదు. అందుకే పోలీసులు ఆర్థిక లావాదేవీల కోణంలోనే తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుని కటకటాల్లోకి పంపించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top