క్లాస్‌మేట్‌పై కక్షతోనే ‘పార్శిల్స్‌’?

Parcel Revange on Classmate - Sakshi

వీఐపీలకు పంపే ప్రయత్నం చేసింది వెంకట్‌

సికింద్రాబాద్‌లోని కమ్మరివాడి వాసిగా గుర్తింపు

పాశ్చాత్య విధానాన్ని అనుసరించినట్లు అనుమానం

కారణాలు గుర్తించేందుకు పోలీసుల దర్యాప్తు

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ సహా పదుల సంఖ్యలో ప్రముఖులకు ‘పార్శిల్స్‌’ పంపే ప్రయత్నం చేయడం వెనుక ఉద్దేశం సమాజహితం కాదని... క్లాస్‌మేట్‌పై వ్యక్తిగత కక్షేనని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ పని చేసిన కమ్మరివాడికి చెందిన ఎంబీఏ డ్రాప్‌ఔట్‌ వెంకట్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. సదరు క్లాస్‌మేట్‌ మహిళపై ఇతడు ఎందుకు కక్ష కట్టాడు? ఆమెతో పాటు ఉస్మానియా వర్శిటీ ప్రొఫెసర్ల పేరుతో వాటిని ఎందుకు పంపాడు? తదితర అంశాలను తేల్చేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఉదంతంతో పోస్టాఫీసుల్లో ఉన్న భద్రత లోపాలపై ఆ శాఖ అధికారులు దృష్టి సారించారు.  సికింద్రాబాద్, కమ్మరివాడికి చెందిన వెంకట్‌ బోయిన్‌పల్లిలోని ఉస్మానియా యూనివర్శిటీ అనుబంధ కళాశాలలో కొన్నేళ్ల క్రితం ఎంబీఏలో చేరాడు.

కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో డ్రాప్‌ఔట్‌గా మారాడు. అయితే తాను అన్ని పరీక్షలు సక్రమంగానే రాశానని, వర్శిటీ ప్రొఫెసర్లే ఉద్దేశపూర్వకంగా ఫెయిల్‌ చేశారని ఆరోపించాడు. దీనికి సంబంధించి అతను కోర్టులో ఓ కేసు కూడా దాఖలు చేసినట్లు తెలిసింది. ఇతడితో పాటు అదే కళాశాలలో నగరానికి చెందిన ఓ యువతి సైతం ఎంబీఏలో చేరారు. ఆమె చదువు పూర్తికావడంతో ప్రస్తుతం వేరే ప్రాంతంలో నివసిస్తున్నారు. గడిచిన కొన్నాళ్ళుగా చిత్రంగా ప్రవర్తిస్తున్న వెంకట్‌ శుక్రవారం సాయంత్రం కమ్మరివాడి నుంచి 62 పార్శిళ్లను ఓ ఆటోలో తీసుకుని ప్యాట్నీలోని హెడ్‌–పోస్టాఫీస్‌కు వచ్చాడు. అయితే అప్పటికే సమయం మించిపోయినట్లు సిబ్బంది చెప్పడంతో మరుసటి రోజు వస్తానని చెప్పిన అతడు వాటిని అక్కడే ఉంచి వెళ్లాడు. తిరిగి శనివారం ఉదయం 11.30 గంటలకు పోస్టాఫీస్‌కు వచ్చిన వెంకట్‌ ముఖ్యమంత్రికి చెందిన నాలుగు చిరునామాలు, డీజీపీతో పాటు ప్రముఖులతో కలిపి మొత్తం 62 మందికీ  ఆ బాక్సులను పంపాలంటూ వారి చిరునామాలు ఇచ్చి బుక్‌ చేయించారు. దీనికి సంబ«ంధించి రూ.8 వేలు చెల్లించాడు. ఆ సందర్భంగా పోస్టాఫీసు అధికారులు ఆ పార్శిల్స్‌లో ఏ ముందని ప్రశ్నించగా పుస్తకాలు ఉన్నట్లు తెలిపాడు. ఎక్కడా తన గుర్తింపు బయటపడకుండా బోగస్‌ వివరాలు ఇచ్చాడు. సోమవారం పార్శిల్స్‌ పంపడానికి ప్రయత్నించిన పోస్టాఫీసు డిస్పాచ్‌ సిబ్బంది వాటిని తరలించే ప్రయత్నం చేశారు. ఓ బాక్సును పైకి ఎత్తగా అందులో ద్రవ పదార్థం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు అన్నీ అలాగే ఉండటంతో ఓ పార్శిల్స్‌ తెరిచారు.

అందులో రెండు బాటిళ్ళల్లో మురుగునీరు, బుదర ఉండటాన్ని చూసిన సిబ్బంది తొలుత వాటిని రసాయనాలుగా, ప్రముఖులకు పంపాలని చూడటంతో దీని వెనుక భారీ కుట్ర ఉన్నట్లు అనుమానించారు. దీంతో మహంకాళి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సైంటిఫిక్‌ అధికారులను రప్పించి పరీక్షలు చేయించగా, అవి డ్రైనేజ్‌ వాటర్, బురదగా తేలింది. దీంతో స్థానికంగా ఉన్న మురుగునీరు, మంచినీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి ఎవరైనా ఈ పని చేసి ఉంటారని అనుమానించారు. అయితే ముఖ్యమంత్రికి అడ్రస్‌ చేసిన పార్శిల్‌పై ఓ మహిళతో పాటు ఓయూ వీసీ ఎస్‌.రామచంద్ర, ప్రొఫెసర్‌ విఠల్‌ పేర్లు ప్రస్తావించాడు. సదరు మహిళ ‘ఏజీఏఏఆర్‌ఏఎల్‌ఆర్‌ఓ’ పేరుతో ఓ సంస్థను నడుపుతున్నట్లు రాశాడు. దీంతో అనుమానించిన  సీనియర్‌ పోస్టు మాస్టర్‌ వెంకట రమణరెడ్డి మంగళవారం మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐసీపీలోని 419, 506, 511 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలతో పాటు సాంకేతికంగానూ దర్యాప్తు చేసి వెంకట్‌ను గుర్తించి పట్టుకున్నారు. ఇతడు సదరు యువతి పేరుతో పాటు డాటరాఫ్‌ అంటూ టీఆర్‌ఎస్‌ నాయకుడి పేరు రాశాడు. అయితే ఆయన ఆమె సమీప బంధువే తప్ప తండ్రి కాదని మహంకాళి పోలీసులు నిర్థారించారు. వెంకట్‌కు తన క్లాస్‌మేట్‌ అయిన ఆ మహిళపై ఎందుకు కక్ష, ఓయూ ప్రొఫెసర్లు పేరు పార్శిల్‌ ఫ్రం అడ్రస్‌లో ఎందుకు రాశాడు? తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ ఉదంతంతో  పోస్టల్‌శాఖ మేల్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా పోస్టాఫీసులు, పార్శిల్‌ సెక్షన్స్‌ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తాము ఈ ప్రతిపాదనలకు సంబంధించి గత నెల్లోనే ఉన్నతాధికారులకు లేఖ రాశామని, ఈ నెలాఖరులోపు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీనియర్‌ పోస్టుమాస్టర్‌ రమణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పోస్టాఫీసు, పార్శిల్స్‌ భద్రత విషయంలో ఆందో«ళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top