
మహిళను ఈడ్చుకువెళ్తున్న దృశ్యం
ఒడిశా, కొరాపుట్ : జిల్లాలో దమనజొడి ఆదర్శ పోలీసు స్టేషన్ అధికారులు ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతోంది. రెండు రోజుల క్రితం దమనజొడి పోలీసులు మోటారు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో బైకుపై ఒక మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా పట్టుకున్నారు. మాస్క్ ధరించలేదని, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, లైసెన్స్ లేని కారణంగా వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయమై ఆ మహిళ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఆ సమయంలో పోలీసు స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆ మహిళను అశ్లీల పదజాలంతో తిట్టడం, ఆ మహిళ స్టేషన్ నుంచి వెళ్లిపొతుండగా ఆమెను ఒక మహిళా పోలీసు ఈడ్చుకు వెళ్లే వీడియో క్లిప్పింగ్ సామాజిక మాధ్యమంలో హల్‌చల్ చేస్తోంది.
ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసు అధికారిని నవరంగపూర్ జిల్లాకు బదిలీ చేశారు. దీనిపై దమనజొడి ఐఐసీ వివరణ కోరగా.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘనపై సదరు మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసే సమయంలో ఆ మహిళ పోలీసులపై దుర్బాషలాడుతూ ఘర్షణకు దిగిందన్నారు. దీంతో ఆమెను స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు చెప్పారు. వీడియో క్లిప్పింగ్‌లో పోలీసులతో ఆమె ప్రవర్తించిన తీరును తొలగించి, ఆమెను ఈడ్చుకువెళ్తున్న క్లిప్పింగును మాత్రమే ఉంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు.