వంచించాడు... యాసిడ్‌తో దాడి చేశా! | Nurse Aruna Statement on Acid Attack in Court Chittoor | Sakshi
Sakshi News home page

వంచించాడు..అందుకే యాసిడ్‌తో దాడి చేశా!

Feb 8 2019 12:18 PM | Updated on Feb 8 2019 2:13 PM

Nurse Aruna Statement on Acid Attack in Court Chittoor - Sakshi

రుయాలో చికిత్స పొందుతున్న అరుణ

నన్ను పెళ్లి చేసుకుంటానని వంచించాడు.. ఏడాది పాటు నాతో సాన్నిహిత్యంగా మెలిగి తరువాత వదలించుకున్నాడు.. అనారోగ్యంతో ఉన్న నా భర్త ఏడుకొండలను నా చేతే డాక్టర్‌ ఆదర్శ్‌ చంపించాడు.. అంటూ..

చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : నన్ను పెళ్లి చేసుకుంటానని వంచించాడు.. ఏడాది పాటు నాతో సాన్నిహిత్యంగా మెలిగి తరువాత వదలించుకున్నాడు.. అనారోగ్యంతో ఉన్న నా భర్త ఏడుకొండలను నా చేతే డాక్టర్‌ ఆదర్శ్‌ చంపించాడు.. అంటూ తిరుపతి కోర్డు ఆవరణలో డాక్టర్‌ ఆదర్శ్‌పై యాసిడ్‌ దాడిచేసిన నర్సు అరుణ (35) వెల్లడించింది. యాసిడ్‌ దాడి అనంతరం ఆమె పురుగుల మందును తాగి అపస్మారక స్థితిలో రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మధ్యాహ్నం కోలుకున్న తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. డాక్టర్‌పై యాసిడ్‌ దాడికి కారణాలను ఆమె మాటల్లోనే.. ‘‘రెండేళ్ల క్రితం డాక్టర్‌ ఆదర్శ్‌తో పరిచయమైంది.

తిరుపతిలోని ఓ కార్పొరేట్‌  ఆస్పత్రిలో అతనితో పాటు నర్సుగా పనిచేశాను. తిరుచానూరు రోడ్డులోని పద్మావతి పురంలో నివాసం ఉంటున్నాను. నా భర్త అనారోగ్యానికి తోడు కుటుంబ పరిస్థితిని ఆసరాగా చేసుకుని డాక్టర్‌ ఆదర్శ్‌ నాకు దగ్గరయ్యాడు. తోడుగా ఉంటానని.. తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడు. అనారోగ్యంతో ఉన్న నా భర్త తాగుడుకు బానిస కావడంతో నాచేతనే ఒక ఇంజెక్షన్‌ ఇచ్చి చంపేలా చేశాడు.  ఏడాది పాటు నాతో లివింగ్‌ రిలేషన్‌ పెట్టుకుని మోసం చేశాడు. అప్పట్లో ఆదర్శ్‌పై ఈస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశా. ఆదర్శ్‌ విడాకుల వ్యవహారం కోర్టులో ఉండడంతో వాయిదాకు వస్తాడని తెలుసుకున్నా.. అతన్ని నడిరోడ్డులో చెప్పుతో కొట్టి యాసిడ్‌ తాగి చనిపోవాలనుకున్నా.. అయితే డాక్టర్‌ ఆదర్శ్‌ నన్ను చూసి పరుగెత్తాడు. దీంతో యాసిడ్‌తో దాడి చేయాల్సి వచ్చింది. ఆ తరువాత నేను పురుగుల మందు తాగాను..’’

ఆదర్శ్‌ను శిక్షించాలి
డాక్టర్‌ ఆదర్శ్‌ నాలాగా మరో ఐదుగురిని మోసం చేసినట్లు తెలిసింది. అటువంటి వ్యక్తిని నడిరోడ్డులో నిలబెట్టాలి. అప్పుడే నాలాంటి వారికి న్యాయం జరుగుతుంది. పోలీసులు ఆదర్శ్‌ను అరెస్ట్‌ చేసి శిక్షించాలి.

కోలుకుంటోంది
అరుణ పురుగుల మందు  తాగడంతో అపస్మార స్థితిలోకి వెళ్లిందని, ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందివ్వడంతో కోలుకుంటోందని రుయా ఆర్‌ఎంఓ డాక్టర్‌ శ్రీహరి తెలిపారు. ప్రస్తుతం ఆమె మాట్లాడుతోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement