మీడియాకు అడ్డంగా దొరికిపోయిన మేయర్‌

North Delhi Mayor Caught on Cam instruct aides - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బవానా భారీ అగ్ని ప్రమాదంపై స్పందిస్తూ ఢిల్లీ(ఉత్తర) మేయర్‌ అడ్డంగా దొరికిపోయారు. ఈ ప్రమాదంపై ఎటువంటి ప్రకటనలు చెయొద్దంటూ మీడియా ముందే ఆమె అధికారులకు సూచించారు. 

బీజేపీ నేత, ఉత్తర ఢిల్లీ కార్పొరేషన్‌ మేయర్‌ ప్రీతి అగర్వాల్‌ ప్రమాద ఘటనపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘ఈ ఫ్యాక్టరీ లైసెన్స్‌ మన దగ్గర ఉంది. మీరెవ్వరూ మీడియాతో మాట్లాడకండి అంటూ ఆమె అధికారులకు సూచించారు. అందుకు వారు సరేనని చెప్పటం ఆ వీడియోలో గమనించవచ్చు. 

కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ నిర్మించారని.. ప్రామాణికాలు పాటించలేదన్న అంశాలు వెలుగులోకి వచ్చిన కాసేపటికే.. మేయర్‌ మాట్లాడిన మాటలు చక్కర్లు కొడుతున్నాయి.

బవానా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ బాణ సంచా కర్మాగారంలో శనివారం మంటలు ఎగిసిపడి 17 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మృతుల్లో 10 మంది మహిళలు ఉండగా..  మరో 30 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఊపిరాడక చనిపోయారని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి యాజమాని మనోజ్‌ జైన్‌ను ఆదివారం ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అది ఫేక్‌ వీడియో... బీజేపీ

మేయర్‌ ప్రీతి అగర్వాల్‌ వ్యాఖ్యల వీడియోపై బీజేపీ స్పందించింది. అది ఫేక్‌ వీడియో అని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ చెబుతున్నారు. మార్ఫింగ్‌ చేసిన ఆ వీడియోను చివరకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా తన ట్విటర్‌లో పోస్టు చేయటం దారుణమని తివారీ అంటున్నారు. మరోవైపు మేయర్‌ ప్రీతి కూడా అది మార్ఫింగ్‌ వీడియో అని.. తాను అసలు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెబుతుండటం కొసమెరుపు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top