‘వారికి గుడ్‌’ నైట్‌..!

Night Time Business Increases In Warangal - Sakshi

నగరంలో అర్థరాత్రి 12 తర్వాత ‘బిజీ’నెస్‌

అర్ధరాత్రి దాటిందంటే చాలు.. వారికి పండుగే. అప్పుడే వారి వ్యాపారం జోరందుకుంటుంది. మందు నుంచి మొదలుకుని ‘పొందు’ వరకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. పోలీస్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నా.. వారు ఏమాత్రం వెనుకడుగు వేయరు. ఇలాంటి బిజినెస్‌కు ట్రైసిటీగా పేరుగాంచిన వరంగల్, హన్మకొండ, కాజీపేటలోని పలు ప్రాంతాలు అడ్డాలుగా మారాయి. అంతేకాదు.. కొత్త కొత్త ‘స్పాట్లు’ పుట్టుకొస్తున్నాయి. ఇలా.. మామూళ్ల మత్తులో అర్ధరాత్రి అడ్డదారిన సాగుతున్న వ్యాపారాలపై ప్రత్యేక కథనం..

వరంగల్‌ క్రైం : ట్రైసిటీ పరిధిలో అర్ధరాత్రి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. నిరంతరంగా ఈ ప్రక్రియ సాగుతున్నా.. అర్ధరాత్రి 12 గంటల తర్వాత యువత యథేచ్ఛగా రోడ్లపై చక్కర్లు కొడుతోంది. ఎటైనా ప్రయాణమో.. ఏదైనా పని మీదనో అనుకుంటే ఓకే. కానీ.. వారు గుంపులుగుంపులుగా రహదారులపైకి వచ్చి మద్యం మత్తులో బైక్‌లపై ఇష్టారాజ్యంగా చిందులేస్తున్నారు. పెద్దగా హారన్లు కొడుతూ రాత్రివేళ నగరవాసులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. అయినప్పటికీ.. పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో అల్లరి మూకలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. అసలు యువకులు అర్ధరాత్రి వేళ ఎందుకు బయటకు వస్తున్నారని ‘సాక్షి’ పరిశీలించగా.. చీకటి వ్యాపారాలే కారణమని తేలింది. అవినీతికి అలవాటు పడ్డ పెట్రోలింగ్‌ వాహనాల సిబ్బంది అండతో పలువురు వ్యాపారులు అర్ధరాత్రి వేళ టీ, టిఫిన్ల నుంచి మొదలు బ్రాండెడ్‌ మద్యం వరకూ విక్రయాలు జరుపుతుండడంతో యువత పెడదారిన పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

మూడు పువ్వులు.. ఆరు కాయలు
నగరంలో అర్ధరాత్రి తర్వాత రోడ్లపై ఏది అవసరం ఉన్నా.. ఇట్లే దొరుకుతుండడంతో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. నిబంధనల ప్రకారం రాత్రి 10.30 గంటలకు మద్యం షాపులు, అర్ధరాత్రి 12 గంటలకు బార్లు మూసేయాలి. కానీ వరంగల్, హన్మకొండ, కాజీపేటలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 తర్వాత కూడా ఏ బ్రాండ్‌ మద్యం కావాలన్నా ఇట్టే దొరుకుతోంది. టీ, టిఫిన్లతోపాటు మద్యం ఏరులై పారుతోంది. ప్రధానంగా నగరంలోని కాజీపేట, కేయూ క్రాస్‌రోడ్డు, హన్మకొండ బస్టాండ్, హన్మకొండ చౌరస్తా, పోచమ్మమైదాన్, వరంగల్‌ బస్టాండ్, రైల్వేస్టేషన్ల పరిసర ప్రాంతాల్లో చీకటి వ్యాపార కేంద్రాలు పది వరకు ఉన్నట్లు అంచనా. కొన్ని అడ్డాల్లో మందు తోపాటు ‘పొందు’ సైతం అందుబాటులో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్రమార్కుల చీకటి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఫలితంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాలు, చౌరస్తాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. 

అడ్డాల వారీగా ఇలా..

  • వరంగల్‌ డివిజన్‌ మట్టెవాడ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఒక హోటల్‌ తెల్లవారుజాము 4 గంటల వరకు నడుస్తూనే ఉంటుంది. అటువైపు పోలీసు పెట్రోలింగ్‌ కారు వస్తే అక్కడ కేవలం హోటల్‌ ముందున్న లైట్లు మాత్రమే బంద్‌ అవుతాయి. ఆ హోటల్‌కు కొంత దూరం పోయి పోలీసు కారు అగుతుంది. ఆ తర్వాత హోటల్‌ నుంచి ఒకరు వాటర్‌ బాటిల్‌.. తినడానికి బిర్యాని తీసుకొచ్చి ఇస్తారు. వెంటనే వాహనం అక్కడ నుంచి వెళ్తుంది. ఈ ప్రక్రియ ప్రతిరోజూ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 
  •  హన్మకొండ బస్టాండ్‌లో పాన్‌షాపులు, టీ స్టాళ్లు 24 గంటలపాటు నడుస్తూనే ఉంటాయి. ఇక్కడి పాన్‌షాపులలో మద్యం అందుబాటులో ఉంటున్నట్లు సమాచారం. అర్ధరాత్రి వేళ డబుల్‌ రేట్లకు మద్యం విక్రయిస్తున్నారు.
  •  కాజీపేట రైల్వే స్టేషన్‌ ముందు అర్థరాత్రి జాతర జరిగినట్లు అమ్మకాలు కొనసాగుతున్నా యి. పోలీసు స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే ఈ తంతు సాగుతుండడం గమనార్హం.
  •  వరంగల్‌ రైల్వే స్టేషన్‌ ముందు ఏది కావాలంటే అది దొరుకుతోంది. మద్యం విక్రయాలతో పాటు పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. 

‘చీకటి’ ఒప్పందం ?!
నగర పరిధిలో అర్ధరాత్రి తర్వాత జోరుగా చీకటి వ్యాపారం సాగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెల్ట్‌ షాపులు 24 గంటలపాటు నడుస్తున్నా.. బార్లలో అర్ధరాత్రి తర్వాత వ్యాపారం సాగుతున్నా.. పాన్‌ షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నా.. పలు అడ్డాల్లో యువత చిందులేస్తున్నా.. పెట్రోలింగ్‌ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం సందేహాలకు తావి స్తోంది. పోలీస్‌ అధికారులతో వ్యాపారులు ‘చీకటి’ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడ్డాల వారీగా రోజుకు కొంత మొత్తం సమర్పిస్తుండడంతో ఖాకీలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో అడ్డా నుంచి రూ.500 నుం చి రూ.2,000 వరకు అవినీతికి అలవాటు పడ్డ పెట్రోలింగ్‌ సిబ్బందికి అందుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. పోలీస్‌ స్టేషన్లకు చీకటి వ్యాపారులు నెలవారీగా మామూళ్లు అందజేస్తున్నట్లు వినికిడి. మరోవైపు నగరంలో 36 వైన్స్‌ షాపులు, 100 బార్లు ఉండగా.. వీటి నుంచి ఆయా పోలీస్‌ స్టేషన్లకు నెల వారీగా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఆమ్యామ్యాలు ముడుతున్నట్లు తెలిసింది. ఇందులో అర్ధరాత్రి తర్వాత కూడా తెరిచి ఉంచే బార్లు పది వరకు ఉన్నాయి. వీటిలో ఒక్కో షాపు నుంచి నెల వారీ మామూళ్లకు కలిపి అదనంగా రూ.10వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

24 గంటల బెల్టుషాపులు..
నగరంలో వేల సంఖ్యలో బెల్టుషాపులు ఉన్నాయి. సుబేదారి, కేయూ, హన్మకొండ, మిల్స్‌కాలనీ, ఇంతేజార్‌గంజ్, మట్టెవాడ, కాజీపేట పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఎక్కువ షాపులు పోలీసుల కనుసన్నల్లో నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లోని పలు బెల్టు షాపులు 24 గంటలపాటూ తెరిచే ఉంటున్నట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top