మహా ముదుర్లు! | News Paper Catches Another Robbery Gang | Sakshi
Sakshi News home page

మహా ముదుర్లు!

Mar 17 2018 7:18 AM | Updated on Aug 30 2018 5:24 PM

News Paper Catches Another Robbery Gang - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ఎవరికి వారు వేర్వేరుగా వచ్చి వెళ్లారు... ఎక్కడా సెల్‌ఫోన్లు, సొంత వాహనాలు వాడలేదు... స్థానికంగా షెల్టర్‌ సైతం తీసుకోలేదు... నగరంలోనే కాదు, రాష్ట్రంలోనూ ఎక్కడా మీటింగ్‌ స్పాట్‌ పెట్టుకోలేదు... పాతబస్తీలోని పేట్లబురుజులో ఉన్న నిథాయిదాస్‌కు చెందిన బంగారు నగల తయారీ కార్ఖానాలో పంజా విసిరిన బందిపోట్లు నేరం చేయడానికి ముందు తీసుకున్న జాగ్రత్తలు ఇవీ. సాధారణంగా దొంగల ముఠాలు, అంతరాష్ట్ర దొంగలు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నేరం చేయడానికి ముందు అనేక జాగ్రత్తలు తీసుకుంటాయి. ముంబైకి చెందిన ఈ బందిపోటు ముఠా మాత్రం నేరం చేసిన తర్వాత కూడా కోర్టులో కేసు వీగిపోయేందుకు పక్కా ప్రణాళిక రచిస్తుంటుందని తేలింది. ఈ గ్యాంగ్‌ లీడర్‌గా అనుమానిస్తున్న అమ్జను దక్షిణ మండల పోలీసులు గురువారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తులో ముఠాకు సంబంధించి అనేక కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. 

అరెస్టుకు ఒకరు సిద్ధం  
సాధారణంగా ఏదైనా నేరం చేసే నేరగాళ్లు ఆ తర్వాత పోలీసులకు పట్టుబడకుండా అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. సాధ్యమైనన్నాళ్లు అరెస్టు కాకుండా తప్పించుకుని తిరగాలని భావిస్తుంటారు. అయితే అలాంటి వారు పోలీసులకు చిక్కిన తర్వాత  విచారణలో నేరం పూర్వాపరాలు వెల్లడించడంతో పాటు అవసరమైన ఆధారాలను అందిస్తుంటారు. అయితే ఈ బందిపోటు ముఠా పంథా మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. ఎంత పక్కాగా ప్లాన్‌ చేసినా ఏదో ఒక ఆధారంతో పోలీసులు పట్టుకుంటారని వీరికి తెలుసు. ఈ నేపథ్యంలోనే నేరం చేసిన తర్వాత ఓ ప్రాంతంలో కలుసుకుని సొత్తును పంచేసుకుంటారు. ఆపై ముఠాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులకు చిక్కడానికి సిద్ధం చేస్తారు. అతను అధికారులకు ఎలాంటి అనుమానం రాకుండా వారికి పట్టుబడతాడు. ఆ తర్వాతే మరో కీలక ఘట్టం మొదలవుతుంది. ఇలాంటి సంచలనాత్మక కేసుల్లో నిందితులు చిక్కినప్పుడు పూర్తి వివరాలు, రికవరీ కోసం కొన్ని రోజులు విచారించాల్సి ఉంటుంది. అయితే చట్ట ప్రకారం పోలీసులు నిందితులను పట్టుకున్న 24 గంటల్లోనే కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. దీనిని తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్న ముఠా... ఓ సభ్యుడిని పోలీసులు పట్టుకెళ్లిన వెంటనే అతడు తప్పిపోయాడంటూ మిస్సింగ్‌ కేసులు, కిడ్నాప్‌ కేసులు పెట్టడంతో పాటు హైకోర్టుల్లో హెబియస్‌ కార్పస్‌ రిట్‌ పిటిషన్లు దాఖలు చేస్తారు. దీంతో పోలీసులపై ఒత్తిడి పెరిగి వారు వెంటనే నిందితులను అరెస్టు చూపి ంచడంతో పూర్తిస్థాయి రికవరీ సాధ్యం కాదు. 

‘అన్ని పేర్లూ’ కలిపి చెప్పేస్తారు...
ఇలా అరెస్టు కావడంతో ఈ బందిపోట్ల స్కెచ్‌ పూర్తి కాదు. సాధ్యమైనంత వరకు కేసు వీగిపోయేలానూ పథకం వేస్తుంటారు. ఓ నిందితుడిని పట్టుకున్నప్పుడు సదరు నేరంలో తనతో పాటు పాల్గొన్న వారి వివరాలను అతడు చెబుతారు. అయితే ఈ గ్యాంగ్‌ సభ్యులు మాత్రం కొన్ని నేరంలో పాల్గొన్న వారి పేర్లు, మరికొన్ని నేరం జరిగిన సమయానికే వేరే కేసుల్లో అరెస్టై జైళ్ళల్లో ఉన్న వారి పేర్లు చెప్తుంటారు. ఇలా జైళ్ళల్లో ఉన్న వారి పేర్లు రికార్డుల్లో నమోదు చేస్తే భవిష్యత్తులో కేసు వీగిపోయే ప్రమాదం ఉంటుంది. అనేక నగరాల పోలీసులను ఈ బందిపోటు ముఠా ఈ పంథాలోనే బురిడీ కొట్టిస్తున్నట్లు సమాచారం. దీనిని గుర్తించిన సౌత్‌జోన్‌ పోలీసులు ఈ కేసు దర్యాప్తులో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోపక్క గురువారం పట్టుబడిన అమ్జ పోలీసుల విచారణలో తాను గ్యాంగ్‌ లీడర్‌ను కాదని, మనోజ్‌ అంథే అనే వ్యక్తి నాయకుడని చెబుతున్నట్లు తెలిసింది. మిగిలిన ముఠా సభ్యుల కోసం ముంబైలో గాలిస్తున్న ప్రత్యేక బృందం మరో నిందితుడు షాకీర్‌ అలియాస్‌ మియాను పట్టుకుంది. ఇతడిని నగరానికి తరలించిన పోలీసులు బంగారం రికవరీ కోసం ప్రయత్నిస్తున్నారు.

‘పత్రికల’ కోణంలో రెండో కేసు..
పేట్లబురుజు బందిపోటు దొంగతనం కేసు కొలిక్కి రావడానికి ఘటనాస్థలిలో దొరికిన ఓ ఆంగ్ల పత్రిక కీలక ఆధారంగా మారింది. నేరం చోటు చేసుకున్న ఈ నెల 6న అక్కడకు వెళ్ళిన నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) ఆధీనంలోని క్లూస్‌టీమ్‌ దీనిని సేకరించి పోలీసులకు అప్పగించింది. అయితే నగరంలో న్యూస్‌పేపర్‌ ఆధారంగా కొలిక్కి వచ్చిన భారీ కేసుల్లో ఇది రెండోది. ఈ రెండు కేసుల్లోనూ దుండగులు ముంబైకి చెందిన వారే కావడం గమనార్హం. 2006 మే నెలలో పంజగుట్ట పరిధిలోని అలుక్కాస్‌ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. సౌత్‌ ముంబైలోని దహిసార్‌ ప్రాంతానికి చెందిన వినోద్‌ రాంబోలి సింగ్‌ ఈ నేరం చేశాడు. సింగిల్‌ హ్యాండ్‌తో హిట్‌ చేసి దాదాపు రూ.10 కోట్ల విలువైన సొత్తు ఎత్తుకుపోయాడు. అప్పట్లో అతడిని పట్టుకోవడానికి అలుక్కాస్‌ దుకాణం వెనుక బిల్డింగ్‌పై దొరికిన ‘గుజరాతీ సమాచార్‌’ పత్రిక కీలకంగా మారింది. దొంగతనానికి వచ్చిన రాంబోలీ సింగ్‌ జ్యువెలర్స్‌ వెనుక నిర్మాణంలో ఉన్న భవనంపై చాలా సేపు కూర్చున్నాడు. కాలక్షేపం కోసం తన వెంట తెచ్చుకున్న ‘గుజరాతీ సమాచార్‌’ను చదివి అక్కడే వదిలేశాడు. ఈ పత్రికను స్వాధీనం చేసుకున్న పోలీసులు గుజరాత్‌తో పాటు ముంబైలోనూ ఇది లభిస్తుందని గుర్తించారు. ముంబై వెళ్ళిన టీమ్‌     అక్కడి పోలీసులకు అలుక్కాస్‌లో రికార్డు అయిన సీసీ కెమెరా ఫీడ్‌ చూపించగా వారు రాంబోలీ సింగ్‌ను గుర్తించడమే కాకుండా, అతడితో పాటు రిసీవర్‌ను పట్టుకోవడంలో సొత్తు రికవరీలో సహకరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement