మా అనుమతి లేకుండా సెలూన్‌ పెడతవా..

Nayi Brahmin Union Leader Attack on Salon Shop Owner in Hyderabad - Sakshi

వ్యక్తిపై నాయీబ్రాహ్మణ సంఘం నేత దాడి  

పోలీసులకు ఫిర్యాదు చేసిన దంపతులు

శంషాబాద్‌: తమ అనుమతి లేకుండా సెలూన్‌ షాపు ఎలా పెడతావని ఓ వ్యక్తిపై నాయీబ్రాహ్మణ సంఘం నేథ దాడి చేశాడు. ఈ సంఘటన శంషాబాద్‌ పట్టణంలో బుధవారం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. దూసకంటి జానకీరాం, రమాదేవి దంపతులు పట్టణంలోని వీకర్‌సెక్షన్‌ కాలనీలో కొన్నేళ్లుగా నివాసముంటున్నారు. జీవనోపాధి నిమిత్తం జానకీరాం పురపాలక సంఘం అనుమతి తీసుకొని వెళాంగనీ కాలనీ వద్ద సెలూన్‌ షాప్‌ పెట్టుకోడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ విషయమై స్థానిక నాయిబ్రాహ్మణ సంఘం నేతలు కొద్దిరోజులుగా అతడిని అడ్డుకుంటున్నారు. జానకీరాం స్థానికుడు కాదని, స్థానికులు మాత్రమే దుకాణం ఏర్పాటు చేసుకోవాలంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

తాజాగా బుధవారం జానకీరాం ఏర్పాటు చేసుకుంటున్న దుకాణం వద్దకు వచ్చిన పట్టణ నాయిబ్రాహ్మణ సంఘం నాయకుడు పాండు అతడిపై దాడికి పాల్పడ్డాడు. అతడి భార్య రమాదేవి వేడుకున్నా వదిలిపెట్టకుండా జానకీరాంపై పిడిగుద్దులు కురిపించాడు. దుకాణం వెంటనే తీసేయాలని హెచ్చరించాడు. ఈ విషయమై బాధిత దంపతులు ఆర్‌జీఐఏ పోలీసులను ఆశ్రయించారు. శంషాబాద్‌లో పుట్టి పెరిగిన తమను స్థానికులు కాదని దౌర్జన్యానికి పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొన్నిరోజులుగా నాయీబ్రాహ్మణ సంఘం నేతలు బెదిరిస్తున్నారని ఆర్‌జీఐఏ పోలీసులతో పాటు మున్సిపల్‌ కార్యాలయంలో పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని బాధిత దంపతులు పోలీస్‌స్టేషన్‌ వద్ద కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top