నల్లమలలో వేటగాళ్ల హల్‌చల్‌

Nallamala Forest Officers Arrested Spatted Deer Hunter In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు(ఆత్మకూరురూరల్‌) : నల్లమలలో గురువారం రాత్రి వేటగాళ్ళు రెచ్చిపోయారు. వేటగాళ్ళు నాటుతుపాకీతో రెండు పొడదుప్పు(స్పాటెడ్‌ డీర్‌) లను కాల్చి చంపి మాంసంగా మార్చి తరలిస్తూ అటవీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. బైర్లూటీ ఎఫ్‌ఆర్‌ఓ శంకరయ్య తెలిపిన మేరకు నలమలలో అలజడి రేపిన ఈ ఘటన వివరాలు.. ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని రుద్రకోడు అటవీ సెక్షన్‌లో ఉన్న సీతమ్మ పడె ప్రాంతంలో గురువారం రాత్రి గస్తీ తిరుగుతున్న అటవీ సిబ్బందికి కొందరు వేటగాళ్లు సైకిల్‌పై మాంసాన్ని తరలిస్తూ కనిపించారు. అటవీ సిబ్బంది వారిని వెంటాడి పట్టుకునే యత్నం చేయగా ఇరువురు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. మండలంలోని సిద్దాపురం గ్రామానికి చెందిన డేరంగుల మురళి సైకిల్‌పై తరలిస్తున్న సుమారు 50 కేజీల దుప్పి మాంసం, ఒక ఎస్‌బీ ఎంల్‌ (సింగిల్‌ బ్యారల్‌ మజిల్‌ లోడ్‌) నాటు తుపాకీతో పట్టుబడ్డాడు.

అతన్ని  అటవీ అధికారులు ప్రశ్నించగా సిద్దాపురం గ్రామానికి చెందిన కుంచాల రంగన్న, ఆనంద్‌లతో కలసి నాటుతుపాకితో దుప్పుల మందపై కాల్పులు జరపగా రెండు దుప్పులు మృతిచెందినట్లు తెలిపాడు. వాటిని ముక్కలుగా కట్‌ చేసి గ్రామాల్లో విక్రయించేందుకు వెళ్తున్నట్లు ఒప్పుకున్నాడు. రుద్రకోడు ఎఫ్‌బీలో శ్రీనివాసులు నిందితులపై పీఓఆర్‌ నమోదు చేశారు. పశువైద్యాధికారి రాంసింగ్‌  దుప్పుల శరీర భాగాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం నిందితుడు మురళిని నంద్యాల జెఎఫ్‌ఎంసీ ముందు హాజరు పరిచగా జూనియర్‌ సివిల్‌ జడ్జీ 15 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. వేటగాళ్లను అరెస్టు చేసిన అధికారుల బృందంలో ఎఫ్‌ఎస్‌ఓలు వెంకటరమణ, తాహీర్, ఎఫ్‌బీఓలు శ్రీనివాసులు, మహబూబ్‌ బాషా ఉన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top