
రోదిస్తున్న మృతుని కుటుంబ సభ్యులు లంకెలపాలెం సమీపంలో మదీన మృతదేహం
విశాఖపట్నం, పరవాడ(పెందుర్తి): మంత్రిపాలేనికి చెందిన షేక్ మదీన(40) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి లంకెలపాలెం ఐసీఐసీఐ బ్యాంకు వెనుక భాగంలోని ముళ్ల పొదల్లో పడేసి పరారయ్యారు. ఈ మేరకు మృతుడి అన్న హుస్సేన్ పరవాడ పోలీసులకు సోమవారం పిర్యాదు చేశాడు. హత్యకు సంబంధించి సీఐ బీసీహెచ్.స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం... మంత్రిపాలెం గ్రామానికి చెందిన షేక్ మదీన రోలర్ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. ఈయన ఖాళీ సమయంలో మటన్ షాపుల్లో పనిచేస్తుంటాడు. డొంకాడకు చెందిన నీలం వకీల్ అనే వ్యక్తికి చెందిన రేబాక గ్రామంలోని మటన్ దుకాణంలో పనిచేసేందుకు ఆదివారం ఉదయం యజమానితో కలిసి మదీన వెళ్లాడు. అనంతరం ఆదివారం సాయంత్రం దుకాణంలో పనులు ముగించుకొని రేబాక నుంచి యజమాని వకీల్, మదీన ఆటోలో బయలుదేరారు. లంకెలపాలెం కూడలిలో రాత్రి 8.40 గంటల ప్రాంతంలో మదీన ఆటో దిగాడు. అనంతరం వకీల్ అదే ఆటోలో డొంకాడ వెళ్లిపోయాడు. లంకెలపాలెంలో ఆటో దిగిన మదీన రాత్రి ఇంటికి రాకపోవడంతో అతడి భార్య వకీల్‌కు ఫోన్ చేసి భర్త ఆచూకీ అడిగింది. మదీనను ఆదివారం రాత్రి లంకెలపాలెంలో దించి తాను ఇంటికి వచ్చానని వకీల్ ఆమెకు బదులిచ్చాడు.
వివాహేతర సంబంధమే కారణమా..?
సోమవారం ఉదయం లంకెలపాలెంలోని ఐసీఐసీఐ బ్యాంకు వెనుక భాగం తుప్పల్లో మదీన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతుడి అన్నయ్య ఫిర్యాదు మేరకు పరవాడ సీఐ స్వామినాయుడు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మదీన ముక్కు నుంచి తీవ్ర రక్త స్రావమవడంతోపాటు శరీరం, చేతులపై తీవ్ర గాయాలున్నాయి. పీక నులిమినట్లు ఆనవాళ్లు లభిచాయి. హత్యోదంతం వెలుగులోకి రావడంతో సంఘటన స్థలాన్ని గాజువాక ఏసీపీ రంగరాజు, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ సీఐలు కిశోర్, లక్ష్మి సందర్శించారు. డాగ్ స్క్యాడ్, క్లూస్ టీం వివరాలు సేకరించారు. ఇదిలావుండగా తన తమ్ముడి హత్యకు డొంకాడ కాలనీ మినమడక గ్రామానికి చెందిన కె.కొండలరావే కారకుడిని మృతుడి అన్నయ్య హుస్సేన్ అనుమానం వ్యక్తం చేశాడు. తన తమ్ముడి భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్న కొండలరావు మదీనాను అడ్డు తొలగించుకోవడానికి యత్నిస్తున్నాడని... ఈ క్రమంలో ఆదివారం రేబాక నుంచి వచ్చిన షేక్ మదీనతో మద్యం తాగించి, హత్య చేసి తుప్పల్లో పడేసి ఉంటాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించాడని సీఐ స్వామినాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మరోవైపు అనుమానితుడు కొండలరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.