హత్య కేసును ఛేదించిన పోలీసులు

Murder Case Solved - Sakshi

వాంకిడి(ఆసిఫాబాద్‌) : మండలంలోని ఇందాని గ్రామపంచాయతీ పరిధిలో గల చించోలి వాగు సమీపంలో జరిగిన హత్య కేసును వాంకిడి పోలీసులు ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సత్యనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని బండారం తలోడి గ్రామానికి చెందిన గుర్నూలే సంతోష్‌ గుత్తేదారు కిశోర్‌కు సుపరిచితుడు.

రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న పందం గణేశ్‌ అను అతను గత నెల 30న కుమురం భీం ప్రాజెక్టుకు వెళ్లే కెనాల్‌ పక్కన నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు చేపట్టడానికి కూలీగా సంతోష్‌ను తీసుకొచ్చారు. గణేశ్, సంతోష్‌లు కలిసి మధ్యం తాగి క్యాంపునకు వెళ్లారు. తాగిన మైకంలో గణేష్‌ సంతోష్‌ భార్య విషయంలో చెడుగా మాట్లాడడంతో గొడవ జరిగింది.

అది మనుసులో పెట్టుకున్న గణేశ్‌ అదే రోజు రాత్రి సంతోష్‌ను కర్రెతో తలపై దాడి చేయడంతో మృతి చెందాడు. వీరి గొడవతో పక్కనే పడుకుని ఉన్న తల్లురి నాగేశ్వర్‌రావు నిద్రలేచాడు. గణేశ్, నాగేశ్వర్‌రావు కలిసి మృతదేహాన్ని కెనాల్‌లో పడేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు కేసును ఛేదించారు.  

శుక్రవారం వాంకిడి బస్టాండ్‌లో అనుమానా స్పదంగా తిరుగుతున్న పందం గణేశ్, తల్లూరి నాగేశ్వర్‌రావులను పట్టుకుని అరెస్ట్‌ చేశారు.  ఈనెల 30 తానే హత్య చేసినట్లు గణేశ్‌ ఒప్పుకున్నాడు. సమావేశంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజు ఉన్నారు.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top