కన్న కుమార్తెను మంటల్లో తోసేసిన తల్లి

mother burned her daughter - Sakshi

 భువనేశ్వర్‌ : మాతృత్వం మంటకలిసింది. పొత్తిళ్లలో బిడ్డని సంరక్షించాల్సిన కన్న తల్లి మంటల్లోకి వేసేసింది. కొండ కోనలు వంటి మారుమూల ప్రాంతాల్లో పౌర జీవన విధానాల్లో అవగాహన లోపంతో పసి బిడ్డలకు వాతలు పెడుతున్న దురాచారం కంటే హీనంగా ఈ సంఘటన ఉంది. కుటుంబ కలహాలతో వేసారిన వివాహిత కన్న బిడ్డపై తన వేధింపుల్ని ప్రయోగించి సజీవ దహనానికి విఫలయత్నం చేసింది.

లాలించాల్సిన చేతులతో పసి బిడ్డను మంటల్లోకి తోసేయడంతో కొన ఊపిరితో ఆ బిడ్డ కొట్టుమిట్టాడుతోంది. 7 నెలల బాలిక మంటల్లో కాలిపోయింది. సింహ భాగం శరీరం కాలడంతో ఈ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఊగిసలాడుతోంది. స్థానిక సాలియా సాహి ప్రాంతంలో గురువారం ఉదయం ఈ విషాద సంఘటన జరిగింది. నయాపల్లి ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం...

గుడ్డను కిరోసిన్‌లో ముంచి నిప్పు పెట్టింది. ఆ మంటల్లో 7 నెలల చిన్నారి కన్న బిడ్డని తల్లి చేతులారా తోసేసింది. మంటల్లో కాలిపోతున్న పసి బిడ్డ చావు కేకల్ని ఆలకించిన ఇరుగు పొరుగు పరుగులు తీశారు. పరిస్థితిపట్ల అవాక్కు అయ్యారు. స్థానికులు కల్పించుకుని మంటల్లో కాలిపోతున్న బాలికను అక్కున చేర్చుకుని హుటాహుటీన స్థానిక క్యాపిటలు ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు పసి కందు పరిస్థితి క్షణ క్షణం క్షీణించే ప్రమాదాన్ని గుర్తించారు. తక్షణమే ఉన్నత చికిత్స కోసం కటక్‌ ఎస్సీబీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించారు. బిడ్డ చికిత్స ఇక్కడ కొనసాగుతుంది. 

మతి స్థిమితం లేదా ...

కన్న బిడ్డను చేతులారా నిప్పుల్లో పడేయడంపై హృదయాల్ని కలచి వేసింది. సర్వత్రా విచారం వ్యక్తం అవుతుంది. తల్లి చేష్టలపై ఇరుగు పొరుగు వర్గాలు ఆమెకి మతి స్థిమితం అదుపు తప్పినట్టు తెలిపారు. రెండో వివాహం కావడంతో తరచూ భార్యాభర్తలు కలహాలతో ఎడ పెడ ముఖాలుగా కాపురం చేయడం అలవాటుగా మారింది.

ఇప్పుడు ఏమైందో ఏమో కాని ఈ అఘాయిత్యానికి పాల్పడిందని స్థానికులు వాపోయారు. ప్రస్తుతం మంటల్లోకి బిడ్డని తోచేయడంతో ఆ తల్లి మనస్సు స్థిమితంగా లేనట్టు కనిపిస్తుంది. అదుపులోకి తీసుకుని విచారణ వంటి కార్యాచరణ ప్రారంభించనున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top