మొగల్తూరు విషాదంపై వీడని మిస్టరీ

Mother And Child Death Mystery Still Pending in Mogalthur West Godavari - Sakshi

తల్లీకూతుర్ల మృతదేహాలకు పూర్తయిన పోస్టుమార్టం

పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు

పశ్చిమగోదావరి, మొగల్తూరు: మొగల్తూరులో సోమవారం తల్లీకూతుర్లు మృతి ఘటనలో మిస్టరీ వీడలేదు. కుటుంబ కలహల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా మృతిరాలి తల్లితండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. సంఘటన జరిగిన రాత్రే మృతురాలి భర్త నల్లి మిల్లి వెంకట రామాంజనేయరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించేందుకు నరసాపురం తరలించారు. సీఐ కృష్ణమోహన్‌ ఆధ్వర్యం లో దర్యాప్తు సాగుతోంది. సోమవారం రాత్రి తల్లి, కుమార్తెల మృతదేహాలను బంధువుల సమక్షంలో నరసాపురం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మంగళవారం మృతదేహాలకు పో స్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అయితే ఆత్మహత్యకు పాల్పడ్డ లక్ష్మీప్రసన్న, కుమార్తెలు రోజా శ్రీలక్ష్మి, జాహ్నవి మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రోజా శ్రీలక్ష్మి మెడకు ఎడమ వైపున రక్తపు గాటు ఉండటం, జాహ్నవి మెడవద్ద కూడా రక్తపు చారికలు కనబడటం, ఫ్యాన్‌కు ఉరివేసుకున్న లక్ష్మీప్రసన్న ముక్కు నుంచి రక్తం కారడం అనుమానాలకు తావిస్తోంది. కుటుంబ కలహల నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది కుమార్తెలను చంపి తల్లి లక్ష్మీప్రసన్న ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు రామాంజనేయరెడ్డి తల్లి దశదిన కర్మ నిర్వహించిన ఆది వారం రోజున కుటుంబసభ్యులు లక్ష్మీప్రసన్నను వేధించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక దశలో రామాంజనేయరెడ్డి ఆవేశంతో మిమ్మలను చంపి మరో పెళ్లిచేసుకుంటానని అంటుండేవాడని మృతిరాలి తండ్రి కర్రి సత్యనారాయణరెడ్డి పోలీ సుల సమక్షంలో ఆరోపించాడు. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. పో స్టుమార్టం నివేదిక, పోలీస్‌ విచారణలో నిజ నిజాలు వెల్లడి కావాల్సి ఉంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top