ఏలూరులో వివాహిత హత్య | Married Woman Murdered in East Godavari | Sakshi
Sakshi News home page

ఏలూరులో వివాహిత హత్య

Jan 25 2019 7:38 AM | Updated on Jan 25 2019 7:38 AM

Married Woman Murdered in East Godavari - Sakshi

హత్యకు గురైన సుమన్‌ దోహరే

ఏలూరు టౌన్‌: ఏలూరు నగరంలో ఒక వివాహిత పట్టపగలే హత్యకు గురైంది. దుండగుడు ఆమె చీర కొంగునే గొంతుకు బిగించి హత్య చేసి పరారయ్యాడు. స్థానిక వంగాయిగూడెం సమీపంలోని సుబ్రహ్మణ్యం కాలనీలో జరిగిన ఈ హత్య సంఘటన నగరంలో కలకలం రేపింది. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా హత్యకు గురైనట్లు నిర్థారించారు. వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి వెళ్ళి విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన భార్యభర్తలు ఆత్మారామ్‌ దొహరే, సుమన్‌ దొహరేకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెండేళ్ళ క్రితం మధ్యప్రదేశ్‌ నుంచి ఏలూరు వచ్చి  సుబ్రహ్మణ్యం కాలనీలో ఒక ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఆత్మరామ్‌ దోహరే బిస్కెట్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

వీరి పెద్ద కుమారుడు మధ్యప్రదేశ్‌లోనే ఉంటుండగా వీరితో 8ఏళ్ళ కుమార్తె, 6ఏళ్ళ కుమారుడు ఉంటున్నారు. గురువారం ఉదయం పిల్లలు బడికి వెళ్ళగా ఆత్మారామ్‌ దోహరే బిస్కెట్లు విక్రయించేందుకు బయటకు వెళ్ళాడు. సాయంత్రం సమయంలో భార్యకు ఫోన్‌ చేయగా ఎంతకూ ఫోన్‌ తీయకపోవటంతో కంగారుపడి ఇంటి పక్కవారికి ఫోన్‌ చేశాడు. స్థానికులు వెళ్ళి చూసేసరికి అతని భార్య సుమన్‌ దోహరే (30) గొంతుకు చీరకొంగు బిగించబడి విగతజీవిగా నేలపై పడిఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి ఆరా తీశారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆత్మారామ్‌ దోహరే మేనల్లుడు బకిల్‌ అప్పుడప్పుడూ అతని ఇంటికి వచ్చి వెళుతుంటాడు. అతను విశాఖపట్నంలో పానీపూరీ అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. సుమన్‌ దోహరేతో బకిల్‌కు వివాహేతర సంబంధం ఉందనీ, మధ్యమధ్యలో అతని ఇంటికి వస్తూ ఉంటాడని తెలుస్తోంది. బకిల్‌ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి ఉంటాడని, సుమన్‌ దోహరేతో ఏదైనా ఘర్షణ జరిగి ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త ఆత్మారామ్‌ దోహరే ఫిర్యాదుతో వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement