జనజీవన స్రవంతిలోకి రావాలి | Sakshi
Sakshi News home page

జనజీవన స్రవంతిలోకి రావాలి

Published Thu, Mar 8 2018 12:39 PM

Maoist surrender : Sp Vishal gunni - Sakshi

కాకినాడ రూరల్‌: మావోయిస్టులు ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు ఇష్టపడుతున్నారని, అటువంటి వారికి ప్రభుత్వపరంగా సాయం చేసి, స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అవసరయ్యే చర్యలను తీసుకుంటామని జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని అన్నారు. మంగళవారం సాయంత్రం ఏటపాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేయగా, మరో మావోయిస్టు బుధవారం ఎస్పీ గున్నీ ఎదుట లొంగి పోయాడు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఒడిస్సా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా, మోటు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తొగరుకోట గ్రామానికి చెందిన ఆంధ్రా ఒడిశా స్పెషల్‌ జోనల్‌ కమిటీ పరిధిలోని పప్పలూరు ఏరియా కమిటీ దళంలో ఏసీఎంగా పని చేసిన మడకం ఎర్రయ్య అలియాస్‌ రుషి (33) బుధవారం ఎస్పీ విశాల్‌ గున్ని ఎదుట లొంగిపోయాడు.

ఇతనికి తక్షణ ఆర్థిక సహాయం కింద రూ. 20 వేలు, పునరావాసం కోసం జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే విధంగా ఇతని తలపై ఉన్న రివార్డు మొత్తం కోసం మల్కాన్‌గిరి జిల్లా ఎస్పీకి లేఖ రాస్తున్నట్లు ఎస్పీ విశాల్‌ గున్ని  వివరించారు. అలాగే చింతూరు ఏఎస్‌డీ, ఎస్‌డీపీవోల ఆదేశాలపై ఏటపాక పోలీస్‌స్టేషన్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో డీఏకేఎంఎస్‌కు చెందిన ఒక దళ సభ్యుడు, ఇద్దరు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. చత్తీస్‌ఘఢ్‌ సుకుమా జిల్లా పాలోడ్‌కు చెందిన మడివి రామ అనే  డీఏకేఎంఎస్‌ దళానికి చెందిన వ్యక్తి, అతనితో పాటు భద్రాది కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం చిన్ననల్లబిల్లి గ్రామానికి చెందిన  మోలుమురి శ్రీనివాసరావు, అదే మండలం పెద్ద నల్లబిల్లి గ్రామానికి చెందిన పాయం జోగారావు కొరియర్లను అరెస్టు చేసి  రూ. 70 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు.  అడిషనల్‌ ఎస్పీ (ఆపరేషన్స్‌) వై.రవిశంకర్‌రెడ్డి, రంపచోడవరం ఏఎస్పీ అజిత్‌ వేజెండ్ల పాల్గొన్నారు.

Advertisement
Advertisement