సెల్ టవర్‌పై రాకేష్
పాల్వంచ: అతడిపై రెండు దొంగతనం కేసులున్నాయి. వేధిస్తున్నాడంటూ ఓ అమ్మాయి, మరో దళితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో మరో రెండు కేసులు నమోదయ్యాయి. పాల్వంచలోని కరకవాగు గ్రామస్తుడైన అతడి పేరు గన్నవరపు రాకేష్. ఇతడు మంగళవారం ఉదయం 9.00 గంటల సమయంలో, కేఎస్‌పీ రోడ్డులోని ఫిల్టర్ బెడ్ వద్దనున్న సెల్ టవర్ పైకి ఎక్కాడు. ‘‘పోలీసులు నాపై అకారణంగా కేసులు పెట్టారు. ఇబ్బందులపాలు చేస్తున్నారు’’ అనేది అతగాడి ఆరోపణ.
తనపై కేసులన్నీ ఎత్తివేయకపోతే.. కిందికి దూకి చచ్చిపోతానంటూ అక్కడకు వచ్చిన పోలీసులను బెదిరించాడు. అతడిని కిందికి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నించారు. చివరికి, సాయంత్రం 6.00 గంటల సమయంలో దిగొచ్చాడు. అతడిని స్టేషన్‌కు పోలీసులు తీసుకెళ్లారు. ‘‘అతడిపై రెండు చోరీ కేసులు, మరో రెండు వేధింపుల కేసులు ఉన్నాయి. అతడిని మేం వేధించలేదు’’ అని, ఎస్‌ఐ రవి చెప్పారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
