భార్యలు 1, 2, 3...8, అందరినీ మోసం చేశాడు

Man Cheats 4.5 crores by Marrying Eight Women - Sakshi

కోయంబత్తూరు : సరకు రవాణా వ్యాపారం అంతగా లాభసాటిగా సాగడం లేదు. అందుకే ‘పెళ్లి’ని వ్యాపారంగా మార్చి.. తాళిని ఎగతాళి చేయాలని భావించాడో ఘనుడు. అందులో విజయం సాధించడమే కాక భార్యలను మోసంగించి కోట్లకు పడగలెత్తాడు. వరుసపెట్టి ఎనిమిది పెళ్లిళ్లు చేసుకొని వారిని రూ.4.5 కోట్ల మేర ముంచాడు. కోయంబత్తూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బి. పురుషోత్తమన్‌(57) కోయంబత్తూర్‌లోని వెల్లలూర్‌లో నివాసం ఉండేవారు. ఆయన భార్య ఉషారాణి చాలా ఏళ్ల క్రితమే మరణించింది. ఆయనకు కుమార్తె గీతాంజలి(18) ఉంది.

కోయంబత్తూర్‌లో పెళ్లి సంబంధాల ఏజెన్సీ నిర్వహించే మోహన్‌, వనజ కుమారిలతో పరిచయం పెంచుకున్న పురుషోత్తమన్‌.. విడాకులు తీసుకున్నవారు, వితంతువులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఎనిమిదేళ్లలో మొత్తం ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు. చెన్నైకు చెందిన ఇందిరా గాంధీ(45) కూడా పురుషోత్తమన్‌ చేతిలో మోసపోయారు.

లెక్చరర్‌గా పనిచేస్తున్న ఇందిరా గాంధీకి మాయమాటలు చెప్పి పెళ్లాడాడు. ఆమెకు చెన్నైలో ఇల్లు ఉండడంతో దాన్ని అమ్మివేసి కోయంబత్తూర్‌లో కొనుగోలు చేయాలని చెప్పాడు. పురుషోత్తమన్‌ మాటలు నిజమేనని నమ్మి రూ.1.5 కోట్లకు అమ్మి డబ్బును అతని చేతిలో పెట్టింది.

డబ్బు చేతికి అందిన మరుక్షణం నుంచి మళ్లీ అతడు ఇందిర కంటికి కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. తనకు ముందు ముగ్గుర్ని, ఆ తరువాత మరో నలుగుర్ని పురుషోత్తమన్‌ పెళ్లి చేసుకున్నాడని తెలుసుకొని ఇందిరా నిర్ఘాంతపోయారు. కుముదవల్లి అనే మహిళను కూడా పురుషోత్తమన్‌ ఇలానే మోసం చేశాడని తెలిసి కుప్పకూలిపోయారు.

తనకు రావాల్సిన రూ.17 కోట్ల ఆస్తి వివాదం కోర్టులో ఉందని, అంతవరకు డబ్బు సర్దమని పురుషోత్తమన్‌ కుముదవల్లిని కోరాడని పోలీసులు తెలిపారు. అతడిని గుడ్డిగా నమ్మిన ఆమె తనకున్న పొలాలను రూ.3 కోట్లకు అమ్మి అతని చేతిలో పెట్టిందని చెప్పారు. ఆ తర్వాత పురుషోత్తమన్‌ కనిపించకుండా పోయాడని వివరించారు. పురుషోత్తమన్‌పై ఇప్పటికే 18 మోసం కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top