కక్ష తీర్చుకున్న కట్నం రక్కసి  

Man Attack Women For Dowry Machilipatnam - Sakshi

ఓ ఉన్మాది కత్తిపోట్లకు గురై ముగ్గురు మహిళలు ప్రాణాపాయ స్థితికి చేరారు. తమ్ముడి తరఫున అధిక కట్నం విషయం మాట్లాడేందుకు వచ్చి ఓ వృద్ధురాలితో పాటు ఆమె కూతురు.. ఆ కూతురు కూతురుని కత్తతో పొడిచి కసి తీర్చుకున్నాడు. క్షతగాత్రుల్లో ఇద్దరు బందరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండగా మరో మహిళ పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలించారు.      

సాక్షి, విజయవాడ :  మచిలీపట్నం హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న గంజాల మహేష్‌ రైతు బజారులో కూరగాయాల వ్యాపారం చేస్తుంటాడు. అతనితో సమీప బంధువైన కోమట్ల భార్గవి (16) ప్రేమలో పడింది. ఇద్దరు కొన్ని నెలలు ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు తెలియడంతో అందరూ బంధువులు కావడంతో భార్గవి మైనర్‌ అయినప్పటికి మహేష్‌తో వివాహం జరిపించారు. వివాహ సమయంలో మహేష్‌ తల్లిదండ్రులు కట్నకానుకలు వద్దని చెప్పడంతో భార్గవికి ఎలాంటి కానుకలు ఇవ్వలేదు. అయితే ప్రేమ వివాహం చేసుకున్న వారిద్దరి మధ్య సఖ్యత ఎంతో కాలం కొనసాగలేదు. పెళ్లయిన నెల రోజులకే మహేష్‌ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టి పుట్టింటి నుంచి రూ.5 లక్షలు కట్నం తీసుకురమ్మంటూ భార్గవిని వేధించి, చివరకు పుట్టింటికి పంపేశాడు. జరిగిన విషయాన్ని భార్గవి తన తల్లి శారదకు చెప్పుకొని బోరుమంది. 

పెద్దల సమక్షంలో రాజీ..   
మహేష్‌ వేధింపులు తెలుసుకున్న భార్గవి తల్లి శారద విషయాన్ని బంధువులకు చెప్పింది. బంధువులు అంతా కలసి రెండు కుటుంబాల మధ్య చర్చలు జరపగా శారద రూ.2 లక్షలు కట్నంగా డబ్బు ఇచ్చేందుకు ఒప్పుకుంది. అయితే వారిద్దరి వివాహాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించిన తరువాత పెద్దల సమక్షంలో డబ్బు ఇస్తానని చెప్పింది. ఈ విషయంలో మళ్లీ రెండు కుటుంబాల మధ్య వివాదం రేగింది. భార్గవిని మహేష్‌ సోదరి కొమ్మన ఝాన్సీరాణి ఇంట్లో ఉంచేలా బంధువులు నిర్ణయించారు. అప్పటి నుంచి భార్గవి మహేష్‌ అక్క ఇంట్లోనే ఉంటోంది.  

పథకం ప్రకారం కత్తిపోట్లు 
పెద్దలు రెండు కుటుంబాల మధ్య రాజీ కుదర్చగా భార్గవి తల్లి శారద బందరు మండలంలోని గోకవరం గ్రామానికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా గురువారం అర్ధరాత్రి మహేష్‌ పెద్దనాన్న కొడుకు ఎలిషా ఆటోలో గోకవరం వచ్చాడు. మహేష్‌ కట్నం విషయమై శారదతో ఘర్షణ పడ్డాడు. పెద్దల సమక్షంలో అంతా మాట్లాడుకున్నాం అని వేరే విషయం ఏమైనా ఉంటే అదే పెద్దల మధ్య పెట్టి మాట్లాడుకుందామని శారద తేల్చిచెప్పింది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన ఎలిషా పది నిమిషాల తరువాత మళ్లీ శారద ఇంటికి వచ్చి ఆమెపై కత్తితో దాడి చేశాడు.

ఆమె పొట్టలో విచక్షణారహితంగా పొడిచాడు. పక్కనే ఉన్న శారద తల్లి కాంతమ్మ అడ్డం రాగా ఎలిషా ఆమెనూ పొడిచాడు. డబ్బై ఏళ్లకుపైగా వయస్సు ఉన్న కాంతమ్మ తల్లి వరలక్ష్మమ్మ అతన్ని బతిమాలే ప్రయత్నం చేయగా ఆమెపైనా కత్తితో దాడి చేశాడు.  కత్తిపోట్లతో తీవ్ర గాయాలపాలైన ముగ్గురు అక్కడికక్కడే కుప్పకూలిపోగా ఎలిషా అదే ఆటోలో అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బంధువులు గ్రామానికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన రూరల్‌ ఎస్‌ఐ రంగనాథ్‌ చికిత్స నిమిత్తం క్షతగాత్రులను బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శారద పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను విజయవాడకు పంపారు.  

డీఎస్పీ విచారణ  
సంఘటనపై శుక్రవారం ఉదయం బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా గోకవరంలో విచారణ జరిపారు. స్థానికులతో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేయాలంటూ ఎస్‌ఐని ఆదేశించారు. ఈ సంఘటనపై బందరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top