జోరుగా ఐపీఎల్‌ బెట్టింగ్‌లు

IPL Cricket Bettings in Guntur - Sakshi

జిల్లాలో ఊపందుకున్న ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌లు

మాఫియాగా ఏర్పడి బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న బుకీలు

బుకీల మాయ మాటలు నమ్మి మోసపోతున్న సాధారణ ప్రజలు

బుకీలుగా వ్యవహరిస్తున్న తెలుగు తమ్ముళ్లు

గత ఐపీఎల్‌ సీజన్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తూ పట్టుబడ్డ అధికార పార్టీ అనుచరులు

సాక్షి, గుంటూరు: ఫ్రాంచైజీలు, ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ మధ్యతరగతి కటుంబాలను మాత్రం రోడ్డు పాలు చేస్తోంది. క్రికెట్‌ బుకీల మాయ మాటలు నమ్మి సాధారణ, మధ్యతరగతి యువకులు, విద్యార్థులు సర్వం కోల్పోయి రోడ్డున పడుతుంటే, కొందరు పోలీసులకు పట్టుబడి జైలు పాలవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గత ఐపీఎల్‌ సీజన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతూ పట్టుబడిన వారిలో ఎక్కువ శాతం మంది హోటళ్లలో పని చేసే వారు, కూలీ పనులు, చిరు వ్యాపారులే ఉన్నారు.

వీరంతా క్రికెట్‌ బెట్టింగ్‌ బుకీల మాయ మాటలు నమ్మి పందేలు కాస్తూ సర్వం కోల్పోయారు. ఎవరిని కదిలించినా బెట్టింగ్‌లకు పాల్పడి అప్పుల పాలయ్యాం అని చెప్పేవారే. మ్యాచ్‌ ఏదైన పందేం కాసేది ఏవైపైనా, ఎన్ని పందేలు కట్టినా ఓడిపోయేది మాత్రం బెట్టింగ్‌ రాయుళ్లే ఈ విషయం తెలుసుకోలేని మధ్య తరగతి,  సాధారణ ప్రజలు అప్పులపాలై, పోలీసులకు పట్టుబడి జైళ్లకు వెళ్తున్నారు. బెట్టింగ్‌ల్లో సర్వం కోల్పోయి పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు సైతం జిల్లాలో అనేకం ఉన్నాయి. అయినప్పటికీ బెట్టింగ్‌ రాయుళ్లలో ఎలాంటి మార్పు రావడం లేదు.

జోరుగా బెట్టింగ్‌లు..
ప్రస్తుతం ఐపీఎల్‌ 2019 నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్‌ రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. సీజన్‌ ప్రారంభంలోనే గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీసులు భారీ బెట్టింగ్‌ ముఠాను అరెస్టు చేశారు. పోలీసులు సార్వత్రిక ఎన్నికల హడావుడిలో మల్లగుల్లాలు పడుతుంటే, బెట్టింగ్‌ రాయుళ్లు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న బుకీలకు పోలీస్‌ శాఖలో కొందరి సహాయం ఉండటంతో వారు రెచ్చిపోతున్నారు. బుకీల నుంచి పలువురు పోలీస్‌ అధికారులకు మామూళ్లు సైతం ముడుతున్నాయి. టీడీపీ కీలక నేతల అండదండలతో క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ముఠాలు మాఫియాగా ఏర్పడ్డాయి. ఈ మాఫియాలోని బుకీలు అమాయకులను మోసం చేస్తూ కోట్లు గడిస్తున్నారు. అమాయకులు మాత్రం సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు.

బుకీల మోసం ఇలా..
సాధారణంగా క్రికెట్‌ మ్యాచ్‌ టాస్‌ నుంచి మ్యాచ్‌ గెలుపు, ఓటముల వరకు బెట్టింగ్‌లు నడుస్తుంటాయి. అయితే బెట్టింగ్‌ రాయుళ్లందరూ టీవీల్లో, ఆన్‌లైన్‌ లైవ్‌లో చూస్తూ ఫండర్లు పందేలు కాస్తుంటారు. ఈ బెట్టింగ్‌లు బుకీలు నిర్వహిస్తుంటారు. వివిధ రాష్ట్రాల్లో ఉండే ప్రధాన క్రికెట్‌ బూకీలు ఇతర ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని కమీషన్ల మీద వారిని నియమించుకుంటారు. దీని కోసం ఓ ప్రత్యేక ఫోన్‌లైన్‌ సెటప్‌ చేసుకుని, వాటి ద్వారా ఎప్పటికప్పుడు మ్యాచ్‌లో చోటు చేసుకునే అంశాల మీద పందెం «ధరలను నిర్ణయిస్తూ ఫండర్లను ఆకర్షిస్తుంటారు. ఇందులో టాస్‌ ఎవరు గెలుస్తారు.. సెషన్స్‌ ప్రతి ఐదు ఓవర్లలో స్కోరు ఎంత వరకు వస్తుంది, బాల్‌ టూ బాల్, తర్వాత బాల్‌లో వికెట్‌ పడుతుందా, సిక్స్‌ కొడతారా అంటూ బుకీలు వారికి అనుగుణంగా ధరలు పెంచుతుంటారు. ఈ విషయం తెలియని పందెం రాయుళ్లు టీవీల్లో మ్యాచ్‌లు తిలకిస్తూ ఊహించని బెట్టింగ్‌లు కడుతుంటారు. అయితే 90 శాతం బెట్టింగ్‌ ఫలితాలు ఫండర్ల ఊహకు భిన్నంగా ఉంటాయి. అబ్బ జస్ట్‌ మిస్‌ నెక్టŠస్‌ టైం కచ్చితంగా గెలుస్తాం.. అంటూ డబ్బు పోగొట్టుకుంటున్నారు అమాయక ప్రజలు.

బుకీలందరూ తెలుగు తమ్ముళ్లే
రాజధాని ప్రాంతంలో అమాయక ప్రజలను క్రికెట్‌ బెట్టింగ్‌ల పేరుతో మోసం చేస్తున్న వారిలో తెలుగు తమ్ముళ్లే అధికంగా ఉండటం గమనార్హం. గత ఐపీఎల్‌ సీజన్‌లో పిడుగురాళ్ల మున్సిపల్‌ కౌన్సిలర్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తూ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అదే సీజన్‌లో చిలకలూరిపేటలో పట్టుబడిన బుకీలు తన్నీరు వెంకటేశ్వర్లు, గొట్టిపాడు సదాశివరావు, కామినేని ప్రధీప్‌ కుమార్‌ టీడీపీకి చెందిన వారు కావడం గమనార్హం. కోడెల శివప్రసాద్‌ కుమారుడు కోడెల శివరామ్, పెదకూరపాడు తాజా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ అనుచరులు బెట్టింగ్‌లు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తెగబడి క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ఘటన జిల్లా ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది.

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడితే మిగిలేది విషాదమే
క్రికెట్‌ బెట్టింగ్‌ల ద్వారా వచ్చే డబ్బుతో స్వల్ప కాలం మాత్రమే ఆనందం ఉంటుంది. ఆ తర్వతా దుఖఃమే మిగులుతుంది. బుకీల మాయ మాటలు నమ్మి ఎవరూ బెట్టింగ్‌లలో డబ్బులు పెట్టి నష్టపోవద్దు. కష్టాలు కొనితెచ్చుకోవద్దు. ఎక్కువ శాతం మధ్య తరగతి, సాధారణ యువకులు, విద్యార్థులను టార్గెట్‌ చేస్తూ బుకీలు మోసం చేస్తుంటారు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ నేపథ్యంలో క్రికెట్‌ బెంట్టింగ్‌లపై ప్రత్యేక నిఘా ఉంచాం. బెట్టింగ్‌లకు పాల్పడి అరెస్టు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.    – సీహెచ్‌.విజయారావు, అర్బన్‌ ఎస్పీ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top