అంతా ఐపీఎల్‌ మాయ

IPL Betting Behind Parthi Gang Rumors In Srikakulam - Sakshi

వీరఘట్టం : రాష్ట్రంలో పార్థిగ్యాంగ్‌ సంచరిస్తున్నట్టు ఎవరు పుకార్లు సష్టిస్తున్నారు... ఎందుకు సృష్టిస్తున్నారు... ఇలా చేస్తే వారికి ప్రయోజనం ఏంటి... అని ఆలోచిస్తున్నారా... ఈ వదంతుల వెనుక పెద్ద వ్యవహారమే ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమంది వ్యక్తులు ముఠాలుగా మారి వారి స్వప్రయోజనం కోసం ఇటువంటి పుకార్లు పెడుతూ పోలీసులను, ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి వదంతులు సష్టిస్తున్నవారిలో ఐపీఎల్‌(ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) బెట్టింగ్‌ ముఠా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్‌ టోర్నమెంట్‌ చివరి దశకు చేరుకుంది. క్వాలీఫయిర్, ఫైనల్‌ మ్యాచ్‌లు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి.

శుక్రవారం క్వాలీఫయిర్‌ మ్యాచ్, ఈ నెల 27న ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు రూ. కోట్లలో బెట్టింగ్‌లు జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లు మొదలైనప్పటి నుంచి బెట్టింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లు చివరి దశలో కూడా బెట్టింగ్‌లు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తమపై పోలీసులు దృష్టి సారించకుండా ఉండాలంటే వారిని దారి మళ్లించాలి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పార్థి గ్యాంగ్‌ ఉన్నట్టు... మనుషులను భయంకరంగా చంపేస్తున్నట్టు గ్రాఫిక్‌లో సృష్టిస్తూ తప్పుడు పోస్టింగ్‌లు పెడుతూ గుట్టుగా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు వినిపిస్తుంది.

చావ బాది... అయ్యో! 
 గత పది రోజులుగా పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా కంటి మీద కునుకు లేకుండా రాత్రి వేళల్లో పహరా కాస్తున్నారు. అపరిచితులు గాని అనుమానితులు గాని ఎవరైనా తమ ప్రాంతాల్లో సంచరిస్తే చితక బాదేస్తున్నారు. తర్వాత పోలీసులు వచ్చి విచారించే సరికి దెబ్బలు తిన్న బాధితులకు పార్థిగ్యాంగ్‌కు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తుండడంతో అయ్యో అంటూ బిక్క మొహాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటువంటి తప్పుడు  ప్రచారాలను ప్రజల్లోకి వదులుతున్న వారిపై పోలీసులు కఠినంగా చర్యలు చేపట్టకపోతే భవిష్యత్‌లో ఇంకా ఘోరాలు జరిగే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ విషయం
ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఎప్పుడు జరిగినా భారీగా రూ. కోట్లలో బెట్టింగ్‌లు జరుగుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ బెట్టింగ్‌లను అదుపుచేసేందుకు, బెట్టింగ్‌ రాయుళ్లను పట్టుకునేందుకు నిత్యం పోలీసులు నిఘా వేస్తున్నారు. దీంతో పోలీసుల దృష్టి తమపై పడకుండా ఉండేందుకు పార్థిగ్యాంగ్‌ రాష్ట్రంలో సంచరిస్తున్నట్టు, పోలీసులు అత్యవసర సమావేశాలు పెడుతున్నట్టు వాట్సాప్‌ల ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను వదిలారు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై అనుమానితులు, అపరిచితులు ఎవరు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వడం... పోలీసులు వచ్చి పరిశీలిస్తే వారు సామాన్య ప్రజలేనని తేలడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

అమాయకులు బలైపోతున్నారు
ఈ నెల 20వ తేదీన పాలకొండ మండలం కస్పావీధికి చెందిన రాము అనే యువకుడు తన తాతగారి గ్రామమైన కొర్లవలస వెళ్లేందుకు గురవాం నుంచి కొర్లవలస బయలుదేరాడు. గురవాం నుంచి పొలాల గట్లు మీదుగా నడిచి వెళుతుండగా అనుమానితునిగా భావించి స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. తర్వాత ఆ వ్యక్తికి దొంగలతో ఎటువంటి సంబంధం లేదని తెలియడంతో అంతా కంగుతిన్నారు. అదే రోజు విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం చిలకాంకు చెందిన ఇద్దరు యువకులు మద్యం కోసం వీరఘట్టం కొత్త బస్టాండ్‌కు వచ్చారు. వీరి వేషధారణ చూసి దొంగలుగా భావించి స్థానికులు చుట్టిముట్టి పోలీసులకు అప్పగించారు.

తర్వాత పోలీసులు విచారించగా వీరికి దొంగల ముఠాకు ఎటువంటి సంబంధం లేదని విడిచిపెట్టారు. అలాగే రెండు రోజుల క్రితం వైజాగ్‌లో మతిస్థిమితం లేని ఇద్దరు మహిళలను అనుమానితులుగా భావించిన స్థానికులు చితక బాది పోలీసులకు అప్పగించారు. తర్వాత వారు మతిస్థిమితం లేనివారని పోలీసులు తెలియజేశారు. ఈ వీడియోలు కూడా ప్రస్తుతం వాట్స్‌ప్‌లలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇలా పార్థిగ్యాంగ్‌ పేరుతో తప్పుడు పోస్టింగ్‌లు పెడుతూ ప్రజలను కొందరు బయపెడుతున్నారని పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇదంతా ఎందుకు, ఎవరు చేస్తున్నారని పోలీసులు ఆరా తీస్తే అసలు దొంగలు దొరుకుతారు. 

కఠిన చర్యలు తీసుకుంటాం
పార్థిగ్యాంగ్‌ పేరుతో తప్పుడు పోస్టింగ్‌లు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నవారు పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే శుక్ర, ఆదివారాల్లో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో బెట్టింగ్‌లకు పాల్పడేవారిపై నిఘావేస్తాం.
– జి.స్వరూపారాణి, డీఎస్పీ, పాలకొండ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top