వివాహేతర సంబంధం.. కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Illegal Affair Police Constable Suicide In Khammam - Sakshi

సత్తుపల్లిరూరల్‌: వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలో బెటాలియన్‌ కానిస్టేబుల్‌ తన సర్వీస్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి సత్తుపల్లి మండలం గంగారం 15వ ప్రత్యేక పోలీస్‌ బెలియన్‌లో ఇది జరిగింది. దీపావళి రోజున, 15వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ పూనెం శ్రీనివాస్‌(35) డ్యూటీలో ఉన్నాడు. అతడు తన తుపాకీతో మెడ కింది భాగంలో కాల్చుకున్నాడు. తోటి సిబ్బంది వచ్చేసరికి మృతిచెందాడు. వారు వెంటనే బెటాలియన్‌ కమాండెంట్‌ రామ్‌ప్రకాష్‌కు సమాచారమిచ్చారు. పూనెం శ్రీనివాస్‌ది చర్ల మండలం పూజారిగూడెం గ్రామం. 

వివాహేతర సంబంధమే కారణమా..? 
2007 బ్యాచ్‌కు చెందిన పూనెం శ్రీనివాస్, గంగారం 15వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం చర్ల మండలం గన్నవరంపాడు గ్రామానికి చెందిన రాధతో వివాహమైంది. వీరికి ఏడేళ్ల కుమారుడు నాగచైతన్య ఉన్నాడు. విశ్వసనీయంగా తెలిసిన ప్రకారం... నిత్యం ఓ మహిళతో ఫోన్‌లో మాట్లాడుతున్నావని, తనను పట్టించుకోవడం లేదని శ్రీనివాస్‌ను రాధ (గతంలో) ప్రశ్నించింది. ఈ విషయమై వారి మధ్య తరచూ గొడవలు జరిగాయి. అతడి పద్ధతి మారకపోవడంతో విసుగెత్తిన భార్య రాధ. రెండేళ్ల క్రితం కుమారుడిని తీసుకుని తన పుట్టింటికి వెళ్లి. అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. భర్త శ్రీనివాస్‌ విషయమై చర్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది.

చర్ల మండలం పూజారిగూడెం గ్రామానికే చెందిన మహిళతో శ్రీనివాస్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఆమెకు 11 సంవత్సరాల వయసున్న కూతురు ఉంది. ఆమె తన భర్త నుంచి విడిపోయింది. గంగారంలో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్, ఆమెతో ఏడాది కాలంగా అద్దె ఇంటిలో సహజీవనం సాగిస్తున్నాడు. వీరి మధ్య రెండు రోజుల క్రితం గొడవలు జరిగాయి. ఆమెపై అతడు బుధవారం చేయి చేసుకున్నాడు. ఆమె బంధువులు 100 నంబర్‌కు  ఫిర్యాదు చేశారు. పోలీసులు వెళ్లారు. రోజూ మద్యం తాగొస్తున్నాడని ఆమె, ఆమె తనను వేధిస్తున్నదని అతడు.. పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. వారికి పోలీసులు సర్దిచెప్పి వెళ్లారు.

మా బాబును మంచిగా చూసుకోండి.. 
గొడవ సద్దుమణిగిన తరువాత అతడు డ్యూటీకి వెళ్లాడు. అక్కడి నుంచే ఆమెతో సుమారు అరగంటపాటు ఫోన్‌లో మాట్లాడారు. ‘‘నేను తుపాకీతో కాల్చుకుని చనిపోతున్నాను. మా బాబును మంచిగా చూసుకోండి’’ అని ఆమె సెల్‌ ఫోన్‌కు తన ఫోన్‌ నుంచి మెసేజ్‌ పెట్టాడు. ఆమె దానిని చూసిన వెంటనే, బెటాలియన్‌లోనే కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ స్నేహితుడికి సమాచారమిచ్చింది. అతడు శ్రీనివాస్‌ వద్దకు వెళ్లేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. ఏసీపీ బి.ఆంజనేయులు పరిశీలించారు. శ్రీనివాస్‌ భార్య రాధను, బంధువులను విచారించారు. కేసును ఎస్సై డేవిడ్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top