మహిళ దారుణ హత్య

Husband Killed Wife In Hyderabad For Extra Dowry - Sakshi

భార్య గొంతు కోసిన భర్త

అదనపు కట్నం వేధింపులే కారణం

బంజారాహిల్స్‌: అదనపు కట్నం కోసం ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సనత్‌నగర్‌కు చెందిన సిరాజ్‌ వెల్డర్‌గా పని చేసేవాడు. శ్రీకృష్ణానగర్‌ సి బ్లాక్‌కు చెందిన అసీమా(19)తో గత ఏడాది అతడికి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 1.50 లక్షల నగదు, 20 తులాల బంగారం, రూ.50 లక్షల విలువైన ప్లాట్‌ ఇచ్చారు. సదరు ప్లాట్‌ అసీమా పేరున ఉండటంతో దానిని తన పేరున మార్చాలని సిరాజ్‌ తరచూ తన మామ అస్లాంఖాన్‌పై ఒత్తిడి చేస్తున్నాడు. ఇదే విషయమై గత నెల 18న  భార్యతో గొడవ పడటమేగాక ఆమె తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేశాడు.

నాలుగు నెలల కుమారుడితో సహా అసీమా  పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అస్లాంఖాన్‌ అల్లుడిని ఒప్పించి కుమార్తెను కాపురానికి పంపాడు. ఆమెతో బాగా ఉన్నట్లు నటిస్తూనే భార్యను హతమార్చేందుకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున మామ, బావమరుదులు, మరదళ్లు నిద్రిస్తుండగా వారి గదులకు గడియపెట్టి నిద్రిస్తున్న భార్య గొంతును కత్తితో కోశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం సిరాజ్‌ సనత్‌నగర్‌లోని తన తల్లిదండ్రులకు వద్దకు వెళ్లిపోగా, కుటుంబసభ్యులు అందరూ పరారయ్యారు. ఉదయం గదిలో నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించిన అస్లాంఖాన్‌ బయటి నుంచి గడియ పెట్టి ఉండటాన్ని గుర్తించి పక్కింటి వారికి సమాచారం అందించాడు.

వారి సహకారంతో బయటికి వచ్చి చూడగా రక్తం మడుగులో అసీమా మృతదేహాన్ని చూసి అక్కడే కుప్పకూలిపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు, క్లూస్‌టీమ్‌ ఆధారాలు సేకరించారు. నిందితుడు సనత్‌నగర్‌ వెళ్లే వరకు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఉన్నాయని ఆ వెంటనే సిగ్నల్స్‌ కట్‌ అయినట్లు పోలీసులు తెలిపారు. సిరాజ్, అతని కుటుంబసభ్యుల కోసం గాలింపు చేపట్టారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top