కట్నం కోసం భార్యపై భర్త దాష్టీకం

Husband And Inlaws Throws Woman On Railway Tracks For Dowry In Bihar - Sakshi

పట్నా : కోరినంత కట్నం ఇవ్వలేదని కట్టుకున్న భార్యను అతి దారుణంగా హింసించాడో ఓ కసాయి భర్త. తల్లిదండ్రులతో కలిసి ఆమెను రైల్వేట్రాక్‌పై పడేసి అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన బిహార్‌లోని గోపాల్‌గంజ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సదరు మహిళ భర్త, అత్తింటివారిపై ఫిర్యాదు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..  పెళ్లి సమయంలో కట్నంగా రెండు లక్షల రూపాయలతో పాటు బైక్‌ కూడా కొనివ్వాలని నిందితుడు అమ్మాయి(22) తరఫు వారిని డిమాండ్‌ చేశాడు. ఇందుకు సరేనన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో వాళ్లు కట్నం ఇవ్వలేకపోయారు. ఇక అప్పటి నుంచి అతడు.. తన తల్లిదండ్రులతో కలిసి భార్యను హింసించడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలో సోమవారం ఇనుప రాడ్లను వేడి చేసి బాధితురాలికి వాతలు పెట్టిన భర్త, అత్తమామలు.. చేతిగోళ్లను, జుట్టును పూర్తిగా కత్తిరించి దారుణంగా హింసించారు. అనంతరం ఆమెను సమీపంలోని ఓ రైల్వేట్రాక్‌పై పడేశారు. అయితే కాసేపటి తర్వాత మెలకువ రావడంతో బాధితురాలు స్థానికుల సహాయంతో ఆస్పత్రికి చేరుకున్నారు.  ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, శరీరంలోని చాలా భాగాలు పూర్తిగా కాలిపోయాయని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. కాగా వరకట్న వేధింపుల కేసులు, హత్యలు అధికమవుతున్నాయి. వరకట్నం ఇవ్వని కారణంగా కేరళకు చెందిన తుషార అనే వివాహిత అత్యంత దారుణ స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. కోరిన కట్నం ఇవ్వలేదనే కారణంతో భర్త హింసిస్తూ.. కేవలం చక్కెర నీళ్లు, నానిన బియ్యం మాత్రమే ఆహారంగా పెట్టడంతో మార్చి 21న ఆమె చనిపోయారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top