హోంగార్డుగా పని చేస్తూ నేరాలు

Home Guard Crime Reveals Hyderabad Police - Sakshi

నకిలీ ఐడీ కార్డులతో బెదిరింపుల దందా

ఆయుధంతో సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్‌

నాగోలు: ఎస్‌ఐ పేరుతో నకిలీ ఐడీ కార్డు తయారు చేసుకుని మరో ఇద్దరితో కలిసి బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న హోం గార్డుతో సహా అతడి అనుచరులు ఇద్దరిని ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఒక ఎయిర్‌ ఫిస్టల్, నకిలీ ఐడీ కార్డులు, ఫార్చునర్‌ కారుతో పాటు రూ.36 వేల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీనగర్‌ ఏసీపీ కార్యాలయంలో రాచకొండ ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ సురేందర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. జిల్లెలగూడ, న్యూ గాయత్రీనగర్‌కు చెందిన కాసిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి అబిడ్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో హోం గార్డుగా పని చేస్తున్నాడు. అతను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో పాటు జిల్లెలగూడలో వీటీ రియల్‌ ఫైనాన్స్‌ చిట్‌ఫండ్‌ నిర్వహిస్తున్నాడు. ఇంటలిజెన్స్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నట్లు నకిలీ ఐడీ కార్డు సృష్టించడమేగాక, ఒక ఎయిర్‌ ఫిస్టల్‌ కొనుగోలు చేశాడు. గతంలో హోం గార్డులుగా పని చేసిన ఎల్‌బీనగర్‌ మన్సూరాబాద్‌కు చెందిన తాళ్లూరి అశోక్, ఉప్పల్‌కు చెందిన అశోక్‌ రెడ్డితో ముఠా ఏర్పాటు చేశాడు.

అశోక్‌కు కానిస్టేబుల్‌గా, అక్కిరెడ్డిని జర్నలిస్ట్‌గా పేర్కొంటూ నకిలీ ఐడీ కార్డులు సృష్టించాడు. ముగ్గురూ కలిసి వెంకటేశ్వర్‌రెడ్డి కారుకు పోలీస్‌ సైరన్‌ ఏర్పాటు చేసుకుని టోల్‌ గేట్‌లు తదితర ప్రాంతాల్లో వాహనదారులు, ప్రజలను భయాందోళనలకు గురి చేసేవారు. గతంలో వీరు   యాదగిరి గుట్ట ప్రాంతంలో ఒక స్థలాన్ని కొనుగోలు చేసి, సేల్‌ డీడ్‌ చేసుకున్నారు. అయితే స్థలం విలువ పెరగడంతో యజమాని స్థలం ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని బెదిరించేందుకు  ఎయిర్‌ ఫిస్టల్‌ తీసుకుని కారులో వెళుతుండగా సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎయిర్‌ ఫిస్టల్, నగదు, నకిలీ ఐడీ కార్డులు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఏసీపీ పృధ్వీధర్‌రావు, ఎల్‌బీనగర్‌ సీఐ అశోక్‌రెడ్డి,  ఎస్‌ఓటీ సీఐ రవికుమార్, ఎస్‌ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top