కీచకుడికి ఖాకీల అండ.. సీఎం కార్యాలయ ఆదేశాలు బేఖాతరు

Headmaster Molested Co Teachers In Ananthapur District - Sakshi

లైంగిక వేధింపుల కేసులో ముందస్తు బెయిల్‌ పొందిన నటరాజ్‌ 

దర్జాగా విధులకు హాజరు 

పోలీసులు, అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

సాక్షి, తాడిపత్రి: మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వారిని లైంగికంగా వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరగకుండా పటిష్టమైన భద్రతను తీసుకోవాలని పోలీసులకు, అధికారులకు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఇందులో బాగంగానే ‘దిశ’ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల మన్నలనే కాకుండా యావత్‌ దేశ ప్రజల మన్నలను అందుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. అయితే దిశ చట్టానికి కొందరు అధికారులు, పోలీసులు తూట్లు పొడుతున్నారు.

తాడిపత్రి పట్టణంలోని ప్రకాశం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నటరాజ్‌ తోటి ఉపాధ్యాయులను లైంగికంగా వేధించడం సంచలనమైంది. దీనిపై గత ఏడాది డిసెంబర్‌ 9న పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు లైంగికంగా వేధింపులపై కేసు రిజిష్టర్‌ అయింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు పోలీసులు కీచకోపాధ్యాయునిపై చర్యలకు మాత్రం ఉపక్రమించలేదు. అప్పటి నుంచి మెడికల్‌ లీవుపై వెళ్లిన నటరాజ్‌.. ఉన్నట్లుండి శనివారం పాఠశాలలో ప్రత్యక్షమయ్యాడు.


మీడియా కనిపించగానే బయటకు వెళ్లిపోతున్న నటరాజ్‌
 
సీఎం కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడినా... 
కీచకోపాధ్యాయుడు నటరాజ్‌పై చర్యలు తీసుకుని వెంటనే విధుల నుండి సస్పెన్షన్‌ చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆదేశాలు వెలువడినా స్థానిక మున్సిపల్‌ అధికారులు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌ 11న స్థానిక మున్సిల్‌ అధికారులు ప్రకాశం ఉన్నత పాఠశాలకు వెళ్ళి నటరాజ్‌ వ్యవహారంపై విచారణ జరిపి ఆర్డీకి నివేదికను అందజేశారు. కానీ ఇంత వరకు కీచకోపాధ్యాయునిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఎవరీ అంతుపట్టడం లేదు. 

ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధుల్లోకి.. 
సాధారణంగా మున్సిపల్‌ పరిధిలో పనిచేసే ప్రధానోపాధ్యాయులు మెడికల్‌ లీవుపై వెళ్ళి వచ్చిన తరువాత తిరిగి తన విధుల్లోకి హాజరుకావాలంటే ముందుగా స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌కు తన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ అందజేసి ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుని నుండి భాద్యతలను స్వీకరించాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా శనివారం ఉదయం కీచకోపాధ్యాయుడు నటరాజ్‌ పాఠశాలలో విధులకు హాజరవడంతో అక్కడున్న ఉపాధ్యాయులు అవాక్కైయ్యారు. మీడియాకు చూసి అక్కడి నుంచి పరారైన నటరాజ్‌ .. ఆదివారం ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ, లైంగిక వేధింపుల కేసులో ముందస్తు బెయిల్‌ పొంది స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు.   

కాపాడుతున్న ఖాకీలు ! 
చట్టం దృష్టిలో అందరూ సమానులే అని నీతులు చెప్పే పోలీసులు సదరు కీచకోపాధ్యాయుడు చూపిస్తున్న చూపిస్తున్న ఉదాసీనతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై వెంటనే చర్యలు తీసుకుని కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సత్వరమే భాదిత మహిళలకు న్యాయం చేయాలని సీఎం.వైఎస్‌ జగన్, హోంమంత్రి సుచరితతో పాటు, జిల్లా ఎస్పీ సత్యయేసుబాబులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ తాడిపత్రి పోలీసులు మాత్రం ఆ కీచకోపాధ్యాయుడిని ఇంత వరకు అరెస్టు  కూడా చేయకపోవడంతో పాటు తమకేమి సంబంధం లేదన్నట్లు వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నారు. అందరి ఆదేశాలను తుంగలో తొక్కి కీచకోపాధ్యాయుడు ముందస్తు బెయిల్‌ పొందేందుకు అవకాశం కల్పించారన్న ఆరోపణలున్నాయి. మహిళలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు కీచకోపాధ్యాయునికి అండగా నిలవడం సరికాదని అంటున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top