కాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్‌

Groom Escape on Marriage Time In Anantapur - Sakshi

స్వచ్ఛమైన బంగారం ఇవ్వలేదని ఉడాయింపు

పోలీసులకు ఆశ్రయించిన వధువు తల్లిదండ్రులు  

అనంతపురం, కదిరి: మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. వధువు తల్లిదండ్రులు కట్నం రూపంలో ఇస్తున్న బంగారం స్వచ్ఛమైనది కాదంటూ వరుడు పరారయ్యాడు. గురువారం కదిరి పట్టణంలో చోటుచోసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తనకల్లు మండలం బాలసముద్రం పంచాయతీ టీ సదుంకు చెందిన మహబూబ్‌బాషా ఒక్కగానొక్క కుమారుడు మహమ్మద్‌ రఫికి కదిరి మున్సిపల్‌ పరిధిలోని నిజాంవలి కాలనీకి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11.30 గంటలకు కదిరిలోని టైటానిక్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిఖా(వివాహం) జరగాల్సి ఉంది. పెళ్లి హడావుడిలో ఎవరికి వారు నిమగ్నమై ఉన్నారు.

ముహూర్తం సమయానికి పెళ్లి వరుడు కన్పించడం లేదని చెప్పడంతో వధువు తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ముందురోజు రాత్రే (బుధవారం) తనకు కట్నం రూపంలో ఇస్తున్న 10 తులాలు స్వచ్ఛమైన బంగారం (కేడీఎం) కాదంటూ తమతో గొడవకు దిగారని, పెద్ద మనుషులు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగిందని వధువు తరపు బంధువులు పేర్కొన్నారు. పెళ్లి ఏర్పాట్లతో పాటు పెళ్లి భోజనాల కోసం సుమారు రూ.లక్ష దాకా ఖర్చు అయిందని, బంగార ం కోసమే రూ.3లక్షలు దాకా ఖర్చు చేశామని, తీరా పెళ్లి సమయానికి వరుడు పరారై తమను అవమానం పాలు చేశారని వధువు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

బీడీ బంక్‌ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడని, పెళ్లి కొడుకు మంచోడని కొందరు చెప్పడంతో ఈ సంబంధం కుదుర్చుకున్నామని, పెళ్లి కొడుకు ఇంత మోసగాడని ఇప్పుడే తెలుస్తోందని పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పట్టణ సీఐ గోరంట్ల మాధవ్‌ ఎదుట పోలీస్‌ స్టేషన్‌లో వాపోయారు. కట్నం ఇంకా రూ.50 వేలు ఎక్కువ ఇస్తామని వేరే వాళ్లు చెప్పడంతో పెళ్లి కొడుకు పరారై ఆ సంబంధం చేసుకోవడానికి సిద్ధమైనట్లు తమకు తెలిసిందని వారు ఆరోపించారు. పెళ్లి కుమార్తెకు మద్దతుగా నిజాంవలి కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పోలీస్‌ స్టేషన్‌ చేరుకొని బాధిత యువతికి న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top