వేగంగా  బజారుకు  తరలిపోయి.. 

Ganja Crime News Increase In Khammam - Sakshi

 ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇతర రాష్ట్రాలకు సరిహద్దులో ఉండటం.. రవాణా మార్గం అనుకూలంగా ఉండటం.. ఏజెంట్లు తొందరగా లభిస్తుండటంతో మత్తు పదార్థాల రవాణా జోరుగా సాగుతోంది. ఇతర రాష్ట్రాల్లో గంజాయిని విరివిగా పండించి, దానిని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు తరలించి, ఇక్కడి నుంచి ఏజెంట్ల ద్వారా ముంబయి, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో భద్రాచలం, చర్ల ప్రాంతాల్లో గంజాయి పట్టుబడుతున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటుండటం విశేషం. ముఖ్యంగా విద్యార్థులు ఈ మత్తు పదార్థాలకు అలవాటు కావడం, అవి లేకుండా ఉండలేకపోవడంతో ఉమ్మడి జిల్లాలోనూ మత్తు పదార్థాల వినియోగం పెరిగిందని తెలుస్తోంది. కాగా, ఒక్కసారిగా నాడీ మండలం ఉత్తేజితమై.. సాధారణ స్థితిలో ఉండాల్సిన మెదడు అసాధారణ స్థితిలోకి మారిపోయి.. చురుగ్గా కదలాల్సిన కళ్లు అదో రకమైన మత్తులోకి జారుకొని.. దేహమంతా ఓ మైకంలోకి వెళ్లిపోయి.. మరో లోకంలో విహరించినట్లుగా ఉండే ఆ వింత అనుభవం కోసం మెట్రోపాలిటన్లలోని యువత ఎగబడుతున్న వేళ.. ఈ మత్తు పదార్థాల వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా సాగుతోందని తెలుస్తోంది.

 ఖమ్మంక్రైం:  ఒడిశా నుంచి దిగుమతి  ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని దిగుమతి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గంజాయిని ప్రత్యేకంగా ప్యాకెట్లలో భద్రపరిచి, ఆ ప్యాకెట్లలోని గంజాయిని సిగరెట్ల రూపంలో లేదా కిలోల చొప్పున విక్రయిస్తుంటారు. ఒడిశా రాష్ట్రంలోని ఏజెన్సీల్లో గంజాయిని సాగు చేసి విక్రయిస్తున్నారు. దానిని ఉమ్మడి జిల్లాలో ఉన్న స్మగ్లర్లు తమ కింద ఉన్న ఏజెంట్ల ద్వారా సరఫరా చేయిస్తున్నారు.

పిండిప్రోలు టు ముంబయి వయా  ఔరంగాబాద్‌..  ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామం నుంచి ఒడిశా నుంచి తెచ్చిన గంజాయిని కొందరు వ్యక్తులు మహారాష్ట్రలోని ముంబయి, ఔరంగాబాద్‌కు ఎగుమతి చేస్తున్నట్లు తెలిసింది. మహబూబాబాద్‌ జిల్లాలోని నర్సింహులపేట మండలంలోని పలు తండాల్లో నుంచి సరఫరా అవుతున్న గంజాయిని ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు ముంబయికి తరలిస్తున్నారు. ఈ గంజాయిని తెచ్చి ఆరబెట్టి, ఓ ముద్దలా తయారు చేసి, మైకా కవర్లలో పెట్టి, ఎవరికీ అనుమానం రాకుండా కేజీ ప్యాకెట్‌ నుంచి 5, 10, 20 కేజీల ప్యాకెట్లను తయారు చేసి రైళ్లలో, లారీల్లో, బస్సుల్లో తరలిస్తున్నారు. కొన్ని నెలల కిందట ఖమ్మం రైల్వేస్టేషన్‌లో పిండిప్రోలుకు చెందిన కొందరు వ్యక్తులు గంజాయిని ఔరంగాబాద్‌కు తరలిస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు.

ఒడిశా నుంచి తెచ్చిన గంజాయిని లారీలో సూర్యాపేటకు తరలిస్తుండగా ఖమ్మంరూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయి ప్యాకెట్లను వేర్వేరుగా పెట్టుకుని ఒకేసారి నలుగురు, ఐదుగురు వ్యక్తులు బయలుదేరుతారు. పోలీసులు ఒకరిని పట్టుకున్న తర్వాత గంజాయి దొరికిందనుకుని, మిగతావారిని తనిఖీ చేయకుండా వదిలేస్తున్నట్లు సమాచారం. దీనిని అవకాశంగా తీసుకుంటున్న గంజాయి స్మగ్లర్లు యథేచ్ఛగా గంజాయిని ముంబయికి తరలిస్తున్నారు. ఒడిశాలో గంజాయి నాణ్యతను బట్టి కిలో రూ.1000 నుంచి రూ.400 వరకు కొనుగోలు చేస్తారు. ఇదే గంజాయి ముంబయి మార్కెట్లో కిలో రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు పలుకుతుందని సమాచారం. దీంతో అక్కడికి సూర్యాపేట మీదుగా వెళ్లి విక్రయిస్తూ ఉంటారు. ఏజెంట్లు ముంబయికి వెళ్లి సరుకును విక్రయించి వచేŠచ్‌ వరకు వారికి సంబంధించిన ముఖ్య వ్యక్తితో ఫోన్‌లో సంభాషించరని తెలుస్తోంది. ఒకవేళ వారు పోలీసులకు చిక్కితే ఈ కేసును మొత్తం వారి మీదే వేసుకొని జైలుకు వెళ్లి శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో తమ వెనుక ఉన్న వ్యక్తి సమాచారం వారు చెప్పరు. ఇలా వారి మధ్య ముందే ఒప్పదం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
రైళ్లలో గ్యాంగ్‌ల ద్వారా..  
ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని అర కిలో దగ్గర నుంచి నాలుగు కిలోల వరకు ప్రత్యేకంగా ప్యాక్‌ చేసి గ్యాంగ్‌లను ఏర్పాటు చేసుకొని ఖమ్మంతోపాటు వరంగల్‌ జిల్లాలకు గంజాయిని తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వైజాగ్‌ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి గంజాయిని సరఫరా చేసేవారు ఒకరిద్దరితోకాక సుమారు 15 నుంచి 20 మంది ద్వారా సరఫరా చేస్తున్నారు. ఒకవేళ పోలీసుల తనిఖీలో ఒకరిద్దరు పట్టుబడినా మిగతావారు వారు చేర్చాల్సిన గమ్యస్థానాలకు గంజాయిని చేరుస్తున్నారు. కాగా, రైల్వే స్టేషన్లలో ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వైజాగ్‌ నుంచి హెరాయిన్, బ్రౌన్‌షుగర్‌.. 
ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌ హార్బర్‌ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు హెరాయిన్, బ్రౌన్‌ షుగర్‌ కొన్నేళ్లుగా సరఫరా అవుతున్నట్లు సమాచారం. గతంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న మోతుగూడెం మండలం డొంకరాయి వద్దకు వద్దకు ఈ హెరాయిన్‌ లాంటి మాదక ద్రవ్యాలను వైజాగ్‌ హార్బర్‌ నుంచి స్మగ్లర్లు తీసుకొని వస్తుండేవారు. అక్కడి నుంచి సరుకును చింతూరు మండలం లక్కవరం జంక్షన్‌కు తీసుకొని రాగా, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి ఈ వ్యాపారం చేసేవారు. హెరాయిన్‌ను ముఖ్యంగా సిగరెట్లలో పెట్టి విక్రయిస్తుంటారని, దీనికి గాను పలువురు ఏజెంట్లను నియమించుకుంటారని తెలిసింది. ఈ మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నట్లు తెలిసినా కూడా కొందరు ఎక్సైజ్, పోలీస్‌ శాఖ సిబ్బంది మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వదిలేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రం ప్రాంతం, పెవిలియన్‌ గ్రౌండ్‌ ప్రాంతంలో మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు తెలిసింది. పలు కళాశాలల్లో కూడా కొందరు విద్యార్థులు ఈ మత్తు పదార్థాలకు బానిసలయ్యారని, వారికి కొందరు ఎప్పటి నుంచో మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నారని సమాచారం.  

పెరిగిన గంజాయి కేసులు
మూడేళ్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి కేసులు బాగా పెరిగాయి. ముఖ్యంగా కొత్తగూడెం ప్రాంతంలో గంజాయి, మత్తు పదార్థాలకు యువకులు బానిసలయ్యారని తెలిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం ఉండటం, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దు ఉండటంతో మత్తు పదార్థాల సరఫరాకు అనుకూలంగా మారింది. చుట్టు పక్కల రాష్ట్రాల్లో గంజాయి సాగుకు అనుకూలంగా నేలలు ఉండటం, పోలీస్, ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది తనిఖీలు సాధారణంగా ఉండటంతో ఈ జిల్లాలో గంజాయి సరఫరా ఎక్కువగా పెరిగిందని పలువురు ఎక్సైజ్‌ సిబ్బంది చెబుతున్నారు.
 
కేసుల వివరాలు..
 
2017లో..  

  • ఖమ్మంలో మూడు కేసులు నమోదు. నలుగురు అరెస్టు. 32 కేజీల గంజాయి స్వాధీనం  
  • భద్రాద్రి కొత్తగూడెంలో నాలుగు కేసులు నమోదు. 9 మంది అరెస్టు. 796 కేజీల గంజాయి స్వా«ధీనం. 3 వాహనాలు సీజ్‌. 

2018లో.. 

  • ఖమ్మంలో ఒక కేసు నమోదు. 194 కేజీల గంజాయి స్వాధీనం. ముగ్గురు అరెస్టు.  
  • భద్రాద్రి కొత్తగూడెంలో ఏడు కేసులు నమోదు. 26 మంది అరెస్ట్‌. 783 కేజీల గంజాయి స్వాధీనం 

2019 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు 

  • ఖమ్మంలో మూడు కేసులు నమోదు. ఐదుగురు అరెస్ట్‌. 20 కేజీల గంజాయి స్వాధీనం. ఒక వాహనం సీజ్‌. 
  • ద్రాద్రి కొత్తగూడెంలో ఒక కేసు నమోదు. ఒకరి అరెస్టు. 600 కేజీల గంజాయి స్వాధీనం. ఒక వాహనం సీజ్‌.  
  • మూడేళ్లలో పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.కోటికి పైగా ఉంటుందని ఎక్సైజ్‌ సిబ్బంది చెబుతున్నారు.  

టోల్‌ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి..  
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినట్లు తెలిస్తే వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌–1800–42525 2523, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ 94409 02277, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ 94409 02278, ఎక్సైజ్‌ సీఐ 94409 02671, కంట్రోల్‌ రూం 08742–224342 నంబర్లకు సమాచారం ఇవ్వాలి. రెండు జిల్లాల్లో ఎక్సైజ్, పోలీస్‌ శాఖల ఆ«ధ్వర్యంలో విస్తృత దాడులు నిర్వహిస్తాం. మత్తు పదార్థాలు విక్రయించే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెడతాం. నిరంతరం తనిఖీలు కొనసాగుతాయి. అంజన్‌రావు,ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top