
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బొగ్గు కుంభకోణంలో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాను ఢిల్లీలోని ఓ కోర్టు దోషిగా నిర్ధారించింది. యూపీఏ హయాంలో పశ్చిమ బెంగాల్‌లోని పలు బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గుప్తాతోపాటు మరో ఐదుగురిని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. వీరిలో ఒకరు రిటైరయ్యారు. 2005–08 సంవత్సరాల మధ్య బొగ్గు శాఖ కార్యదర్శిగా ఉన్న గుప్తాకు బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడిన రెండు కేసుల్లో కలిపి ఇప్పటికే ఐదేళ్ల వరకు జైలుశిక్షలు పడ్డాయి.
ఆయన ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. కోర్టు దోషులుగా ప్రకటించిన వారిలో కేఎస్ క్రోఫా అప్పట్లో బొగ్గు శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉండి, తర్వాత మేఘాలయ చీఫ్ సెక్రటరీగా రిటైరయ్యారు. మరో అధికారి కేసీ సమ్రియా యూపీఏ హయాంలో బొగ్గు శాఖ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం మైనారిటీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. శుక్రవారం విచారణ అనంతరం సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు దోషులందరినీ కస్టడీలోకి తీసుకున్నారు. డిసెంబర్ 3వ తేదీన కోర్టు వీరికి శిక్షలు ప్రకటించేదాకా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారు. బొగ్గు బ్లాకుల కేసులో మాజీ ప్రధాని మన్మోహన్‌కు ట్రయల్ కోర్టు 2015లో జారీ చేసిన సమన్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆయన పిటిషన్ ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
సమాచారాన్ని సీబీఐ లీక్ చేస్తోంది
బొగ్గు కుంభకోణం దర్యాప్తులో సీబీఐ గోప్యత పాటించడం లేదని స్పెషల్ జడ్జి ఓపీ సైనీ అన్నారు. సుప్రీంకోర్టు సూచనలను సీబీఐ పట్టించుకోకుండా బయటి వ్యక్తులకు దర్యాప్తు సమాచారాన్ని చేరవేస్తోందని వ్యాఖ్యానించారు. కుంభకోణానికి సంబంధించిన పలు కీలక విషయాలను సీబీఐ కోర్టు దృష్టికి తేకుండా దాచి ఉంచిందంటూ దాఖలైన పిటిషన్‌పై ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు.