కూతుళ్ల పెళ్లిళ్లు చేసే స్తోమత లేక..

Farmer Suicide Attempt In Medak - Sakshi

జోగిపేట(అందోల్‌): నీరు లేక పంట ఎండిపోయింది.. చేతికొచ్చిన కూతుళ్లకు వివాహం చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు, మరో వైపు రోజు రోజుకు పెరుగుతున్న అప్పులు.. ఈ పరిస్థితిలో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఆబేద్‌పాష (41) క్రిమి సంహరక మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషదకరఘటన అందోలు మండలం మాసానిపల్లిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఆబేద్‌మియాకు గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ సారి దాంట్లో వరి సాగు చేశాడు.

నీరు అందక పంట ఎండిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. మరో వైపు ప్రైవేట్‌గా రూ.2 లక్షలు, బ్యాంకులో రూ.లక్ష అప్పు ఉండడం, వివాహానికి సిద్ధంగా ఇద్దరు కూతుళ్లు ఉండడంతో ఆబేద్‌పాష తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈనెల 11న చేను వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. చేను పక్క వారి నుంచి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆబేద్‌పాష మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి నలుగురు కూతుళ్లు రిజ్వానా బేగం, అస్మాబేగం, హీనాబేగం, సమీనా బేగం ఉన్నారు. హీనాబేగం, సమీనాబేగంకు వివాహం కావాల్సి ఉంది. భార్య బేగంబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్‌ తెలిపారు.

గ్రామంలో విషాదం..
కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అబేద్‌ పాష ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నలుగురు కూతుళ్లలో ఇద్దరిని కష్టపడి డిగ్రీ, పీజీ చదివించాడని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఆబేద్‌మియా కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

ఆబేద్‌పాష మృతదేహం 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top