ధాన్యం కుప్ప.. మృత్యువు ముప్పు

Farmer Died in Road Accident Medak - Sakshi

రహదారులపై ఇష్టారీతిగా ధాన్యం ఆరబెడుతున్న రైతులు

రాత్రివేళలో ప్రమాదాలబారిన పడుతున్న వాహనదారులు

కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల వేడుకోలు

రాయపోలు(దుబ్బాక): రహదారులపై రైతులు ఇష్టారీతిగా చేపడుతున్న పంట నూర్పిడి ప్రమాదాలకు హేతువుగా మారుతోంది. ధాన్యం రోడ్డుపై ఆరబెట్టి.. ఆపై కుప్పలుగా చేర్చి నల్లని టార్పాలిన్‌లు కప్పుతుండడం.. వాటిని గుర్తించని వాహనదారులు ప్రమాదాలబారిన పడడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. రైతుల తీరుమారకపోవడంతో అమాయకుల ప్రాణాలమీదకు వస్తుంది. దౌల్తాబాద్, రాయపోలు మండలంలో ఇటీవల పలు ప్రమాదాలు చేటుచేసుకుని ప్రాణాపాయంలో పలువురు కొట్టుమిట్టాడుతున్నారు. దౌల్తాబాద్‌ మండల కేంద్రానికి చెందిన గుండెకాయ భిక్షపతి వారం రోజుల క్రితం తన భార్య భాగ్య ఇద్దరు పిల్లలతో కలసి రాయపోలు మండలం అనాజీపూర్‌కు ఓ విందుకు హాజరై తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామం వెళ్తున్నాడు. కాగా అహ్మద్‌నగర్‌ వద్ద రోడ్డుపై వరి ధాన్యం కుప్పను గమనించకుండా వాహనం ఢీకొట్టడంతో అదుపుతప్పి కిందపడిపోయాడు.

దీంతో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. భాగ్య అపస్మారక స్థితిలో వారం రోజులుగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతుంది. బుధవారం రాయపోలు మండలం వడ్డేపల్లికి చెందిన తప్పెట ప్రభాకర్‌ తన ద్విచక్రవాహనంపై గజ్వేల్‌ బయలుదేరాడు. కాగా రాంసాగర్‌ శివారులో రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పను గుర్తించకుండా ఢీకొట్టాడు. అతని తల పగిలింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోమాలో ఉండి చికిత్స పొందుతున్నాడు. ఇవి మచ్చుకు ఒకట్రెండు సంఘటనలు మాత్రమే. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఏదో ఓ గ్రామంలో నిత్యం ఓ ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది. ఉమ్మడి దౌల్తాబాద్‌ మండలంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది.

రోడ్డు ప్రమాదం అంటే వాహనం దానంతట అదే అదుపుతప్పి పడిపోవడమో.. లేక ఎదురుగా వస్తున్న మరోవాహనాన్ని ఢీకొనడమో కాదు. రైతులు ఆరబెట్టిన ధాన్యం కుప్పలను ఢీకొని ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంఘటనలు అధికంగా జరుగుతున్నాయి. గ్రామాల్లోని అంతర్గత రహదారులపై కాకుండా ప్రధాన రెండు వరుసల రహదారులైన రామాయంపేట–గజ్వేల్, చేగుంట–గజ్వేల్, దౌల్తాబాద్‌–దొమ్మాట రోడ్డపై కూడా సగం వరకు రైతులు పంటనూర్పిడికి వినియోగిస్తున్నారు. ప్రతి యేడాది ఖరీఫ్, రబీ సీజన్‌లలో ఇదే తరహాలో నూర్పిడి చేస్తూ.. ధాన్యం కుప్పలను వారాల తరబడి రోడ్డుపై ఉంచి నల్లటి కవర్లను కప్పి ఉంచడం ప్రమాదాలకు తావిస్తోంది. యేడాది క్రితం సూరంపల్లి వద్ద మంతూరుకు చెందిన స్వామి వరి కుప్పకు ఢీకొని మృతిచెందాడు. అలాగే ప్రతియేటా పలు ప్రమాదాలు జరుగుతున్నా రైతుల తీరులో మార్పు రావడం లేదు. రోడ్లమీద ధాన్యం ఆరబెట్టిన రైతులపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు, బాధిత కుటుంబీకులు కోరుతున్నారు.

అవగాహన కల్పిస్తాం..
రోడ్లపై ధాన్యం ఆరబెట్టే సంస్కృతి మంచిది కాదు. గత వారం అహ్మద్‌నగర్‌ వద్ద ప్రమాదం జరిగింది. బాధ్యులపై కేసునమోదు చేశారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకట్రెండు రోజులుగా రాత్రివేళలో పెట్రోలింగ్‌ చేసే సమయంలో ధాన్యం కుప్పలపై ఉంచిన కవర్లను తొలగిస్తూ వస్తున్నాం. రైతులకు నోటీసులిస్తున్నాం. మున్ముందు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా రైతులకు అవగాహన కల్పిస్తాం.
– చంద్రశేఖర్, ఎస్సై, దౌల్తాబాద్‌

కేసులు నమోదు చేస్తాం..
రహదారులపై ధాన్యం ఆరబెడితే రైతులపై కేసులు నమోదు చేస్తాం. రాంసాగర్‌ శివారులోనూ ధాన్యం పోసిన రైతుపై కేసునమోదు చేశాం. గతంలోనూ ఆరబెట్టిన రైతులకు నోటీసులిచ్చాం. రైతులకు స్వతహాగా అవగాహన వస్తేనే బాగుంటుంది. వారి కుటుంబసభ్యులు కూడా ప్రమాదాలకు గురైతే పరిస్థితి ఎలా ఉంటుందో అవగాహన పెంచుకోవాలి. ఇష్టారీతిగా ధాన్యం కుప్పలు రోడ్లపై ఉంచితే జప్తు చేసి రెవెన్యూ శాఖకు అప్పగిస్తాం.– నర్సింలు, ఎస్సై, రాయపోలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top