సాక్షి, మహదేవపుర(వైట్‌ఫీల్డ్): ఇంట్లో ఉన‍్నట‍్టుండి మంటలు ఎగిసిపడడంతో నిద్రలో ఉన‍్న కుటుంబం మొత‍్తం సజీవ దహనమైంది. ఈ విషాద సంఘటన మహదేవపుర పోలీసుస్టేషన్ పరిథిలోని ఉదయనగర్‌లో బుధవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి.
మహదేవపుర నియోజకవర్గం ఉదయనగరలోని కావేరీ స్ట్రీట్ మొదటి క్రాస్‌కు చెందిన డొర్‌నంబర్ 83లో సంతోష్(35), భార్య సూఫియా(30), కొడుకు ఫ్లోర(6)లు నివాసం వుంటున్నారు. వారు ఇంట్లో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలోవున్నందున వారు ముగ్గురూ కాలి మృతిచెందారు. ఇంట్లోంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ‍్బందికి, మహదేవపుర పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరకున‍్న పోలీసులు ముగ్గురి శవాలను 108 వాహనంలో బోరింగ్ ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే విషయమే పోలీసులు దర్తాప్తు చేస్తున్నారు.
ఈసందర్భంగా వైట్‌ఫీల్డ్ డీసీపీ అబ్దుల్ అహద్ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన ఇంట్లో సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్ల మంటలు ఎక్కువ కావడంతో వారు కాలిపోయి మృతి చెందినట్లు తెలిపారు. క్యాండిల్ కాలి.. తలదిండు అంటుకొని మంటలు ఎగసివుండవచ్చని ఆయన అనుమానం వ‍్యక‍్తంచేశారు.