1,381 కేజీల బంగారం సీజ్‌

Election Squad And Cops Seized Huge Quantity Of Gold At Thiruvallur - Sakshi

తమిళనాడులో ఘటన.. 

ఎలాంటి పత్రాలు లేకుండా తరలింపు 

మూడు వాహనాల్లో తీసుకెళ్తుండగా స్వాధీనం

సాక్షి, తిరుపతి: ఎన్నికల వేళ తరలిస్తున్న క్వింటాళ్లకొద్దీ బంగారాన్ని తమిళనాడు అధికారులు బుధవారం పట్టుకున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో మూడు వాహనాల్లో రవాణా చేస్తున్న 1,381 కేజీల బంగారు కడ్డీలను చూసి షాకైన అధికారులు.. ఆనక తేరుకుని వాటిని సీజ్‌ చేశారు. తమిళనాడులో గురువారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈసీ ఆదేశాల మేరకు తమిళనాట ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఇందులో తిరువళ్లూరు పుదుసత్రం వద్ద చెన్నై నుంచి తిరుపతి వైపు వెళుతున్న మూడు వాహనాలను ఆపిన అధికారులకు వాటిలో అనుమానాస్పదంగా ఉన్న ప్యాకెట్లు కనిపించాయి. వాటిని పూందమల్లి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి తరలించారు. 

భారీ పోలీసు బందోబస్తు నడుమ గిఫ్ట్‌ ప్యాక్‌ రూపంలో ఉన్న ప్యాకెట్లను తెరిచి చూశారు. ఆ ప్యాకెట్లలో బంగారు దిమ్మెలను గుర్తించి అవాక్కయ్యారు. పెద్దమొత్తంలో బంగారం పట్టుబడటంతో రిటర్నింగ్‌ అధికారి రత్న ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన పూందమల్లి తాలూకా కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో బంగారాన్ని ఏ రాజకీయ పార్టీకైనా ఇచ్చేందుకు తరలిస్తున్నారా, ఓటర్ల పంచేందుకు తీసుకెళుతున్నారా లేక స్మగ్లింగ్‌లో భాగంగా రవాణా చేస్తున్నారా అనే అనుమానంతో నలుగురినీ విచారణ జరుపుతున్నారు. పట్టుబడ్డ బంగారం స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూందమల్లి రిటర్నింగ్‌ అధికారి రత్న మాట్లాడుతూ వాహనాల తనిఖీల్లో 1,381 కిలోల బంగారం పట్టుబడిందని, దీనిని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ద్వారా స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. 

అది శ్రీవారి బంగారమే
ఇదిలావుండగా, వాహనాల డ్రైవర్లు మాట్లాడుతూ.. ఈ బంగారు కడ్డీలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అప్పగించేందుకు తీసుకెళుతున్నట్టు వివరించారు. కొనుగోలు డాక్యుమెంట్లు స్పష్టంగా ఉన్నట్టు తెలిపారు. దేవస్థానం అధికారుల వద్ద సరైన డాక్యుమెంట్లు ఉంటే బంగారాన్ని వారికి అప్పగిస్తామని, లేకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

టీటీడీ అధికారుల ఏమంటున్నారంటే..
తమిళనాడు పోలీసులు సీజ్‌ చేసిన బంగారం శ్రీవారికి చెందినదేనని టీటీడీ అధికారులు చెబుతున్నారు. టీటీడీకి సంబంధించిన శ్రీవారి బంగారాన్ని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసినట్టు తెలిపారు. 20 రోజుల క్రితం గడువు తీరడంతో వాటిని రిలీజ్‌ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రెజరీకి తరలిస్తున్నట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు. అయితే బంగారాన్ని టీటీడీ ట్రెజరీకి తరలిస్తున్నట్టుగా బుధవారం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు తెలిపారు. బ్యాంక్‌ అధికారులు మాత్రం బంగారం తరలింపుపై ఎన్నికల సంఘానికి లేఖ పంపినట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయంటున్నారు. ఆధారాలను గురువారం తిరవళ్లూరు కలెక్టర్‌కు అందజేసి బంగారాన్ని టీటీడీకి చేరేలా చర్యలు తీసుకుంటామని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అధికారులు వివరించినట్టు సమాచారం. ఇటీవల తిరుమల ఆలయంలో భారీఎత్తున ఆభరణాలు మాయమైనట్టు ఆరోపణలు వస్తున్న తరుణంలో చెన్నైలో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడటం అనేక అనుమానాలు తావిస్తోంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top