డ్రగ్స్‌ సరఫరా ముఠా అరెస్టు

Drugs Smugglers Arrest in Hyderabad - Sakshi

600 గ్రాముల ఎపిడ్రిన్‌ పట్టివేత

రూ.10 లక్షలకు విక్రయానికి యత్నించిన నిందితులు

కంటోన్మెంట్‌: నిషేధిత మాదక ద్రవ్యాలను సరఫరా చేసే ముగ్గురు ముఠా సభ్యులను గురువారం బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం మేరకు ముగ్గురినీ మాటు వేసి పట్టుకోవడంతో వారి నుంచి విలువైన మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను బేగంపేట ఏసీపీ రామ్‌రెడ్డి, బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనంతపురం పట్టణానికి చెందిన తాడిమర్రి చెన్నకేశవులు రెడ్డి స్థానిక సీవీరామన్‌ జూనియర్‌ కళాశాలలో పీఆర్‌ఓగా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం తాను ఇతరుల నుంచి కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న ఎపిడ్రిన్‌ (క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని పెంచే పదార్థం) డ్రగ్‌ను విక్రయించేందుకు ఇటీవల నగరానికి వచ్చాడు. తాడిపత్రికి చెందిన టప్పల్‌ సిలార్‌ అహ్మద్‌ వలీ ద్వారా నగరంలోని గాజులరామారానికి చెందిన ఆకుతోట కిషోర్‌ను కలిశారు. బోయిన్‌పల్లిలోని స్వీట్‌ హార్ట్‌ హోటల్‌ వద్ద డ్రగ్‌ కొనుగోలుదారుడి కోసం వేచిచూస్తున్న క్రమంలో డీఐ స్వామి గౌడ్‌ ఆధ్వర్యంలోని బృందం దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకుంది.

రూ.50 వేలకు కొని రూ.10 లక్షలకు అమ్మేయత్నం...
ప్రధాన నిందితుడు చెన్నకేశవరెడ్డి తాను, అనంతపురానికి చెందిన సీనయ్య నాయుడు (పరారీలో ఉన్నాడు)తో కలిసి 2017లో 600 గ్రాముల ఎపిడ్రిన్‌ డ్రగ్‌ను రూ.50వేలకు కొనుగోలు చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. రెండేళ్లుగా దాన్ని అమ్మలేకపోయాడు. ఇదే విషయాన్ని రెండు నెలల క్రితం రమణ (పరారీలో ఉన్నాడు)కు తెలుపగా, అతడు డ్రగ్‌ సాంపిల్‌ తీసుకుని దాన్ని రూ.10 లక్షలకు విక్రయిస్తానని చెప్పాడు. రమణ సూచనల మేరకు అమ్మద్‌ వలీకి డ్రగ్‌ అప్పగించగా, అతడు కిశోర్‌ను సంప్రదించాడు. కిశోర్‌ ఓ కొనుగోలుదారుడితో మాట్లాడి, డ్రగ్‌ తీసుకుని రావాల్సిందిగా చెన్నకేశవులు, అహ్మద్‌ అలీకి సూచించాడు. వీరు ముగ్గురు బుధవారం రాత్రి స్వీట్‌హార్ట్‌ హోటల్‌ వద్ద కొనుగోలుదారుడి కోసం ఎదురుచూస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యహరించిన డీఐ స్వామిగౌడ్, ఏఎస్‌ బలరామ్, కానిస్టేబుళ్లు రమణమూర్తి,మహేశ్, చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, సుధాకర్, శ్రీనివాస్, లింగమ్, వెంకటేశ్, మోహన్‌రెడ్డిలను ఏసీపీ రామ్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్‌లు ప్రత్యేకంగా అభినందించారు.  

మరింత లోతుగా విచారణ..
డ్రగ్‌కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుడు ఓ జూనియర్‌ కాలేజీలో ఉద్యోగి కావడంతో కాలేజీలు కేంద్రంగా సాగుతున్న డ్రగ్‌ విక్రయాలపై ఆరా తీయనున్నట్లు ఏసీపీ తెలిపారు. చెన్నకేశవులుకు డ్రగ్‌ అమ్మిన వ్యక్తులెవరు? సదరు డ్రగ్‌ కొనేందుకు యత్నించిన వారి కోసం కూడా గాలిస్తున్నామన్నారు. ఇక డ్రగ్‌ విక్రయంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారి నెట్‌వర్క్‌పై కూడా ఆరాతీస్టున్నట్లు ఏసీపీ రామ్‌రెడ్డి తెలిపారు. త్వరలో డ్రగ్‌ రాకెట్‌ను చేధించనున్నట్లు వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top