‘టాక్టికల్‌’గా పట్టేశాడు

Constable Catched Chain Snatcher - Sakshi

చైన్‌ స్నాచర్‌ అరెస్టు

ఏడాదిలో నాలుగు ప్రాంతాల్లో పంజా

ఆహార్యంతో గుర్తించిన కానిస్టేబుల్‌

చాకచక్యంగా వ్యవహరించడంతో అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: కాస్పోటిక్స్‌ వ్యాపారంలో వచ్చిన నష్టాలు పూడ్చుకోవడానికి చైన్‌ స్నాచర్‌గా మారిన నిందితుడిని బాచుపల్లి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడిని పట్టుకోవడంలో ఓ కానిస్టేబుల్‌ కీలక పాత్ర పోషించాడని, కమిషనరేట్‌ వ్యాప్తంగా ఇచ్చిన టాక్టికల్‌ ట్రైనింగ్‌ ఈ అధికారికి ఉపయుక్తంగా మారిందని సైబరాబాద్‌ అధికారులు తెలిపారు. గాజులరామారం, ప్రకాశంపంతులు నగర్‌కు చెందిన సునీల్‌ కుమార్‌ గతంలో కాస్మోటిక్స్‌ వ్యాపారం చేసేవాడు. ఇది సరిగ్గా నడవకపోవడంతో నష్టాలకు తోడు అప్పులయ్యాయి. వీటి నుంచి బయటపడేందుకు సునీల్‌ స్నాచర్‌ అవతారం ఎత్తాడు. నల్లరంగు బైక్‌ను ఖరీదు చేసిన ఇతను, దాని వెనుక నెంబర్‌ ప్లేట్‌ తొలగించాడు. ముందు భాగంలోదీ సరిగ్గా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. జీన్స్‌ ప్యాంట్, పాయింటెడ్‌ షూస్, హెడ్‌ వేర్‌తో కూడి స్వెర్టర్‌ ధరించి, ముఖానికి తెల్లని ఖర్చీఫు కట్టుకుని స్నాచింగ్స్‌ మొదలెట్టాడు. ఏడాది కాలంలో మియాపూర్, బాచుపల్లి ప్రాంతాల్లో నాలుగుసార్లు పంజా విసిరి 12.5 తులాల బంగారు ఆభరణాలు, పుస్తెలతాల్లు లాక్కెల్లాడు. జనవరి 13న బాచుపల్లి ప్రగతినగర్‌కు చెందిన కె.హారిక మెడలో ఉన్న నల్లపూసల గొలుసు లాక్కుపోయాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి ఇన్‌స్పెక్టర్‌ కె.బాలకృష్ణారెడ్డి దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. ప్రగతినగర్, బాచుపల్లి, నిజాంపేట, మియాపూర్‌ల్లోని అనేక సీసీ కెమెరాల ఫీడ్‌ అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో స్నాచర్‌ ఆహార్యంపై స్పష్టత వచ్చింది. ఈ ఫీడ్‌ నుంచి సేకరించిన ఫొటోలను గస్తీ సిబ్బందికి అందించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల నేపథ్యంలో కానిస్టేబుల్‌ రాజుకు (పీసీ 6116) ప్రగతినగర్‌లోని కేంద్రం వద్ద శుక్రవారం డ్యూటీ పడింది. అది ముగించుకుని స్టేషన్‌కు వెళుతుండగా, అదే సమయంలో సునీల్‌ మరోసారి పంజా విసరడానికి తన బైక్‌పై బయలుదేరాడు. బాచుపల్లిలోని పుష్ఫక్‌ అపార్ట్‌మెంట్స్‌ వద్ద రాజుకు అతను ఎదురు రావడంతో బైక్‌ రంగు, వెనుక నెంబర్‌ ప్లేట్‌ లేకపోవడం, సునీల్‌ ఆహార్యం చూసిన కానిస్టేబుల్‌ రాజుకు అతడే తాము వెతుకుతున్న స్నాచర్‌గా అనుమానించాడు. దీంతో సునీల్‌ వాహనాన్ని అడ్డగించాడు.

తాను ఒక్కడే ఉండటంతో పాటు తాను అనుమానిస్తున్న విషయం సునీల్‌ గుర్తిస్తే దాడి చేసి తప్పించుకుని పారిపోతాడని భావించిన రాజు వాహనానికి నెంబర్‌ ప్లేట్‌ లేని కారణంగా విచారణ కోసం పోలీసుస్టేషన్‌కు రావాల్సిందిగా చెప్పి సునీల్‌ను ఒప్పించాడు. అలా ఠాణాకు తీసుకువెళ్ళిన తర్వాత విచారించిన నేపథ్యంలో అతడే స్నాచర్‌గా తేలింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసిన బాచుపల్లి పోలీసులు బైక్, సెల్‌ఫోన్, మూడు నల్లపూసల గొలుసు లు, ఒక పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని సిబ్బందికి పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్య టాక్టికల్‌ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇందులో విపత్కర పరిస్థితుల్లో విధులు ఎలా నిర్వర్తించాలి? ప్రత్యేక సందర్భాల్లో ఎలా చాకచక్యంగా ఉండాలి? తదితర అంశాలు నేర్పిస్తున్నారు. గతంలో ఈ శిక్షణ పూర్తి చేసుకున్న రాజు అందులో నేర్పిన విషయాలను సద్వినియోగం చేసుకునే సునీల్‌ను పట్టుకోవడంతో కీలక పాత్ర పోషించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్‌ రాజుకు రివార్డు ఇవ్వనున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top