చంద్రబాబు అవినీతి ‘ఆకాశయానం’!

Chandrababu Naidu Name In Airasia Scam - Sakshi

ఎయిర్‌ ఏషియా స్కాంలో బాబు

ఆడియో టేపుల్లో బయటపడిన అడ్డగోలు వ్యవహారం 

సంభాషణలను బయటపెట్టిన బిజినెస్‌ టుడే 

కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ 

చంద్రబాబు, అశోకగజపతి పేర్లు రావడంతో కలకలం..

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు ఆడియో టేపుల్లో దొరికిపోయారు. చంద్రబాబు, పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోకగజపతిరాజుల వ్యవహారం ఈ టేపుల్లో బయటపడింది. గతంలో ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఈసారి ఎయిర్‌ ఏషియా కుంభకోణంలో బుక్కయ్యారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోన్న ఎయిర్‌ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ కుంభకోణానికి సంబంధించిన ఆడియో టేపులు తమ వద్ద ఉన్నాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక బిజినెస్‌ టుడే ప్రకటించింది. దీనికి సంబంధించి ఎయిర్‌ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌కు అదే సంస్థకు చెందిన ఇండియా సీఈఓ మిట్టూ శాండిల్యకు మధ్య జరిగిన సంభాషణను ఆ పత్రిక ప్రచురించింది. 

‘‘మనం ఎలాగోలా కొత్త రూట్లకు సంబంధించిన లైసెన్సులను సంపాదించాలి. ఎంత ఖర్చయినా పరవాలేదు. ఎవరిని పట్టుకుంటే పనవుతుంది? ఎలాగోలా ఈ పని చేయాల్సిందే.’’అని టోనీ ఫెర్నాండెజ్‌ చెబుతుండగా.. ‘‘ఈ పని చేయాలంటే చంద్రబాబు నాయుడు సమర్థుడు. ఆయనను ఒప్పించగలిగితే మొత్తం పని అయిపోతుంది. ఈ పనిని చంద్రబాబు ద్వారా చేయించుకోవచ్చు. ఎందుకంటే ఆయన మనిషే ఇపుడు పౌర విమాన యాన శాఖ మంత్రిగా ఉన్నాడు.’’అని మిట్టూ శాండిల్య వ్యాఖ్యానించినట్లు ఆడియో టేపుల్లో ఉండడం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఎయిర్‌ ఏషియా కుంభకోణంపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతున్న సంగతి తెల్సిందే. విదేశీ రూట్ల లైసెన్సులను దొడ్డిదారిన పొందడానికి గాను భారతీయ అధికారులకు లంచాలిచ్చినట్లు బయటపడడంతో వారిని అరెస్టు చేసి సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌ ఏషియా కుంభకోణానికి సంబంధించి గతంలో జరిగిన సంభాషణలతో కూడిన ఆడియో టేపులు బయటపడడం, అందులో చంద్రబాబు, అశోక గజపతి రాజు పేర్లు ప్రస్తావనకు రావడం సంచలనంగా మారింది. ఎయిర్‌ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌తో అశోక గజపతిరాజు సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాలలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలలో టీడీపీ సీనియర్‌ నాయకుడు కంభంపాటి రామ్మోహనరావు కూడా ఉండడం గమనార్హం.  

టోనీ ఫెర్నాండేజ్, శాండిల్య మధ్య జరిగిన సంభాషణలివీ.. 
ప్రముఖ లాబీయిస్టు రాజేందర్‌ దూబే సమక్షంలో శాండిల్యకు, టోనీ ఫెర్నాండెజ్‌కు మధ్య జరిగిన సంభాషణలతో కూడిన ఆడియో టేపులను బిజినెస్‌ టుడే బయటపెట్టింది. వాటిలో ఏమున్నదంటే..  
 
టోనీ ఫెర్నాండెజ్‌: నాకు ఎయిర్‌ ఏషియా ఇండియా ఇంటర్నేషనల్‌ రూట్‌ పర్మిట్లు కావాలి. ఏ మార్గం ఎంచుకున్నా ఒకే. ఇందుకోసం కొంత నష్టపోవడానికి కూడా సిద్ధమే. నిజాయితీగా సరైన మార్గంలో వెళితే పర్మిట్లు రావడానికి చాలా సమయం పడుతుంది. అడ్డదారిలో వెళ్లైనా సరే త్వరగా ఇంటర్నేషనల్‌ పర్మిట్లు తీసుకురండి. 
 
శాండిల్య : సరే సర్‌.. అంటే అడ్డదారిలో వెళ్లమంటారా? 
 
టోనీ ఫెర్నాండెజ్‌: యెస్‌. నేను చెప్పింది చేయి. లైసెన్స్‌కోసం ఏదైనా చేయి. ఇక్కడ మన పురోగతి చాలా నెమ్మదిగా ఉంది. పని పూర్తయ్యేటట్లు చూడు. 
 
శాండిల్య : ప్రస్తుత నియంత్రణ నిబంధనల ప్రకారం చూస్తే మనం మరో మార్గంలో వెళ్లాలి. ప్రభుత్వంలో ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో నాకు తెలుసు. కీలక స్థానంలో ఉన్న పై స్థాయి వ్యక్తి నుంచి కింద స్థాయి వరకు వెళ్లాలి. 
 
టోనీ ఫెర్నాండెజ్‌: స్థానికంగా ఉన్న దూబే, మీరు కలిసి చూసుకోండి. వారితో బేరసారాలు చేయండి. ఎలా చేస్తారన్నది నీ ఇష్టం. నువ్వు అంతర్జాతీయ లైసెన్స్‌ తీసుకువస్తే మీకు అదనపు విమానాలను సమకూరుస్తాను. 
 
శాండిల్య : ‘సమర్థత’ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనతో మనం జాగ్రత్తగా డీల్‌ చేస్తే మొత్తం పనయిపోతుంది. పైగా గతంలో చంద్రబాబు వద్ద ఆర్థికమంత్రిగా పనిచేసిన అశోక్‌ గజపతిరాజే ఇప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన మనతో ప్రత్యక్షంగా కనిపించడానికి ఇష్ట పడటం లేదు కానీ అడిగిన పని చేసి పెడతా అన్నారు. ఇలాంటివాడు మనతో ఉండటం మన అదృష్టం.  
 
హైదరాబాద్‌ కేంద్రంగానే సాగిన వ్యవహారం.. 
ఈ మొత్తం వ్యవహారమంతా హైదరాబాద్‌ కేంద్రంగానే జరిగినట్లు మరికొన్ని సాక్షాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆడియో టేపులకు మరింత బలం చేకూర్చే విధంగా ఈ రాయబేరం కోసం సింగపూర్‌కు చెందిన కంపెనీని రంగంలోకి దింపడానికి ఎయిర్‌ ఏషియా హైదరాబాద్‌ నోవాటెల్‌లో సమావేశమైనట్లు సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 21, 2015లో హైదరాబాద్‌లో జరిగిన 11వ ఎయిర్‌ ఏషియా ఇండియా బోర్డు మీటింగ్‌లో సింగపూర్‌కు చెందిన హెచ్‌ఎన్‌ఆర్‌ ట్రేడింగ్‌ పీటీఈని లాబీ కోసం నియమిస్తూ తీసుకున్న కాపీని మనీ కంట్రోల్‌ వెబ్‌సైట్‌ వెలుగులోకి తీసుకొచ్చింది. టేపుల్లో ఫెర్నాండెజ్‌ స్థానికంగా ఉన్న వ్యక్తిని రాయబేరాలకు తీసుకోమనడం.. హైదరాబాద్‌ కేంద్రంగా బోర్డు సమావేశంలో హెచ్‌ఎన్‌ఆర్‌ ట్రేడెండ్‌కు చెందిన రాజేంద్ర దూబేకు బాధ్యతలు అప్పచెప్పడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. అప్పటికి ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ఆడియో టేపులు వెలుగులోకి రాకపోవడంతో చంద్రబాబు హైదరాబాద్‌ కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి విదితమే. ఓటుకు కోట్లు కుంభకోణం బయటపడిన తర్వాతనే చంద్రబాబు తన కార్యక్షేత్రాన్ని అమరావతికి మార్చారు. కాగా మలేషియా ఎయిర్‌లైన్స్‌ కంపెనీ ఈ రాయబేరాల కోసం ఒక సింగపూర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది.  
 
ఇదీ ఎయిర్‌ ఏషియా కుంభకోణం.. 
మలేషియాకు చెందిన బడ్జెట్‌ ఎయిర్‌ లైన్స్‌ సంస్థ ఎయిర్‌ ఏషియా 2014లో టాటా గ్రూపుతో కలిసి దేశీయ విమానయాన రంగంలోకి అడుగుపెట్టింది. కానీ అప్పటి నిబంధనల ప్రకారం స్థానికంగా 5 ఏళ్లు సర్వీసులు నడిపి, 20 విమానాలు కలిగిన ఉన్న సంస్థలకు మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అనుమతిచ్చేవారు. దీన్నే 5/20 నిబంధన అని పేర్కొంటారు. కానీ ఎయిర్‌ ఏషియా ఇండియాకు విదేశీ సర్వీసులు నడపడానికి గాను ఈ నిబంధనను మార్చాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చింది. కానీ దీన్ని స్పైస్‌ జెట్, జెట్‌ ఎయిర్‌వేస్‌ వంటి స్థానిక విమానయాన కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా జూన్, 2016లో 5/20 నిబంధనను సవరిస్తూ అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరణ ప్రకారం ఐదేళ్ల సర్వీసు లేకుండా కేవలం 20 విమానాలు ఉంటే అంతర్జాతీయ సర్వీసులు నడుపుకోవచ్చు. ఈ నిబంధన వల్ల మలేషియాకు చెందిన ఎయిర్‌ ఏషియా, విస్తారా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు భారీ ప్రయోజనం జరిగింది. ఆ విధంగా ఎయిర్‌ ఏషియా దేశీయ విమానయానంలోకి అడుగు పెట్టిన రెండేళ్లలోనే ఈ లైసెన్స్‌ను దక్కించుకుంది.  
 
ఇలా బయటకు వచ్చింది... 
రతన్‌ టాటా, సైరస్‌ మిస్త్రీ మధ్య జరిగిన వివాదంతో ఈ కేసు బయటకు వచ్చింది. అప్పటి టాటా గ్రూపు చైర్మన్‌గా ఉన్న సైరస్‌ మిస్త్రీ ఎయిర్‌ ఏషియా లైసెన్స్‌లు దక్కించుకోవడంలో రూ.22 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ 2017మార్చిలో శాండిల్యాను ప్రశ్నించింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన సీబీఐ.. ఫెర్నాండెజ్‌తో సహా పలువురిపై కేసులు నమోదు చేసింది. హెచ్‌ఎన్‌ఆర్‌ ట్రేడింగ్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎయిర్‌ ఏషియా ఇండియా ఆ సంస్థకు రూ.12.28 కోట్లు చెల్లించి, ఈ మొత్తాన్ని రాయబేరాలకు వినియోగించినట్లు సీబీఐ పేర్కొంటోంది. విచారణలో భాగంగా 6వ తేదీ ఫెర్నాండేజ్‌ను హజరు కావాల్సిందిగా సీబీఐ సమన్లు పంపింది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం వేగంగా జరుగుతోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top