పల్నాడులో ‘పే’కాట క్లబ్‌!

Cards Club In Palnadu Guntur - Sakshi

దాచేపల్లిలో మూతపడ్డ క్లబ్‌ను తెరిచేందుకు సన్నాహాలు

పేకాట క్లబ్‌కు పచ్చజెండా         ఊపిన చినబాబు!

అధికారపార్టీ ఎమ్మెల్యే అండతో చకచకా ఏర్పాట్లు

వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభోత్సవానికి ముహూర్తం

సాక్షి, గుంటూరు: జిల్లాలో పేకాట క్లబ్బులు ఒక్కొక్కటిగా తెరుచుకోనున్నాయి. ఏడాది క్రితం మూతపడిన దాచేపల్లి పేకాట క్లబ్‌ను తెరిచేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. పల్నాడుప్రాంతానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లోనే మొదటి నుంచి ఈ పేకాట క్లబ్‌ నడిచిన విషయం విదితమే. అప్పట్లో వైఎస్సార్‌ సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి తదితరుల ఆందోళనతో పేకాట క్లబ్‌ మూతపడింది. కోర్టు అనుమతులు ఉన్నాయంటూ నిర్వాహకులు క్లబ్‌ను తెరవడంతో ఎలా అడ్డుకోవాలో తెలియక పోలీసులు మల్లగుల్లాలుపడ్డారు. క్లబ్‌కు ఎదురుగా అద్దంకి – నార్కెట్‌పల్లి ప్రధాన రహదారిపై రోడ్డుకు రెండు వైపులా పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీపేరుతో అడ్డుకునేందుకు యత్నించినా పేకాట జోరుగా సాగింది. అదే సమయంలో దాచేపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద గంజాయి లోడుతో వెళ్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకుని డ్రైవర్‌ను విచారించారు. పేకాట క్లబ్‌కు ఆ గంజాయిని తీసుకెళ్తున్నానని, గతంలో అనేక సార్లు సరఫరా చేశానని డ్రైవర్‌ అంగీకరించడంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్న పోలీసు ఉన్నతాధికారులుదీన్ని అనుకూలంగా మలుచుకుని పేకాట క్లబ్‌ను మూసివేయించారు. నిర్వాహకులు సైతం చేసేది లేక తట్టాబుట్టా సర్దుకున్నారు. ఏడాది క్రితం మూతబడ్డ పేకాట క్లబ్‌ను మళ్లీ తెరిచేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటుండటంపై పోలీస్‌ ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నారు.

ముఖ్యనేత కనుసన్నల్లో పేకాట క్లబ్‌
పల్నాడుకు చెందిన అధికార పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో పేకాట క్లబ్‌ ఏర్పాటు అవుతోందనేది బహిరంగ రహస్యమే. రెండేళ్ల క్రితం పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేయకపోవడంతో పేకాట క్లబ్‌ ముఖ్యనేత ఆదేశాలతో యథేచ్ఛగా నడిచింది. వైఎస్సార్‌ సీపీ నేతలు ఎన్నో ఆందోళనలు చేపట్టారు. అధికారపార్టీ ఎమ్మెల్యే అవినీతిని బయటపెడతానంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్‌ చేశారు. క్లబ్‌ నిర్వహణపై వైఎస్సార్‌సీపీ జిల్లా నేతలంతా పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో అప్పట్లో ఈ పేకాట క్లబ్‌ మూతపడింది. ఆ తరువాత కోర్టు అనుమతి అంటూ అధికార పార్టీ ముఖ్యనేత పేకాట క్లబ్‌ పంచాయితీని చినబాబు వద్ద పెట్టి ఏడాదిన్నర క్రితం మళ్లీ తెరిచారు. రూరల్‌ ఎస్పీ వెంకటప్పలనాయుడు సీరియస్‌గా తీసుకుని మూసివేయించారు. అక్రమ మైనింగ్‌ వ్యవహారం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్వారీలు మూతపడ్డాయి. దీంతో అక్రమ ఆదాయానికి అలవాటుపడ్డ అధికారపార్టీ ముఖ్యనేత చినబాబు ఆశీస్సులతో మళ్లీ పేకాట క్లబ్‌ను తెరిపించేందుకు సమాయత్తమయ్యారు. క్లబ్‌కు మరమ్మతులు చేస్తున్నారు. రూరల్‌ ఎస్పీ వెంకటప్పలనాయుడు త్వరలో బదిలీ అవుతారని, ఆ తరువాత క్లబ్‌ను నడుపుతామని పేకాటరాయుళ్లకు నిర్వాహకులు చెబుతున్నట్లు తెలిసింది. పల్నాడులో రెండేళ్లుగా పంటలు దెబ్బతిని, గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కూలిపనులు లేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో దాచేపల్లి పేకాట క్లబ్‌ తెరుచు కుంటే పల్నాడు యువత పేకాడి అప్పుల పాలై కుటుం బాలను రోడ్డున పడేసే ప్రమాదం ఉంది. గతంలో సైతం అనేక కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి.

జిల్లాలో మరికొన్ని...
పల్నాడు ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత అండతో దాచేపల్లిలో పేకాట క్లబ్‌ తెరుచుకోవడంతో జిల్లాలోని చిలకలూరిపేట, మంగళగిరి, గుంటూరులో పేకాట క్లబ్‌ల ఏర్పాటుకు ఓ మంత్రి కనుసన్నల్లో వ్యూహరచన జరుగుతోందని సమాచారం. గతంలో సైతం సదరు మంత్రి పోలీస్‌ ఉన్నతాధికారులపై తెచ్చిన ఒత్తిడితో వారు సీఎం వద్ద పంచాయితీ పెట్టడం, అది టీడీపీలో  చిచ్చు రగిల్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే స్థాయి నేత పేకాట క్లబ్‌ ఏర్పాటు చేస్తే తామేం తక్కువ తిన్నామా అన్నట్లు మిగతా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పోటీపడుతున్నట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top