తోడబుట్టి.. తోడుగా గిట్టి!

Brothers Died Same Day With Heart Strokes In Kurnool - Sakshi

వారిద్దరూ అన్నదమ్ములు..ఇద్దరికీ పెళ్లిళ్లయి పిల్లలు కలిగినా కలిసిమెలిసి ఉండేవారు. ఉమ్మడి కుటుంబంతో అందరికీ ఆదర్శంగా ఉండేవారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ అన్నదమ్ముల బంధానికి సరైన నిర్వచనంగా నిలిచారు. వీరిద్దరినీ ఎవరూ వేరు చేయలేరనేంతగా వారి బంధం కొనసాగింది. చివరకు మృత్యువు కూడా వారిని విడదీయలేకపోయింది. అన్న వెంటే తమ్ముడు కానరాని లోకాలకు తరలిపోయాడు.

 కౌతాళం/ కౌతాళం రూరల్‌: కామవరంలో ఒకే రోజు అన్నదమ్ములు మృతి చెందటంతో విషాదఛాయలు అలుముకున్నాయి.. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన చిదానంద, నాగమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. కుమారులు నాగరాజు(48), మల్లయ్య(45) గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు. ఎనిమిది నెలల క్రితం నాగరాజుకు, నెల క్రితం మల్లయ్యకు గుండె ఆపరేషన్‌ చేశారు. ఈక్రమంలో ఇంటి వద్ద ఇద్దరు విశ్రాంతి తీసుకునేవారు. మంగళవారం ఇద్దరికీ గుండెనొప్పి రావడంతో  కర్నూలుకు తరలించారు. చికిత్స నుంచి కోలుకోలేక నాగరాజు గురువారం మృతి చెందాడు. శుక్రవారం తెల్లవారుజామున మల్లయ్య కూడా కన్నుమూశాడు. ఒక రోజు ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నాగరాజుకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. మల్లయ్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top