ప్రేమ..పెళ్లి..విషాదం

Bride Suspicious death in Hyderabad - Sakshi

పన్నెండు రోజులకే వధువు అనుమానాస్పదంగా మృతి  

హత్య చేసి..ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడంటూ మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ

సనత్‌నగర్‌: మనసారా ప్రేమించింది...తల్లిదండ్రులను కూడా ఎదిరించి కోరుకున్న వాడినే వరించింది. ఎక్కడున్నా తమ కూతురు సుఖంగా ఉంటుందని అనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశ అడియాసే అయ్యింది. పెళ్లయిన రెండు వారాలకే పరలోకాలకు చేరింది. హత్య చేశారా..? ఆత్మహత్య చేసుకుందా...? తెలియదుగానీ ఆమె తలపై గాయాలు ఉండడంతో తమ కూతురిని...అల్లుడే హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ  తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. బోరబండ సమీపంలోని పాండురంగ నగర్‌కు చెందిన అల్లూరి ప్రసాద్‌కు కూకట్‌పల్లిలో రిబ్బర్‌ ప్రొడక్టస్‌ పరిశ్రమ ఉంది. ఇందులో పాండురంగ నగర్‌ సమీపంలో రామారావునగర్‌కు చెందిన దాసరి కార్తీక్‌ పనిచేసేవాడు. ఈ క్రమంలోనే బీటెక్‌ పూర్తిచేసి టెక్‌ మహేంద్రలో  ఉద్యోగం చేస్తున్న ప్రసాద్‌ కుమార్తె పూర్ణిమ అన్నపూర్ణతో కార్తీక్‌కు పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ఇద్దరూ చనువుగా ఉండేవారు. ఇది గమనించిన ప్రసాద్‌ కార్తీక్‌ను ఉద్యోగంలోంచి తొలగించాడు.

అయినా ఇద్దరూ తరచు కలుసుకునేవారు. ఈ క్రమంలోనే గత నెల 22వ తేదీన  సింహాచలంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సనత్‌నగర్‌ పోలీస్టేషన్‌కు వచ్చి తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. కార్తీక్, పూర్ణిమ అన్నపూర్ణ తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి పరిస్థితిని వివరించారు. అయితే కూతురిని తీసుకెళ్లేందుకు ప్రసాద్‌ కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బోరబండ సమీపంలోని స్నేహపురి కాలనీలో కార్తీక్‌ కొత్తకాపురం పెట్టాడు. కార్తీక్‌ ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో పనిచేస్తుండగా, పూర్ణిమ అన్నపూర్ణ టెక్‌ మహేంద్రలో ఉద్యోగాన్ని కొనసాగిస్తోంది. ఏం జరిగిందో ఏమో గానీ ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం సమయంలో పూర్ణిమ అన్నపూర్ణ ఉరి వేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు క్లూస్‌ టీమ్‌తో కలిసి సంఘటనాస్థలికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లతోపాటు, తలపై గాయమై, రక్తం కారడంతో పూర్ణిమ మరణంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. డైరీలో సూసైడ్‌ నోట్‌ కూడా రాసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీఆస్పత్రికి తరలించారు.

పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఆమె మృతిపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఘటనాస్థలంలో లభ్యమైన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. అయితే తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తండ్రి ప్రసాద్‌ ఆరోపిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు పోలీసుల ద్వారా తమ కుమార్తె మరణవార్త తెలిసిందని, వెంటనే వెళ్లి చూడగా అప్పటికే కార్తీక్‌ మద్యం సేవించినట్టు కనిపించాడన్నారు. పెళ్లి జరిగిన నాటి నుంచి కూతురు తమతో మాట్లాడలేదని తండ్రి చెబుతున్నారు. కూతురిది ముమ్మాటికీ హత్యేనని, ఇందులో కార్తీక్‌తో పాటు ఆయన తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పూర్ణిమ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని, కిందకు దించే ప్రయత్నం చేయగా,  ఒక్కసారిగా కిందపడడంతో తలకు గాయమైందని,  108కి  సమాచారం ఇవ్వగా అప్పటికే అన్నపూర్ణ మృతి చెందినట్టు నిర్థారించారని కార్తీక్‌ పోలీసులకు వివరించారు. 

ఎస్‌ఎంఎస్‌ కారణంగా గొడవ జరిగిందా?
సోమవారం కార్తీక్‌ పుట్టినరోజు కావడంతో ఇంట్లో పార్టీ జరిగినట్టు తెలిసింది. మద్యం సేవించిన కార్తీక్‌కు భార్యతో చిన్నపాటి ఘర్షణ తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో భార్య పూర్ణిమ అన్నపూర్ణ సెల్‌కు ఓ ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. అయితే ఆ ఎస్‌ఎంఎస్‌ను వెంటనే తీసేయడంతో కార్తీక్‌ అనుమానం పెంచుకుని మరోసారి గొడవ పడినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె మరణించింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top