
దావణగెరె: దారితప్పిన ప్రేమ విషాదాంతమైంది. పెళ్లయిన ఒక యువతి, ప్రియునితో కలిసి పరారయ్యారు. ఇంతలో ఆ ప్రేమజంట మధ్య జరిగిన చిన్న గొడవతో విరక్తి చెందిన ప్రేయసి పురుగులమందు ఆత్మహత్యాయత్నం చేయగా, ఎక్కడ తాను పోలీసులకు పట్టుబడాల్సి వస్తుందోనని భయపడిన ప్రేమికుడు తన ప్రేయసి చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘోరం దావణగెరె జిల్లాలో జరిగింది. వివరాలు.. జిల్లాలోని హŸన్నాళి తాలూకా కమలాపుర గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు, రంజిత అనే యువతి ప్రేమించుకున్నారు. అయితే రంజితాకు ఆమె తల్లిదండ్రులు వేరే యువకునితో వివాహం జరిపించారు.
దీంతో ఇష్టం లేని పెళ్లిని ధిక్కరించి రంజితా మహేష్‌తో కలిసి ఉండాలని నిర్ణయించుకొంది. ఈ క్రమంలో ఇద్దరు ఇల్లు వదిలి పారిపోయారు. హావేరి జిల్లా రాణిబెన్నూరు బస్టాండ్‌లో వీరిద్దరి మధ్య ఎందుకో వాగ్వాదం జరిగింది. జీవితంపై విరక్తి చెందిన రంజిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను స్థానికులు గమనించి దావణగెరెలోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె కోలుకుంటోంది, శనివారం డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. అయితే ఎక్కడ రంజిత తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తుందో, తనను పోలీసులు అరెస్ట్ చేస్తారేమోననే భయంతో మహేష్ శుక్రవారం రాత్రే ఆస్పత్రికి వచ్చి మెట్ల వద్దే ఇనుప రాడ్‌కు పంచెను కట్టుకొని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై బడావణె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.