సెల్‌ఫోన్ల చోరీ: హన్మకొండ టు పాతగుట్ట..!

Boy Who Steals Mobile Phones From Hanmakonada Caught In Yadadri - Sakshi

పట్టుకునే క్రమంలో తప్పించుకున్న వైనం ‘గుట్ట’లో తలదాచుకున్న ముఠా సభ్యులు

సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పుణ్యక్షేత్రంలో ఉన్నట్టు గుర్తించిన హన్మకొండ పోలీసులు

సినీ ఫక్కీలో ఛేజింగ్‌.. ఖాకీల అదుపులో బాలుడు

సాక్షి, యాదగిరిగుట్ట: చాకచక్యంగా సెల్‌ఫోన్లను కొట్టేస్తూ వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ జిల్లా పోలీసుల కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న ఓ ముఠా జిల్లాలోని యాదగిరిగుట్టలో తలదాచుకుంది. ఇటీవల ఈ ముఠాలోని ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్న అక్కడి పోలీసులు ముఠా సభ్యుల సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా యాదగిరిగుట్టలో ఉన్నట్టు గుర్తించారు. మూడు బృందాలుగా వచ్చిన హన్మకొండ పోలీసులు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ లాడ్జిపై దాడి చేయగా అప్పటికే మఫ్టీలో వచ్చింది ఖాకీలని గుర్తించిన ఆ ముఠా సభ్యులు పారిపోయారు. సినీఫక్కీలో ఛేజింగ్‌ చేసి ఆ ముఠాలోని మరో బాలుడిని అదుపులోకి తీసుకోగా మిగతావారు పరారయ్యారు. ఆ ముఠా సభ్యులను ఎలగైనా పట్టుకోవాలని హన్మకొండ పోలీసులు స్థానిక పోలీసుల సహాయంతో యాదగిరిగుట్టలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

హన్మకొండ పోలీసుల కథనం మేరకు.. హన్మకొండలో నివాముంటున్న ఓ న్యాయవాదికి చెందిన సెల్‌ఫోన్‌ పోయిందని అక్కడి పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు కొద్ది రోజులకే పదుల సంఖ్యలో ఫోన్లు చోరీకి గురైనట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు రద్దీ ప్రాంతాల్లోని సీసీ పుటేజీలను పరిశీలించగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనపించాడు. అతడి వెంట ఉన్న ఓ బాలుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో కర్నూల్‌ జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన సుమారు ఎనిమిది మంది (ఇందులో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు, మరో ఇద్దరు చిన్నారులు) ఉన్నారు. ముగ్గురు మహిళల్లో ఓ గర్భిణి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

యాదగిరిగుట్ట: సెల్‌ఫోన్‌ అపహరిస్తూ పట్టుబడిన దొంగ (ఫైల్‌)

సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా...
పోలీసుల అదుపులో ఉన్న బాలుడు తమకు చెందిన ముఠా సభ్యుడి ఫోన్‌ నంబర్‌ చెప్పాడు. దీంతో హన్మకొండ పోలీసులు ఆ నంబర్‌ లొకేషన్, సిగ్నల్స్‌ ఆధారంగా సోమవారం రాత్రి యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని పాతగుట్టకు హన్మకొండ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా పోలీసులు వచ్చారు. దీంతో పట్టణంలోని ఓ ప్రైవేట్‌ లాడ్జీకి మకాం మార్చారు. పాతగుట్టలో టెక్నాలజీ లొకేషన్‌ టీమ్‌ తిరుతున్న క్రమంలో ఓ ప్రైవేట్‌ లాడ్జీ వద్దకు రాగానే సిగ్నల్‌ ట్రేస్‌ అయ్యింది. దీంతో అప్పటికే అప్రమత్తమైన దుండగులు మఫ్టీలో ఉన్న ఖాకీలతో వచ్చిన తమ ముఠాలోని బాలుడిని చూసి లాడ్జికి వెనుక భాగంలో ఉన్న ప్రహరీ దూకి పాతగుట్టకు వెనుక భాగంలో ఉన్న పెద్దగుట్టపైకి పరుగెత్తారు.

ఇందులో మహిళలు దాతారుపల్లి వైపునకు వెళ్లి, అక్కడి నుంచి పెద్దగుట్టపైకి, మరో ఇద్దరు పురుషులు గుట్టల్లో రాళ్ల మధ్యలో నుంచి పెద్దగుట్టపైకి వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. వీరితో ఉన్న మరో బాలుడిని, హన్మకొండలో పట్టుబడిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి పేర్లు అడిగితే సరిగా చెప్పడం లేదని, వారి వద్ద ఆధార్‌ కార్డులు లేనట్లు తెలుస్తోంది.  దీంతో అప్రమత్తమైన హన్మకొండ పోలీస్‌ టీంలు, యాదగిరిగుట్ట పోలీసులకు స మాచారం ఇచ్చారు. హన్మకొండ, యాదగిరిగుట్ట పోలీసులు  బృందాలుగా విడిపోయి ముఠా సభ్యులను పట్టుకునేందుకు యాదగిరిగుట్టను జల్లెడ పడుతున్నారు. అయితే లాడ్జిలో పార్కిం గ్‌ చేసిన ముఠాకు చెందిన కారును పరిశీలించగా అందులో దాదాపు 80కి పైగా ఉన్న సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రెండు రంగుల చొక్కాలు ధరించి..
ఒక్కో సెల్‌ఫోన్‌ దొంగ ఒంటిపై రెండు రంగులు కనిపించే చొక్కా (బయటకి ఒక రంగు, లోపల నుంచి మరో రంగు).. దాని లోపల కాలర్‌ ఉన్న టీషర్ట్, దాని కింద రింగ్‌గా ఉండే టీషర్టు ధరించారని, పట్టుబడే క్రమంలో వెంట వెంటనే చొక్కా, టీషర్టు మార్చి దృష్టి మళ్లించడానికి ముఠా సభ్యులు పకడ్బందీగా చేశారని పోలీసులు అంటున్నారు. 

రద్దీ ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని..
సెల్‌ఫోన్ల చోరీ ముఠా సభ్యులు కర్నూల్‌ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే వీ రు రద్దీగా ఉండే ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని ప్రజల వద్దనుంచి చాకచక్యంగా సెల్‌ఫోన్లను తస్కరిస్తున్నట్టు తెలుస్తోంది.  ఇటీవల హన్మకొండలో పట్టుబడిన బాలుడికి చెందిన అక్క, బావ, వారి కుమారుడు వచ్చారని, పండుగలు జరిగినప్పుడు, రద్దీ గా ఉండే ప్రాంతాలు, కూరగాయల దుకా ణాల్లో, కూడళ్లు, పుణ్యక్షేత్ర ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు కొట్టేసినట్లు సమాచారం. హన్మకొండలో బాలుడితో కలిపి నలుగురు అనుకున్న పోలీసులకు పాతగుట్టకు రాగానే మరో నలుగురు ఎక్కువ కనిపించడంతో కంగుతిన్నారు. అసలు ఈ ముఠా సభ్యులు ఎంత మంది..? వీరు ఎక్కడ ఉన్నారని ఆరా తీస్తునట్లు తెలుస్తోంది.

గుర్తింపు కార్డులు లేకుండానే..
లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వచ్చిన వివిధ ప్రాంతాల్లో భక్తులు యాదగిరిగుట్ట పట్టణంతో పాటు పాతగుట్టలో ఉన్న పలు ప్రైవేట్‌ లాడ్జీల్లో బస చేస్తుంటారు. అయితే ఇదే తరుణంలో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేసిన దొంగలు సైతం భక్తి ముసుగులో ఇక్కడికి వచ్చి ప్రైవేట్‌ లాడ్జీల్లో తలదాచుకుంటున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే లాడ్జీల నిర్వహకులు, వాటిని కాంట్రాక్టు తీసుకున్న వారు బస చేయాలనుకునే వారి గుర్తింపు కార్డులు, ఎలాంటి ఆధారాలు లేకుండానే గదులను అద్దెకు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాకుండా ప్రతి లాడ్జీలో సీసీ కెమెరాలు ఉండాలని పోలీసులు గతంలోనే సూచిం చినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. హన్మకొండలో సెల్‌ఫోన్లు దొంగతనం చేసిన ముఠా సభ్యులకు చెందిన ఐడీ ఫ్రూఫ్, సీసీ కెమెరాలు ఉంటే మరింత సులువుగా కేసు ఛేదించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అంతే కాకుండా లాడ్జీ సమీ పంలో ప్రస్తుతం కర్నూల్‌ ముఠాకు చెందిన రెండు చొప్పున కార్లు, బైక్‌లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. కచ్చితంగా మఠా సభ్యులు తమ విలువైన వాహనాల కోసం రావాలి కాబట్టి పోలీసులు అక్కడే మకాం వేశారు. వీరితో పాటు యాదగిరిగుట్ట పోలీసులు సైతం ముఠా సభ్యులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

‘గుట్ట’లో పట్టుబడిన దొంగతో సంబంధాలున్నాయా..?
మూడ్రోజుల క్రితం యాదగిరిగుట్ట పట్టణంలోని బస్టాండ్‌ ఆవరణలో యాదాద్రి క్షేత్రానికి వచ్చిన భక్తుల వద్ద సెల్‌ఫోన్లు అపహరిస్తూ స్థానికులకు ఓ దొంగ చిక్కాడు. చితకబాదిన అతడిని పోలీసులకు అప్పగించారు. అయితే ఆ దొంగకు, హన్మకొండ నుంచి వచ్చిన సెల్‌ఫోన్ల చోరీ ముఠాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. యాదగిరిగుట్టలో దొంగ దొరికిన మూడు రోజులకే ఇక్కడ ఓ ప్రైవేట్‌ లాడ్జిలో దొంగల ముఠా తలదాచుకోవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల యాదగిరిగుట్టలో పట్టుబడిన దొంగ అడ్రస్‌ తప్పుగా చెప్పి ఉంటాడని, అతడు కూడా కర్నూల్‌కు చెందిన ఈ ముఠాలోని సభ్యుడై ఉంటాడని స్థానికంగా చర్చ జరుగుతోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top